తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన గరుడన్ అనే సినిమాని తెలుగులో భైరవం అనే పేరుతో రీమేక్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాని కె.కె. రాధామోహన్ శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు. గతంలో నాంది, ఉగ్రం లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన విజయ్ కనకమేడల ఈ సినిమాని రూపొందించారు. శంకర్ కుమార్తె అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
భైరవం కథ: తూర్పు గోదావరి జిల్లా దేవీపురం గ్రామంలో ఉన్న వారాహి అమ్మవారు చాలా పవర్‌ఫుల్. ఆ దేవాలయం ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ (జయసుధ) తన మనవడు గజపతి(మంచు మనోజ్), వరద (నారా రోహిత్), శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) ముగ్గురినీ సమానంగా పెంచుతుంది. నాగరత్నమ్మ మరణం తర్వాత ఆ దేవాలయం ట్రస్టీగా ఎన్నిక కావాలనుకున్న నాగరాజు (అజయ్) ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ శ్రీనుని ట్రస్టీగా నిలబెట్టి గెలిపిస్తారు. అయితే, అనుకోకుండా గజపతి చిక్కుల్లో పడిన సమయంలో నాగరాజు, గజపతి బావమరిది పులి (సందీప్ రాజ్)తో కలిసి అతన్ని కాపాడతాడు. ఇదిలా ఉండగా ప్రాణానికి ప్రాణంగా భావించే వరదను గజపతి చంపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినా సరే, శ్రీను పోలీసులకు అబద్ధం చెప్పి, వరద భార్య(దివ్య పిళ్ళై) దగ్గర చెడ్డవాడిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకరికొకరు ప్రాణంగా భావించే గజపతి, వరదను ఎందుకు చంపాల్సి వచ్చింది? శ్రీను, గజపతి కోసం ఎందుకు అబద్ధం చెప్పాడు? చివరికి అసలు ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
విశ్లేషణ :
నిజానికి ఇది రీమేక్ కావడంతో దర్శకుడు పెద్దగా ప్రయోగాల జోలికి వెళ్లలేదు. కేవలం హీరోల మధ్య ఎమోషన్స్‌ను బిల్డ్ చేసి, వారితోనే కథను నడిపించే ప్రయత్నం చేశాడు, అది కొంతవరకు సక్సెస్ అయింది కూడా. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. అత్యంత ప్రాణ స్నేహితులుగా మనోజ్, రోహిత్, మరియు వారికి నమ్మిన బంటుగా బెల్లంకొండ కరెక్ట్‌గా ఆ పాత్రలలో ఇమిడిపోయారు. నిజానికి ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్‌కి ఎస్టాబ్లిష్‌మెంట్‌గానే రాసుకున్నారు. మూడు పాత్రల పరిచయం, ఇదంతా ఒక పోలీస్ అధికారి నేరేషన్ ద్వారా సాగుతూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. అసలు కథ మొత్తం సెకండ్ హాఫ్‌లోనే మొదలవుతుంది. ప్రాణానికి ప్రాణంగా బతికిన స్నేహితులే ఒకరినొకరు చంపుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? స్నేహితుడి కోసం తప్పు చేసేందుకు సిద్ధమైన మరో స్నేహితుడు ఎందుకు ఆ స్నేహితుడినే చంపాలని భావించి, అతని చేతిలోనే హతమయ్యాడు అనే విషయాలను సెకండ్ హాఫ్‌లో ఆసక్తికరంగా రివీల్ చేయడం గమనార్హం. దీన్ని ఒక రస్టిక్ అండ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు, అందులో దాదాపు సఫలమయ్యాడు. నిజానికి ముగ్గురు క్యారెక్టర్లతో, వారి పెర్ఫార్మెన్స్‌తోనే స్క్రీన్ మీద మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశారు, అది చాలావరకు సక్సెస్ అయింది. కొన్ని చోట్ల ఏం జరగబోతుందని ఆసక్తి కలిగించారు, కానీ కొన్ని చోట్ల మాత్రం ఈజీగా అర్థమయిపోయేలా రాసుకోవడం కాస్త ఇబ్బందికర అంశం. అలాగే, సినిమాలో పాటలు, లవ్ ట్రాక్ కూడా అనవసరం. కానీ సినిమా నిడివి కోసమో లేక కమర్షియల్ విజిబిలిటీ కోసమో వాటిని బాగానే వాడుకున్నారు. నిజానికి సినిమాలో సాంగ్స్ ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లాయి, కానీ వాటి ప్లేస్‌మెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఈజీగా అర్థమయిపోయేలా ఉన్నా, సాయి శ్రీనివాస్ పూనకం ఎపిసోడ్ మాత్రం గూస్‌బంప్స్ తెప్పించేలా రాసుకున్నారు. అయితే, ఎమోషన్స్‌తో డ్రామాను మరింత రక్తి కట్టించే అవకాశం ఉన్నప్పటికీ, ఎందుకో ఆ విషయంలో కాస్త తడబడ్డారు. నిజానికి ప్రేక్షకులను కదిలించే పొటెన్షియల్ ఉన్న ఈ సబ్జెక్ట్, పూర్తిస్థాయిలో ఆ విషయంలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయలేకపోయింది. కమర్షియాలిటీ కోసం అనేక విషయాలు చొప్పించకుండా, కథకే స్టిక్ అయి ఉంటే బాగుండేదనిపిస్తుంది.
నటీనటుల విషయానికొస్తే, ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ శ్రీను అనే పాత్రలో పరకాయప్రవేశం చేశాడు. ముఖ్యంగా అతనికి పూనకం వచ్చిన ఎపిసోడ్‌లలో అయితే వేరే లెవెల్‌లో ఆకట్టుకున్నాడు. అలాగే, డాన్స్, యాక్షన్ సీన్స్‌లో కూడా అదరగొట్టాడు. నిజానికి ముగ్గురు హీరోలు ఉన్నప్పుడు స్క్రీన్ స్పేస్ విషయంలో ఏదో ఒక పక్షపాతం ఉంటుందేమో అనుకోవచ్చు, కానీ ఈ సినిమాలో ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక మంచు మనోజ్‌కి ఇది మంచి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. మంచిగా కనిపిస్తూనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఇమిడిపోయాడు. నారా రోహిత్ నటన సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అయింది. సెటిల్ట్ గా ఉండాల్సిన పాత్రలో నారా రోహిత్ పెర్ఫార్మెన్స్ పీక్స్ . ముగ్గురు హీరోలు ఎక్కడా తగ్గకుండా పోటాపోటీగా ఆకట్టుకునేలా నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, ఈ ప్రమోషన్స్‌లో కీలక పాత్ర పోషించాయి సినిమా సాంగ్స్. అవి వినడానికి బాగున్నాయి, కానీ ప్లేస్‌మెంట్స్ విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో శ్రీ చరణ్ పాకాల అదరగొట్టాడు. ఇక సెట్ వర్క్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎక్కడా సెట్ అని అర్థం కాకుండా, దాన్ని రియలిస్టిక్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు బ్రహ్మ కడలి సక్సెస్ అయ్యాడు. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ప్లస్ పాయింట్స్‌లో ఒకటిగా నిలుస్తుంది. అయితే ఎడిటింగ్ టేబుల్ మీద మరింత ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఫైట్స్ కాంపోజిషన్ బాగుంది. లోకేషన్స్ కూడా రియలిస్టిక్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి
ఫైనల్‌గా, ఈ భైరవం ఒక రస్టిక్ డ్రామా.. ఎంగేజింగ్ మూమెంట్స్ ఉన్నా, ప్రెడిక్టబుల్ స్టోరీ.