Chandramukhi 2 Telugu Review: ఒకప్పుడు రజనీకాంత్ హీరోగా పి.వాసు డైరెక్షన్లో తెరకెక్కిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. అలాంటి సినిమాకి ఇప్పుడు రాఘవ లారెన్స్ హీరోగా ఒక సీక్వెల్ అనౌన్స్ చేసి తెరకెక్కించారు. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన హర్రర్ కామెడీ ‘చంద్రముఖి 2’లో కంగనా రనౌత్ టైటిల్ రోల్‌లో నటించారు. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమా మీద అంచనాలు ఏర్పడగా సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఈరోజు రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
కథ:
రంగనాయకి (రాధిక) అనే ఒక కోటీశ్వరురాలి కుటుంబంలో ఒక్కసారిగా అనేక సమస్యలు వచ్చి పడడంతో స్వామీజీ (రావు రమేష్) ద్వారా కుల దైవాన్ని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి అని తెలుసుకుంటారు. దీంతో తమ కుల దైవాన్ని పూజ చేయాలని ఊరికి వెళ్లడంతో వేరే మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించి లేచిపోయిన కూతురు పిల్లలను కూడా తీసుకు రావాల్సి వస్తుంది. వారితో పాటు మదన్ (రాఘవ లారెన్స్) కూడా రాగా వారి కులదైవం గుడికి దగ్గరలోనే చంద్రముఖి ప్యాలెస్ లో బస చేస్తుంది. ఆ ఇంటిని కైలాష్ తనకు ఇవ్వడంతో బసవయ్య (వడివేలు) దాన్ని అమ్మే పనిలో భాగంగా వీరికి అద్దెకు ఇస్తారు. ఇక రంగనాయకి కుటుంబాన్ని ఇంట్లో దక్షిణం వైపు వెళ్లవద్దని బసవయ్య చెప్పినా వారిలో కొందరు వినకుండా అటు వైపు వెళ్లి చంద్రముఖిని నిద్రలేపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ కథలో వేటయ్య/సెంగోటయ్య (రాఘవ లారెన్స్) పాత్ర ఏంటి? చివరికి రంగనాయకి కుటుంబం ఎలా సమస్యల నుంచి బయటకు వచ్చేయండి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
హారర్ జోనర్ సినిమాల్లో ‘చంద్రముఖి’ని తన్నే సినిమానే లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ సినిమా ఆరోజుల్లోనే అనేక సంచలనాలు సృష్టించింది. అలాంటి సినిమాకి ఒక సీక్వెల్ ప్రకటించామంటే ఎలా ఉండాలి? దానికి మించి ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. కానీ ‘చంద్రముఖి 2’మొత్తం చంద్రముఖి సినిమానే మళ్ళీ పాత్రలు మార్చి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి హారర్ కామెడీ సినిమా అంటే రాఘవ లారెన్స్, రాఘవ లారెన్స్ అంటే హారర్ కామెడీ సినిమా అనేలా పేరు తెచ్చుకున్నారు. ‘ముని’ సినిమా మొదలు రాఘవ లారెన్స్‌కు వచ్చిన హిట్‌లన్నీ దాదాపు హార్రర్ కామెడీ సినిమాలే. అయితే రాఘవ లారెన్స్ హారర్ సినిమాలకి, ‘చంద్రముఖి’2కి ఏమాత్రం పోలిక లేదు. స్క్రీన్‌ప్లే, పాత్రలు సహా అంతా ‘చంద్రముఖి’ని యాజిటీజ్‌గా ఫాలో అయ్యారు. మొదటి భాగంలో జ్యోతిక చంద్రముఖి ఆత్మ వల్ల ఇబ్బంది పడడం, వంటివి సహజంగా