లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఆయన చేసిన ‘డ్రాగన్’ కూడా తెలుగులో మంచిగానే ఆడింది. దీంతో ఆయన ఈసారి ఏకంగా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ఒక సినిమా చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా, కీర్తిస్వరన్ అనే ఒక డెబ్యూ డైరెక్టర్ కథతో ‘డ్యూడ్’ సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అక్టోబర్ 17వ తేదీన దీపావళి సందర్భంగా ఈ సినిమాని తమిళనాడులో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ కావడంతో తెలుగులో కూడా గట్టిగానే రిలీజ్ అయింది. దానికి తోడు, యంగ్ సెన్సేషన్ మమితా బైజు హీరోయిన్‌గా నటించడంతో ఈ సినిమా మీద మరింత అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో, ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
డ్యూడ్ కథ:
ఇంజనీరింగ్ చదివిన గగన్ (ప్రదీప్) తన మామ, మినిస్టర్ (శరత్ కుమార్) కుమార్తె కుందన (మమితా బైజు)తో కలిసి, తనకు నచ్చిన రీతిలో ఒక స్టార్టప్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే కుందన ఒకరోజు గగన్ మీద ఉన్న ప్రేమను బయట పెడుతుంది. అయితే, అది ఒప్పుకోని గగన్, ఆమె మీద అలాంటి ఫీలింగ్స్ లేవని, చిన్ననాటి నుంచి స్నేహితురాలిని భావిస్తూ ఉండేవాడినని చెబుతాడు. తర్వాత ఆమె మీద ఉన్నది ప్రేమేనని అర్థం చేసుకుంటాడు. ఈ విషయాన్ని ముందుగా ఆమెకి చెప్పకుండా మామకు చెప్పి పెళ్లికి సిద్ధం చేస్తాడు. అయితే, పెళ్లికి ఒక రోజు ముందు తాను మరో అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పి షాక్ ఇస్తుంది కుందన. ఈ విషయాన్ని తన తండ్రి దగ్గరకు చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఆమెకు తండ్రి షాక్ ఇస్తాడు. అసలు ఆమె తండ్రి ఇచ్చిన షాక్ ఏంటి? చివరికి గగన్, కుందన ఒకటయ్యారా? లేక కుందన ప్రేమించిన వ్యక్తి ఒకటయ్యారా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ప్రదీప్ నుంచి ఒక సినిమా వస్తుందంటే కేవలం తమిళ ఆడియన్స్ మాత్రమే కాదు, తెలుగు ఆడియన్స్ కూడా ఎలాంటి సినిమా వస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్, టీజర్ కట్స్‌తో కూడా అలాంటి ఆసక్తి రేకెత్తించడంలో ప్రదీప్ సక్సెస్ అయ్యాడు. వేరే దర్శకుడు కావడంతో, ప్రదీప్ మార్క్ మిస్ అవుతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ, అవేవీ మిస్ కాకుండా చూసుకున్నాడు ప్రదీప్. కథగా చెప్పాలంటే, ఇది ఒక పరువు హత్య నేపథ్యంను ఎత్తి చూపే సినిమా. కానీ, ట్రీట్‌మెంట్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎక్కడా, ఎవరినీ నొప్పించకుండానే, తప్పును తప్పుగా చూపెట్టే ప్రయత్నం చేశారు. అయితే, దాని కోసం ఎంచుకున్న మార్గం మాత్రం చాలా బోల్డ్‌గా ఉంది. ఇవాల్టి రోజుల్లో ఉన్న రిలేషన్‌షిప్స్‌ని ఎత్తి చూపుతూ, మరోపక్క ఒకప్పటి సంప్రదాయాలను ప్రశ్నిస్తూ ఈ సినిమా సాగిపోయింది.
