ముసుగులో గుద్దులాట ఎందుకు అనుకున్నారో ఏమో.. ఆ సీనియర్ ఎమ్మెల్యే డైరెక్ట్ అటాక్ ప్రారంభించారు. తన ఇలాకాలోకి వస్తే ఓడిపోవడం ఖాయమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పబ్లిక్ డయాస్ మీద చేసిన ఈ హెచ్చరిక ప్రత్యర్ధి పార్టీకి కాదని.. సొంత పార్టీకి చెందిన మంత్రికేనని చర్చ జరుగుతోంది. రాజకీయ వేడిని రాజేసిన ఆ వ్యాఖ్యలు అమాత్యుడి ముందరి కాళ్లకు బంధం వేయడానికా.. లేక టిక్కెట్ రాకపోతే నా దారి నేను చూసుకుంటాననే సంకేతమా?
హైకమాండ్ కన్నబాబురాజుకు షాక్ ఇచ్చిందా?
ఉమ్మడి విశాఖజిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి యలమంచిలి. సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబురాజు. 2004, 2009లో కాంగ్రెస్ తరపున.. 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన కన్నబాబురాజు శైలి భిన్నంగా ఉంటుంది. నయానో.. భయానో.. ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారనే నెగెటివ్ టాక్ ఉంది. రాజకీయ ప్రత్యర్థి అయినా.. సొంత పార్టీ నాయకత్వమైనా పట్టుదల వస్తే అమీతుమీ తేల్చేసుకోవడానికే సిద్ధపడతారనేది ఆయన గత చరిత్ర చెబుతుంది. మొన్నటి ఎన్నికల తర్వాత సీనియారిటీ ఆధారంగా మంత్రివర్గంలో చోటు ఆశించినా ఫలితం దక్కలేదు. అమాత్య యోగం రాలేదన్న అసంతృప్తిలో ఉండగానే కుమారుడు సుకుమార్ వర్మ ఇన్ఛార్జ్ చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తున్న డీసీసీబీ పదవీ పోయింది. వీటన్నింటినీ అధిగమించి మరోసారి యలమంచిలి నుంచి పోటీకి సిద్ధమవుతున్న కన్నబాబురాజుకు హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది.
కన్నబాబురాజుకు టికెట్ లేదని చెప్పేశారా?
వచ్చే ఎన్నికల్లో కన్నబాబురాజుకు టిక్కెట్ లేదని చెప్పేసిందని.. తిరిగి అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామనే హామీతో సరి పెట్టిందనే చర్చ మొదలైంది. యలమంచిలి నుంచి పోటీకి మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడీగా ఉన్నారనే ప్రచారం బలంగా ఉంది. అమర్నాథ్ అభ్యర్ధనను హైకమాండ్ పరిశీలించి పోటీకి అనుమతి ఇచ్చిందనేది మరో అంశం. యలమంచిలిలో కాపు, గవర, మత్స్యకార, వెలమ సామాజికవర్గాల ఓట్ బ్యాంకు ఎక్కువ. వచ్చే ఎన్నికల్లో త్రిముఖపోటీ అనివార్యమనే అంచనాల మధ్య అభ్యర్థిని మార్చాలని నివేదికలు హైకమాండ్‌కు చేరినట్టు భోగట్టా. కాపు ఓటింగ్ కీలకం కనుక అదే సామాజికవర్గానికి చెందిన అమర్నాథ్ అభ్యర్థిత్వం పరిశీలించవచ్చనే సూచన చేసినట్టు సమాచారం. సరిగ్గా ఇక్కడి నుంచే యలమంచిలి అధికారపార్టీలో అగ్గిరాజుకుంది. ఎమ్మెల్యేను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న అచ్యుతాపురం మండలస్థాయి నాయకత్వం అమర్నాథ్ చెంతకు చేరింది. మంత్రి ప్రధాన అనుచరుడు, గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేటి ప్రసాద్ వెర్సస్ ఎమ్మెల్యే అనే స్థాయిలో వైరం ఏర్పడింది. కన్నబాబుకు సమాంతరంగా చోడవరంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు బొడ్డేటి.