ఉంటే ఎందుకో ఇందులో మాత్రం అంతా అసహజంగా అనిపించింది. హీరో ఇంట్రడక్షన్ ఫైట్ మొదలు ఆ గతరువాత మహల్‌కు వచ్చేటప్పుడు పాట, ఈ కుటుంబం దగ్గర అవమానాలు ఎదుర్కోవడం, ప్యాలెస్ పక్కన ఉండే పేద వాడి ఇంట్లో ఉండే అమ్మాయిని హీరో ఇష్టపడటం, ఆ అమ్మాయి ప్యాలెస్‌లో తిరుగుతూ దెయ్యం పట్టినట్లు బిల్డప్ ఇవ్వడం దాదాపుగా ‘చంద్రముఖి’నే దింపేసినట్టు అనిపించింది. మొదటి భాగం స్క్రిప్టు పక్కన పెట్టుకుని పాత్రలను మాత్రమే రీప్లేస్ చేసినట్లు అనిపించకమానదు. ఇక ఈ సినిమాలో కొంచెం కొత్తగా అనిపించిన అంశం ఏంటంటే మొదటి భాగంలో ఉండే రాజుకి ఒక ఆత్మను తీసుకురావడం, చంద్రముఖి పట్టిన పాత్రను ఇంటర్వల్‌కు పరిచయం చేయడం, ఫ్లాష్‌బ్యాక్‌ను మార్చి నిడివి పెంచడం కోసం ఆడిన ఆటలా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా కథ చాలా నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. వడివేలు కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు సరికదా లారెన్స్ వడివేలు మధ్య సీన్లు సహనానికి పరీక్ష పెడతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ బానే అనిపించినా ఆ తరువాత దానిని క్యారీ చేయడంలో విఫలం అయ్యారు. రాఘవ లారెన్స్, మహిమా నంబియార్‌ల లవ్ ట్రాక్, సహా పాటలు కధకి అడ్డుగా అనిపిస్తాయి. చంద్రముఖిలో వేంకటపతి రాజు ఇప్పుడు వేటయ్య ఎందుకు అయ్యాడు అంటే సమాధానం ఉండదు. ‘చంద్రముఖి’ మొదటి భాగంలో ఉండే ఫ్లాష్‌బ్యాక్‌కి కొత్త కోణం అద్ది చూపిద్దాం అనుకున్నా అది సినిమా లెంత్‌ను పెంచడానికే అనిపించింది.
నటీనటుల విషయానికి వస్తే:
ఇక నటీనటుల విషయానికి వస్తే రాఘవ లారెన్స్, కంగనా రనౌత్‌ల పెర్ఫార్మెన్స్ వరకుబాగానే ఉన్నా రజనీకి రీప్లేస్మెంట్ గా లారెన్స్ కొంత సెట్ అయ్యాడు. కానీ చంద్రముఖిగా కంగనా అలరించ లేకపోయింది అటు అందంలోనూ, అభినయంలోనూ చంద్రముఖిని ఏమాత్రం తెరమీద చూపించలేకపోయింది. ఇక వేటయ్య, సింగోటయ్య, మదన్ లాంటి పేర్లతో లారెన్స్ వన్ మ్యాన్ షో చేద్దాం అనుకున్నా అది కూడా పూర్తి స్థాయిలో వర్కౌట్ కాదు. రావు రమేష్ పాత్ర సీరియస్‌గానే ఉన్నా కూడా గెటప్ వింతగా ఉంది. వడివేలు కామెడీ, రాధిక పాత్రతో కొన్ని డైలాగులు మినహా వారికీ పెద్ద ప్రాధాన్యం లేదు. మిగిలిన పాత్రలన్నీ మమ అనిపించేశాయి. ఇక దర్శకుడి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది, రొటీన్ డైలాగులు సినిమాను మరింత రొటీన్ అనిపిస్తాయి. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎం.ఎం.కీరవాణి పాటలు కానీ, నేపథ్య సంగీతం కానీ ఆయన స్థాయికి తగ్గట్టు లేవు. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదనిపించింది.
ఫైనల్లీ: ‘చంద్రముఖి’ అంచనాలతో థియేటర్ కి వెళితే నిరాశ తప్పదు, ఇది ఏమాత్రం ఎగ్జైటింగ్ మూమెంట్స్ లేని ఒక రొటీన్ హారర్ డ్రామా.