Allu Arjun Pushpa The Rule Review: అల్లు అర్జున్ హీరోగా భారీ అంచనాలతో రూపొందించిన పుష్ప సెకండ్ పార్ట్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పుష్ప ది రూల్ పేరుతో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మొదటి భాగం రిలీజ్ అయినప్పుడే సెకండ్ పార్ట్ ఉంటుందని ప్రకటించారు. అలా ప్రకటించిన దాదాపు మూడేళ్ల తర్వాత ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాని ముందు రోజు రాత్రి 9:30 గంటలకు స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా ప్రదర్శించారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
కథ :
పుష్ప మొదటి భాగానికి కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కింది. పెళ్లి జరగడంతో పుష్ప మొదటి భాగం పూర్తికాగా ఆ తర్వాత పరిస్థితులను ఈ సినిమాలో చూపించారు.. శ్రీవల్లి(రష్మిక)తో ఒక అందమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు సిండికేట్ హెడ్గా మారిన పుష్ప రాజ్(అల్లు అర్జున్). ఒకరోజు ఊరికి సీఎం వచ్చాడని కలవడానికి వెళుతున్న సమయంలో శ్రీవల్లి సీఎంతో ఫోటో దిగి తీసుకురావాలని కోరుతుంది. అయితే పుష్పరాజు లాంటి స్మగ్లర్ తో ఫోటో దిగడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తాడు సీఎం. అంతేకాక భార్య మాట విని ఏది పడితే అది చేయకూడదని సలహా ఇస్తాడు. దీంతో తన భార్య అడిగింది నిజం చేయాలనే ఉద్దేశంతో పుష్ప ఏకంగా సీఎంను మార్చేందుకు ప్రయత్నిస్తాడు. సీఎంను మార్చడం అంటే మాటలా అందుకోసం వేల టన్నుల ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నాన్ని ప్రతీక జ్వాలలతో రగిలిపోతున్న షకావత్ అడ్డుకున్నాడా? అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అన్ని ప్రయత్నాలను పుష్ప చేదించగలిగాడా? సీఎంను మార్చగలిగాడా? ఎలా అయినా తనకు ఇంటిపేరు కోసం పోరాడుతున్న పుష్ప మా ఇంటి పేరుని దక్కించుకోగలిగాడా లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ : పుష్ప మొదటి భాగం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దానికి కొనసాగింపుగా తెరకెక్కించిన ఈ సినిమా మీద ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా సినిమా యూనిట్ కూడా ముందు నుంచి జాతర సీక్వెన్స్ అదిరిపోతుందంటూ ఒక రేంజ్ లో హైపిస్తూ వచ్చింది. సినిమా ప్రారంభంలోనే ఒక రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ తో మొదలుపెట్టిన పుష్పరాజ్ జాతర క్లైమాక్స్ వరకు కొనసాగింది. నిజానికి ఈ సెకండ్ పార్ట్ లో కదా పెద్దగా లేదు కానీ ఓపెనింగ్ కార్డ్ నుంచి ఎండు టైటిల్స్ వరకు కాసేపటికి ఒక హై మూమెంట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాడు సుకుమార్. ఇంటి పేరు కోసం సెకండ్ పార్ట్ లో కూడా పోరాటం కొనసాగుతుంది. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి పుష్పరాజ్ ఎదిగే తీరు చూపించిన విధానం ప్రతి ఒక్క కామన్ ఆడియన్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. సినిమాలో ముఖ్యంగా జాతర సీక్వెన్స్ తో పాటు దాదాపుగా అన్ని యాక్షన్ సీక్వెన్స్ లో బాగా వర్కౌట్ అయ్యాయి. పాటలు వినడానికి ఎంత బాగున్నాయో స్క్రీన్ మీద చూడడానికి కూడా అంతే బాగున్నాయి. అయితే రష్మిక క్యారెక్టర్జేషన్ విషయంలో కొంత మందికి కంప్లైంట్స్ కనిపించవచ్చు. కానీ ఆమె క్యారెక్టర్ తో కూడా ఒక రేంజ్ లో ఎమోషన్స్ పండించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఒక కూలి స్థాయి నుంచి సిండికేట్ హెడ్ స్థాయికి ఎదిగిన పుష్పరాజ్ ఆ తర్వాత ఏకంగా ఒక సీఎంను మార్చాల్సిన పరిస్థితులు ఏర్పడితే దానికోసం ఎంతకు తెగించాడు? లాంటి సన్నివేశాలు భలే ఎంగేజింగ్ గా అనిపించాయి. సినిమాలో డైలాగ్ పోర్షన్ ప్రేక్షకులను అలరించేలా, ఆలోచింపజేసేలా ఉన్నాయి. ముఖ్యంగా లేడీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి రాసుకున్న కొన్ని డైలాగ్స్ ఐతే కంటతడి పెట్టించేలా ఉన్నాయి.