వాస్తవానికి, ఫస్ట్ హాఫ్ మొదలైనప్పుడు ఏదో గందరగోళంగా, అల్లరి అల్లరిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ, కథలో అసలు ఎలిమెంట్ ప్రారంభమయ్యాక మాత్రం చాలామందికి షాక్ కలిగించేలా ఈ సినిమా ట్రీట్‌మెంట్ ఉంది. వాస్తవానికి ఇలాంటివి నిజ జీవితంలో జరగడానికి ఏ కోశానా అవకాశాలు లేవు. అలా అని జరగడం లేదా అంటే కాదని అనలేము. ఒకటి రెండు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, వాటిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న ఒక సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేశారు. సినిమా సెకండ్ హాఫ్ ఫస్టాఫ్‌తో పోలిస్తే కాస్త లాగ్ అనిపించినా, కంటెంట్ అంతా సెకండ్ హాఫ్‌లోనే ఉంది. వాస్తవానికి, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఆద్యంతం కూడా ఇబ్బందికర సంప్రదాయాలను ఎత్తిచూపుతూ, కుల వ్యవస్థను టార్గెట్ చేస్తూనే సాగుతుంది. అలా అని కథ, అలాగే సినిమా ఏదీ సీరియస్‌గా సాగదు. ఒకపక్క నవ్విస్తూనే, తర్వాత ఏం జరగనుంది అనే ఆసక్తి కలిగించేలా రాసుకున్నారు. అంతే ఆసక్తికరంగా చూపించారు కూడా. నిజానికి, ఈ సినిమా అన్ని వర్గాల వారికి ఎక్కుతుందా అంటే అవునని గట్టిగా చెప్పలేని పరిస్థితి. కానీ, యూత్‌కి మాత్రం బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది.
నటీనటులు:
నటీనటుల విషయానికి వస్తే, ప్రదీప్ రంగనాథన్ తనకు బాగా స్ట్రెంగ్త్ ఉన్న కోర్ట్‌లోనే ఈ ఆట కూడా ఆడాడు. మనోడు చాలా సీన్స్‌లో తనదైన శైలిలో యాక్టింగ్‌తో చింపేశాడు. అయితే, కొన్నిచోట్ల ధనుష్‌ని అనుకరించిన ఫీలింగ్ కలిగితే అది మన తప్పు కాదు. మమితా బైజు కనిపించిన ప్రతిసారి తన క్యూట్‌నెస్‌తో ఆకట్టుకుంది. ఇక ప్రదీప్ స్నేహితుడి పాత్రలో నటించిన నటుడు కూడా ఆకట్టుకునేలా నటించాడు. శరత్ కుమార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇరగదీశారు అనే చెప్పాలి. రోహిణి కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. మిగతా పాత్రధారులు అందరూ తమదైన శైలిలో నటించారు.
సాంకేతిక నిపుణులు:
ఇక టెక్నికల్ టీం గురించి చెప్పాలంటే, పాటలు తెలుగువారికి పెద్దగా కనెక్ట్ అయ్యేలా లేవు. కానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి తగ్గట్టుగా సరిపోయింది. ఎడిటింగ్ టేబుల్ మీద కూడా కరెక్ట్‌గా ఎంతెంత ఉంచాలో, ఏమేమి ఉంచాలో అన్ని కరెక్ట్‌గానే సెట్ చేసినట్లున్నారు. తెలుగు డైలాగ్స్ రాసింది ఎవరో కానీ, అవి మాత్రం తెలుగు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా అనేక డైలాగ్స్‌ని వాడటం ఆసక్తికరం. ఈ విషయంలో మైత్రి మూవీ మేకర్స్‌ని అభినందించాల్సిందే. ఎందుకంటే, ఒక డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ లేకుండా తెలుగు సినిమా చూస్తున్నట్లే డబ్బింగ్ విషయంలో కానీ, ఇతర అంశాల విషయంలో కానీ కేర్ తీసుకున్నారు. సినిమాటోగ్రఫీ బాగుంది.
ఫైనల్లీ: ఈ డ్యూడ్.. నవ్విస్తూనే ఆలోచింపజేసి బయటకి పంపుతాడు.