ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో పెందుర్తి ఒకటి. అర్బన్, గ్రామీణ ప్రాంతాల కలబోత కావడంతో ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ప్రధాన పార్టీల ఫోకస్ కూడా ఎక్కువే. ఇక్కడ ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే.. తర్వాత ఎన్నికల్లో గెలవకపోవడం పెందుర్తి సెంటిమెంట్. 2019లో ఈ సీటును వైసీపీ గెలుచుకోగా.. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి టీడీపీ పుంజుకుంది. ఇప్పుడు మళ్లీ ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. పెందుర్తిపై పట్టుకోసం వైసీపీ, టీడీపీ వేయని ఎత్తుగడలు లేవు. అయితే ప్రతిపక్ష టీడీపీలోని గొడవలే ప్రస్తుతం చర్చగా మారాయి.
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీలకు అస్సలు పడటం లేదు. బండారు నాలుగుసార్లు గెలిచి మంత్రిగా చేయగా.. గండి బాబ్జి మాజీ శాసనసభ్యుడు. వైసీపీ డిస్మిస్ చేశాక చాలాకాలం యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు బాబ్జి. 2019 ఎన్నికల ముందు ఆయన టీడీపీ కండువా కప్పేసుకున్నారు. బాబ్జి చేరికపై సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యంతరాలను ఆనాడు టీడీపీ హైకమాండ్ పట్టించుకోలేదు. బండారు, గండి ఇద్దరూ బలమైన వెలమ సామాజికవర్గానికి చెందిన నాయకులు. దాంతో ఆ ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా వస్తాయని టీడీపీ అంచనా వేసినా వర్కవుట్ కాలేదు. ఇంతలో వచ్చే ఎన్నికల్లో పెందుర్తి టీడీపీలో తాను పోటీదారుణ్ణి అనే సంకేతాలు పంపించారు గండి బాబ్జి. సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిపోయింది. బహిరంగ వేదికలపైనే బండారు, గండి విమర్శలు, సవాళ్లు చేసుకున్నారు కూడా. ఇంతలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ జంప్ చేయడంతో విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్‌గా గండి బాబ్జిని పంపింది పార్టీ. దాంతో పెందుర్తిలో ఆధిపత్య పోరాటానికి తెరపడిందని తెలుగు తమ్ముళ్లు భావించారు.
మనుషులు కలిసినంత ఈజీగా మనసులు కలవ లేదనేది బహిర్గతం కావడంతో మళ్లీ వర్గ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. నియోజకవర్గాల వారీగా సమీక్షల్లో భాగంగా.. పెందుర్తి సెగ్మెంట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో గండి బాబ్జి ఎంట్రీ బండారు వర్గానికి రుచించలేదు. పెందుర్తిలో తన వర్గానికి అన్యాయం జరిగితే సహించేది లేదని టీడీపీ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరి మధ్య వర్గపోరు మళ్లీ బుస కొట్టింది. సబ్బవరం జడ్పీటీసీగా ఉన్న తన తమ్ముడు రవికి.. తన వర్గానికి చెందిన సర్పంచ్‌లకు పార్టీ కార్యక్రమాలపై ఆహ్వానాలు పంపడం లేదని బండారుపై బాబ్జి ఫిర్యాదు చేశారట. ఇదే ధోరణి కొనసాగితే బండారుతో కలిసి సాగడం సాధ్యం కాదని ఆయన చెప్పేశారట. పైగా తన తమ్ముడ్ని కూడా ఆ మీటింగ్‌కు తీసుకొచ్చారు బాబ్జి.
ఈ పరిణామాల తర్వాత బండారు సైతం గండి బాబ్జి వర్గాన్ని పూర్తిగా విశ్వసించడం లేదట. ఇటీవల పినగాడిలో వైసీపీ నేత నిర్మించిన గుడి కార్యక్రమాన్ని ప్రస్తావిస్తున్నారు. దైవ కార్యక్రమాలు జరిగితే గ్రామాల్లో పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తారు. నాయకులు కూడా మర్యాద కోసం వెళ్తారు. పినగాడి కార్యక్రమానికి మాత్రం బండారును ఆహ్వానించకుండా బాబ్జికి స్వాగతం లభించింది. తన నియోజక వర్గంలో జరుగుతున్న కార్యక్రమానికి ప్రత్యుర్థులు పిలిస్తే గండి వర్గం వెళ్లడం బండారుకు నచ్చలేదట. ఇలాంటివి చాలానే జరిగాయని చెబుతున్నారు. దీంతో ఇరువురి మధ్య గొడవలు సమసిపోలేదని కేడర్‌కు అర్థమైంది. సమస్యను తుని తగువుగా అభివర్ణిస్తున్నారు నాయకులు. మరి.. సమస్య పరిష్కారానికి పార్టీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.