తెలంగాణ కాంగ్రెస్ నాయకులు దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ను ఓన్ చేసుకున్నారా.. లేదా? పన్నెండేళ్ల తర్వాత మొదలైన ఈ చర్చలో కాంగ్రెస్ వర్గాల్లో భిన్న వాదనలు ఉన్నాయా? ఇంతకీ YSR ఎవరి మనిషి? ఇప్పుడెందుకీ రచ్చ!
వైఎస్ సంస్మరణ సభతో దివంగత సీఎం ఇమేజ్‌పై చర్చ!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను శాసించిన వ్యక్తి దివగంత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఆయన ఇమేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఏపీలో ఈ అంశంపై రగడ లేకపోయినా.. తెలంగాణలోనే కొంత జంఝాటనం కనిపిస్తోంది. కాంగ్రెస్, షర్మిల పార్టీల మధ్య ఫైట్ మొదలైంది. వైఎస్‌ను కాంగ్రెస్ మనిషి అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో షర్మిల వారసురాలిగా బరిలోకి వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన YS సంస్మరణ సభతో ఆయన ఇమేజ్‌పై మళ్లీ చర్చ స్టార్ట్ అయింది.
వైఎస్‌ను కాంగ్రెస్ మనిషిగా చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు!
వైఎస్ వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నది కుటుంబ సభ్యులు చెప్పేమాట. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకుల వాదన మరోలా ఉంది. వైఎస్ కాంగ్రెస్ మనిషి. కాంగ్రెస్ ఆయనకు అవకాశం ఇవ్వడం వల్లే సీఎం పదవి చేపట్టారని చెబుతున్నారు. వైఎస్‌కు నిజమైన వారసులం తామేనని బలంగా వాదిస్తున్నారు ఆ పార్టీ నాయకులు. వైఎస్ కుటుంబ సభ్యులు కేవలం ఆయన ఆస్తులకు మాత్రమే వారసులని చెబుతున్నారు. ఇక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో.. కొత్త స్లోగన్ అందుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.
కాంగ్రెస్, షర్మిల పార్టీల మధ్య వైఎస్ ఇమేజ్ కోసం ఫైట్!
రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నది వైఎస్ చివరి కోరికగా కాంగ్రెస్ నాయకులు చర్చకు పెట్టారు. ఆ కోరిక నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని.. ఇందుకు కలిసి వచ్చేవారు కాంగ్రెస్‌కు మిత్రులు.. అడ్డుకునేవారు శత్రువులు అంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల కొత్త పార్టీ ద్వారా ఎంట్రీ ఇవ్వడంతో ఈ ఇమేజ్ ఫైట్ రెండు పార్టీల మధ్య గట్టిగానే సాగుతోంది. వైఎస్ సంస్మరణ సభకు వెళ్లొద్దని కాంగ్రెస్ స్పష్టం చేసినా.. ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లారు. ఉదయం గాంధీభవన్‌లో వైఎస్‌కు నివాళులు అర్పించిన నాయకులే.. సాయంత్రం వైఎస్ సతీమణి ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు వెళ్లొద్దనడంపై పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు YSకు ఎస్ చెబుతున్నారో నో అంటున్నారో అర్థంకాని పరిస్థితి ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వైఎస్ విషయంలో కాంగ్రెస్ నిలకడలేని ప్రకటనలు?
పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. వైఎస్‌ను కాంగ్రెస్ మనిషిగా చెప్పడం.. వెంటనే గొంతు సవరించుకుంటూ మరో ప్రకటన చేయడంపై కాంగ్రెస్ వర్గాల్లోనే ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. వైఎస్ తెలంగాణకు వ్యతిరేకి అని వైరి పక్షాలు పదే పదే ప్రచారం చేయడం వల్ల కాంగ్రెస్ నాయకులు ఆయన్ని ఓన్ చేసుకోవడానికి వెనకంజ వేస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయట. షర్మిల పార్టీ జనాల్లో వైఎస్ పేరుతోనే వెళ్తోంది. మరి.. రానున్న రోజుల్లో రెండు పార్టీల మధ్య YSను ఓన్ చేసుకునే విషయంలో ఇంకెలాంటి చర్చ జరుగుతుందో చూడాలి.