కన్నబాబురాజుపై పార్టీ నేతల ఫిర్యాదు
ప్రస్తుతం యలమంచిలిలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్యేపై పుట్టిన అసమ్మతి ఆరునొక్కరాగం అందుకుంది. మండలస్థాయి నాయకత్వం తిరుగుబాటు చేసింది. రియల్ ఎస్టేట్ వెంచర్లు, అక్రమ క్వారీలు, ఇసుక తవ్వకాలపై విచారణ కోరుతూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి కన్నబాబురాజును ఇరుకున పెట్టే ప్రయత్నాలు జరిగాయి. వాస్తవంగా ఈ పరిణామాలేవీ కన్నబాబురాజు ఎప్పుడు ఊహించనవి. తాజాగా ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం కొత్త నినాదం గట్టిగా వినిపిస్తోంది. పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలి.. సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రం మారిపోవాలనే స్లోగన్ అందుకుంది. దీంతో కన్నబాబురాజు ముసుగులో గుద్దులాటకు తెరదించే ప్రయత్నం చేశారు. వైరివర్గంగా ఉన్న బొడ్డేటి ప్రసాద్‌ను వేడుకలకు ఆహ్వానించడమే కాదు కలిసి కేక్ కట్ చేశారు. మునగపాక వెళ్లి బొడ్డేటి నిర్వహించిన వేడుకల్లోనూ పాల్గొన్నారు. ఇది ఆసక్తికర పరిణామం కాగా ఎమ్మెల్యే వర్గం మాత్రం జీర్ణించుకోలేకపోతుందట. క్షేత్రస్థాయిలో వైరం పెట్టుకుని నలిగిపోతుంటే మీరంతా ఒక్కటవు తారా? అని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.
అమర్నాథ్‌కు కన్నబాబురాజు పరోక్ష హెచ్చరికలు
ఇదే సమయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు నేరుగా మంత్రి అమర్నాథ్ వర్గానికి తగిలాయి. వచ్చే ఎన్నికల్లో స్థానిక నాయకత్వానికి టికెట్ కేటాయించాలని.. అలా కాకుండా వలస నేతలు పోటీకి దిగితే ఓడిపోవడం ఖాయమని హెచ్చరించారు ఎమ్మెల్యే. కన్నబాబురాజు కామెంట్స్ వెనుక నిగూఢార్ధం ఉందనే అభిప్రాయం తెరపైకి వచ్చింది. లోకల్, నాన్ లోకల్ ఇష్యు ద్వారా అమర్నాథ్‌కు యలమంచిలిలో పనేంటి అనే చర్చను ప్రజల ముందు పెట్టాలనేది ఎమ్మెల్యే ఆలోచనగా చెబుతున్నారు. ఈ దిశగా తొలి అస్త్రం ఎమ్మెల్యే విసిరినట్టే కనిపిస్తోంది.
పక్కచూపులు చూస్తున్నారని ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం ప్రచారం
వచ్చే ఎన్నికల్లో యలమంచిలి నుంచి పోటీ చెయ్యాలని కన్నబాబురాజు భావిస్తున్నారట. వయోభారం కారణంగా తాను యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పక్కకు జరిగేలోపు కుమారుడికి పొలిటికల్ టేకాఫ్ ఇవ్వాలని అనుకుంటున్నారట. అందుకే టికెట్ కోసం ఎమ్మెల్యే పక్కచూపులు ప్రారంభించారనేది కన్నబాబు వ్యతిరేకవర్గం చేస్తున్న ప్రచారం. ప్రధాన ప్రతిపక్షంలోని ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే టచ్‌లో ఉన్నారనే ప్రచారం ప్రారంభించింది. వైసీపీ నుంచి టిక్కెట్ రాకపోతే సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారనే వాదన ఉంది. మరి.. కన్నబాబురాజు ఏం చేస్తారో.. ఎమ్మెల్యే విషయంలో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.