అలాగే స్మగ్లింగ్ సీక్వెన్స్ లతో పాటు ఊహించని కొన్ని ట్విస్టులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. నిజానికి ఇలాంటి కమర్షియల్ సినిమాలో లాజిక్స్ వెతకకూడదు కాబట్టి సరిపోయింది లేదంటే కొన్ని లాజిక్స్ కి అందని విషయాలు ఉన్నాయి. అయితే ప్రేక్షకులు పెట్టిన డబ్బుకు ఆశించే హై మూమెంట్స్ కి సినిమాలో ఏమాత్రం కొదవలేదు.
నటీనటుల విషయానికి వస్తే ముందుగా అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయినా మొదటి పార్ట్ తో నేషనల్ అవార్డు అందుకున్న హీరో గురించి ఏం చెప్పగలం? అయితే డాన్స్, ఎక్స్ప్రెషన్స్, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఇలా ఒక్కటేమిటి అన్ని విషయాలలో ఒకరకంగా వన్ మాన్ షో నడిపించాడు అల్లు అర్జున్. ఇక శ్రీవల్లి పాత్రలో రష్మిక ఒదిగిపోయింది ఆమె క్యారెక్టర్ ను ఎలా రాసుకున్నారో అలా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యింది. ఇక వీరి తర్వాత నటించే స్కోప్ దక్కిన పాత్ర షేకావత్ అదేనండీ మన ఫహద్ ఫాజిల్ ది. ఈ సినిమాలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాడు. ఇక మిగతాపాతాలలో నటించిన అజయ్, తారక్ పొన్నప్ప, జగపతిబాబు, రావు రమేష్, సునీల్, అనసూయ ఇలా ఎవరికి వారే ప్రత్యేకంగా తమ పాత్రలతో ప్రేక్షకులను ఎంగేజ్ చేశారు.
టెక్నికల్ టీంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి. పాటలు ఎంత బాగా అందించాడో బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా అంతే కేర్ తీసుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్ కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో చేసిన వర్క్ అంతా స్క్రీన్ మీద కనిపించింది. ఇక సినిమా మొత్తాన్ని చాలా రిచ్ గా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు చేజింగ్ సీక్వెన్స్ లు ప్రేక్షకులను మైమరిపించేలా తెరమోదికి తీసుకొచ్చాడు. అదే సమయంలో మౌనిక దంపతులు చేసిన ఆర్ట్ వర్క్ కూడా సినిమాకి అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. అలాగే స్టంట్ మాస్టర్స్ కష్టం ప్రతి ఫైట్ సీక్వెన్స్ లో కనిపించింది. డాన్స్ కొరియోగ్రఫీ కూడా టాప్ నాచ్.
ఓవరాల్ గా పుష్ప 2 లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే మూడు గంటల 20 నిమిషాల పాటు ఎంగేజ్ చేసే యాక్షన్ డ్రామా విత్ హై మూమెంట్స్.