NTV Telugu Site icon

Pattudala Review : అజిత్ కుమార్ ‘పట్టుదల’ రివ్యూ

Pattudala

Pattudala

తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలను తెలుగులో కూడా ఆదరిస్తారు మన ప్రేక్షకులు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసే దాదాపు అన్ని తమిళ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. తాజాగా ఆయన మగీజ్ తిరుమేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందింది. తమిళంలో విదాముయార్చి అనే పేరుతో ఈ సినిమాని ఫిబ్రవరి 6వ తేదీన రిలీజ్ చేయగా తెలుగులో దాన్ని పట్టుదల పేరుతో అదే రోజున రిలీజ్ చేశారు.. లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా రెజీనా కసాండ్రా, యాక్షన్ కింగ్ అర్జున్ ఇతర కీలక పాత్రలలో నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం.

పట్టుదల కథ:
ఒక అమెరికన్ కంపెనీలో పని చేసే అర్జున్ (అజిత్) తన భార్య కయల్(త్రిష)తో కలిసి అజర్ బైజాన్ బాకులో నివసిస్తూ ఉంటాడు. వివాహం జరిగిన 12 ఏళ్ల తర్వాత తనకు వేరే వ్యక్తితో అఫైర్ ఉందని బయటపెడుతుంది కయల్.. ఇక విడిపోతామని నిర్ణయించుకున్న తర్వాత తాను తన పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోతానని చెబుతుంది.. అయితే తాను డ్రాప్ చేస్తానని, ఇది మన ఇద్దరికీ లాస్ట్ రోడ్డు ట్రిప్ అవుతుందని అర్జున్ ఆమెను ఒప్పించి బయలుదేరుతాడు.. అలా బయలుదేరిన తర్వాత ఒకచోట వీరి కారు బ్రేక్ డౌన్ అవుతుంది. తర్వాత అంతకుముందే ఒక పెట్రోల్ బంకులో పరిచయమైన దీపిక(రెజీనా కసాండ్రా), రక్షిత్(యాక్షన్ కింగ్ అర్జున్) ట్రక్ రావడంతో కయల్ ను దగ్గర్లో ఉన్న ఒక దాబాలో దింపమని అర్జున్ కోరతాడు. అయితే తన కారు బాగైన తర్వాత అర్జున్ ఆ దాబా కి వెళ్లి చూస్తే అసలు తన భార్య అక్కడికి రాలేదని తెలుస్తుంది. ట్రక్ వెతుక్కుంటూ వెళ్తే అసలు అతను ఎవరో తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తాడు రక్షిత్. అయితే కాసేపటికి రక్షిత్, దీపిక కావాలని కయల్ ను కిడ్నాప్ చేసిన విషయం తెలుసుకుంటాడు అర్జున్. అయితే అసలు కయల్ ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం దీపిక రక్షిత్ కి ఎందుకు వచ్చింది? అసలు వాళ్ళు ఎవరు? ఎందుకు అర్జున్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు? చివరికి అర్జున్ తన భార్యను కాపాడుకోగలిగాడా ? రక్షిత్, దీపిక ఇద్దరూ ఏమయ్యారు? చివరికి అర్జున్ తన భార్య నుంచి విడిపోతాడా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
అజిత్ హీరోగా ఒక సినిమా వస్తుందంటే ఆయన అభిమానులలో ఒక రేంజ్ అంచనాలుంటాయి. కానీ ఈ సినిమా మాత్రం అందుకు భిన్నం. అజిత్ సినిమా నుంచి ఆశించే అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకి వస్తే ఖచ్చితంగా నిరాశతో వెనతిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సినిమాగా చూస్తే ఎప్పుడో 97లో హాలీవుడ్లో రిలీజ్ అయిన బ్రేక్ డౌన్ అనే సినిమాకి ఇది ఇండియన్ ఎడాప్షన్.. అయితే అజర్ బైజాన్ నేపథ్యాన్ని ఎంచుకోవడం తెలుగు సహా తమిళ ప్రేక్షకులకు కాస్త కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువే. దానికి తోడు ఎప్పుడో 97 లో వచ్చిన కథను ఇప్పటి కాలానికి తగినట్లు పూర్తిస్థాయిలో మార్చిన ఫీలింగ్ కలగలేదు. టెక్నాలజీ విపరీతంగా అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా ఆ రోజుల్లో జరిగిన కథను ఆధారంగా చేసుకుని చూపించాలనుకోవడం కాస్త ఇబ్బందికర అంశమే. అజిత్ లాంటి హీరో ఇలాంటి కథ ఒప్పుకున్నాడా అని సినిమా చూసిన తరువాత ప్రేక్షకులు ఆశ్చర్యపోక తప్పదు. నిజానికి సినిమా మొదలైనప్పుడు త్రిషతో అజిత్ లవ్ సీన్స్ కాస్త సాగ తీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఎప్పుడైతే సినిమా రోడ్డు ఎక్కుతుందో అప్పటినుంచి ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి రేకెత్తించడంలో టీం సక్సెస్ అయింది. నిజానికి మన తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే రోడ్డు ట్రిప్ సినిమాలు వస్తున్నాయి. ఇది కూడా దానపుగా అలాంటి సినిమానే. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంట్రెస్ట్ కలిగించేలా కట్ చేసుకోగా సెకండ్ హాఫ్ లో కూడా ఊహకు అందకుండా కథ నడిపించే విషయంలో సక్సెస్ అయ్యారు.. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత మిస్ అయిన తన భార్యను కనిపెట్టే దిశగా అజిత్ చేసే ప్రయత్నాలు ఎంగేజింగ్ అనిపించాయి. అయితే అప్పటి కథను అడాప్ట్ చేసుకున్న తీరు పూర్తిస్థాయిలో న్యాయం చేసేలా అనిపించలేదు. ఈ విషయం మీద ఇంకా దృష్టి పెట్టుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.

ఇక నటీనటుల విషయానికి వస్తే అజిత్ గురించి చెప్పేదేముంది తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో ఏమాత్రం పట్టు సడల లేదని మరోసారి నిరూపించుకున్నాడు. త్రిష వయసు పెరిగే కొద్దీ యంగ్ అయిపోతున్న ఫీలింగ్ కలుగుతోంది. ఎందుకంటే ఆమె తనవైన శైలిలో ఎలాంటి గ్లామర్ షో చేయకపోయినా చూడడానికి ముచ్చటగా అనిపించింది. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టాడు. రెజీనా కూడా ఈసారి ఆయనతో కలిసి రఫ్ ఆడించింది. ఇక మిగతా నటినటులందరూ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ గురించి.. తనదైన శైలిలో సినిమాని ఎలివేట్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు.. ఇక క్రిస్ప్ ఎడిటింగ్ కూడా సినిమాకి మంచి అసెట్ అయింది. సాంగ్స్ ఎందుకో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా అనిపించలేదు.. నిర్మాణ విలువలు మాత్రం అత్యద్భుతంగా ఉన్నాయి.

ఫైనల్లీ : పట్టుదల ఓ మంచి రోడ్ ట్రిప్ ఫిలిం విత్ యాక్షన్.. కానీ కండిషన్స్ అప్లై