విశ్వక్ సేన్ రొటీన్ కు భిన్నమైన సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం కోసం కృషి చేస్తున్నాడు. అందులో భాగంగా మలయాళ మూవీ ‘అంగమలై డైరీస్’ను స్వీయ దర్శకత్వంలో ‘ఫలక్ నుమా దాస్’గా తెరకెక్కించి సక్సెస్ సాధించాడు. ఆ వెంటనే వచ్చిన ‘హిట్’ మూవీ కూడా అతనికి విజయాన్ని అందించింది. అయితే ఆ తర్వాత చిత్రాలేవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. తాజాగా స్వీయ దర్శకత్వంలో, పాన్ ఇండియా మూవీగా ‘దాస్ కా ధమ్కీ’ని రూపొందించాడు. అంతేకాదు… ఇందులో డ్యుయల్ రోల్ చేశాడు. మరి విశ్వక్ సేన్ తాజా ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో చూద్దాం.
కాన్సర్ ఫ్రీ వరల్డ్ గురించి కలలు కనే డాక్టర్ సంజయ్ రుద్ర (విశ్వక్ సేన్), అందుకోసం ఓ ఫార్ములా తయారు చేస్తాడు. అది చివరి దశలో ఉన్న టైమ్ లో హఠాత్తుగా రోడ్ యాక్సిడెంట్ లో మరణిస్తాడు. అతని సంస్థతో పది వేల కోట్ల రూపాయల డీల్ చేసుకున్న ధనంజయ్ (అజయ్) తన సంగతేమిటని సంజయ్ బాబాయ్ (రావు రమేశ్)ను నిలదీస్తాడు. ఇదిలా ఉంటే… అనాథ అయిన కృష్ణ దాస్ (విశ్వక్ సేన్) ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో వెయిటర్. కీర్తి అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. దాస్ పెద్ద కోటీశ్వరుడని భావించిన కీర్తి అతనితో చనువుగా మెలుగుతుంది. అతను కూడా నిజాన్ని దాచి అలానే బిల్డప్ ఇస్తాడు. కానీ దాసు చేసిన మోసం ఒకానొక సమయంలో బయట పడటంతో కీర్తి అతనితో తెగదెంపులు చేసుకుంటుంది. ఇదే సమయంలో దాస్ ను చూసిన సంజయ్ బాబాయ్ తన కంపెనీ, కుటుంబాన్ని నిలబెట్టడం కోసం ఓ పది రోజుల పాటు చనిపోయిన సంజయ్ గా నటించమని వేడుకుంటాడు. మరి సంజయ్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన దాస్ కు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? అందరికీ ధమ్కీ ఇచ్చే దాస్ కే ఎవరు? ఎలా ధమ్కీ ఇచ్చారు? అతను వాటిని ఎలా తిప్పి కొట్టాడు? అనేది మిగతా కథ.
సినిమా ఫస్ట్ హాఫ్ అంతా సో… సో… గా సాగిపోతుంది. స్టార్ హోటల్ వెయిటర్ ను గుడ్డిగా నమ్మి చదువుకున్న అమ్మాయి ప్రేమించడం ఏమిటో అర్థం కాదు… పైగా వాళ్ళిద్దరి ఓవర్ యాక్షన్ చూసి ఒకానొక సమయంలో చికాకూ కలుగుతుంది. అయితే… ఈ తలతిక్క సన్నివేశాలన్నింటికీ అర్థవంతమైన సమాధానం మనకు సెకండ్ హాఫ్ లో లభిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆడియెన్స్ కు కిక్ ఇచ్చేలా ఉంది. దాంతో అసలు కథ ఇప్పుడే మొదలు కాబోతోందనే భావన కలుగుతుంది. అక్కడ నుండి సినిమా మరో లెవల్ కు వెళ్ళింది. ముఖ్యంగా విశ్వక్ సేన్ కు సంబంధించిన రెండు పాత్రలు తెర మీద ఢీ అంటే ఢీ అంటూ తలపడే సన్నివేశాలు రక్తికట్టాయి. ప్రథమార్థంకు భిన్నంగా ద్వితీయార్థం జెట్ స్పీడ్ లో సాగిపోతుంది. కథ కంచికి చేరిందని భావిస్తున్న టైమ్ లో మరో ట్విస్ట్ తో ‘దమ్కీ -2’కు లీడ్ ఇస్తూ మూవీని ముగించారు.
సంజయ్ రుద్రగా, కృష్ణదాస్ గా విశ్వక్ సేన్ తన అభినయంతో మెప్పించాడు. పాజిటివ్ పాత్రలే కాదు… నెగెటివ్ పాత్రలూ చేసి మెప్పించగలనని నిరూపించుకున్నాడు. కృష్ణ దాస్ పాత్ర సాదా సీదాదే అయినా సంజయ్ రుద్రగా విశ్వక్ కొన్ని సన్నివేశాల్లో చేసిన యాక్షన్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. రావు రమేశ్ ఎప్పటిలానే తన పాత్రను అలవోకగా చేసేశాడు. కీర్తిగా టిపికల్ రోల్ ను నివేత పేతురాజ్ బాగానే చేసింది. ఇక హీరో స్నేహితులుగా హైపర్ ఆది, మహేశ్ పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టారు. ఇతర ప్రధాన పాత్రలను అజయ్, అక్షర గౌడ, మురళీ ధర్ గౌడ్, పృధ్వీరాజ్, సూర్య, రోహిణి, కాదంబరి కిరణ్, రజిత, అమిత్ శర్మ తదితరులు పోషించారు. ఉత్తరాది నటి ప్రణతి రాయ్ ప్రకాశ్ తొలిసారి తెలుగు సినిమాలో ఐటమ్ సాంగ్ లో మెరిసింది.
నిజానికి బెజవాడ ప్రసన్న కుమార్ అందించిన కథలో పెద్దంత కొత్తదనం లేదు. అయితే… తనదైన కథనం, మాటలు, దర్శకత్వ ప్రతిభతో విశ్వక్ సేన్ దీన్ని వాచబుల్ మూవీగా మలిచారు. ఓపక్క ద్విపాత్రాభినయం చేస్తూ, మరోపక్క నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షించడం సామాన్య విషయం కాదు. అతని ఎనర్జీ లెవల్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పనిలో పనిగా ప్రధమార్థంను ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. విశ్వక్ సేన్ రాసిన మాటలకూ థియేటర్ లో నవ్వుల జల్లులు కురిశాయి, అదే సమయంలో చాలా డైలాగ్స్ కు సెన్సార్ కత్తెర కూడా పడింది. లియోన్ జేమ్స్ సంగీతం, దినేష్ సినిమాటోగ్రఫీ మూవీకి ఎసెట్. ఇలాంటి కథకు వేరే నిర్మాత అయితే ఏ మాత్రం న్యాయం చేకూర్చలేడు. కొడుకు విశ్వక్ సేన్ కోసం కరాటే రాజు రిస్క్ తీసుకున్నారనే చెప్పాలి. దీన్ని పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేశారు కాబట్టి… ఆ రిస్క్ కు తగ్గ ప్రతిఫలం దక్కొచ్చు.
ప్లస్ పాయింట్స్
విశ్వక్ సేన్ డ్యుయల్ రోల్
లియోన్ జేమ్స్ మ్యూజిక్
ప్రొడక్షన్ వాల్యూస్
దర్శకత్వం
మైనస్ పాయింట్స్
ఓవర్ వయొలెన్స్
పండని మదర్ సెంటిమెంట్
ట్యాగ్ లైన్ : విశ్వక్ వన్ మ్యాన్ షో!