సీఎం హోదాలో జగన్ తొలిసారి కుప్పానికి వస్తుంటే.. అక్కడ అధికారపార్టీలో గ్రూపు తగాదాలు పీక్స్‌కు వెళ్తున్నాయా? పార్టీకి తలనొప్పిగా మారిన ముఠా కుమ్ములాటలకు అధినేత చెక్ పెడతారా? గీత దాటిన వాళ్లకు క్లాస్ తీసుకుంటారా? లెట్స్‌వాచ్..!
2019 ఎన్నికల సమయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పటిష్ఠంగా కనిపించిన వైసీపీ.. ప్రస్తుతం గ్రూపు తగాదాలతో కొట్టుమిట్టాడుతోంది. ద్వితీయశ్రేణి నేతల నుంచి మంత్రుల వరకు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటున్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి రోజా సొంత నియోజకవర్గాల్లో వారిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. రోజు రోజుకీ సమస్య శ్రుతిమించుతుందే తప్ప తగ్గడం లేదు. ఈ ముఠా తగాదాల్లో పార్టీ కేడర్ నలిగిపోతోందనే అభిప్రాయం ఉంది. ఇలాంటి తరుణంలో సీఎం జగన్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కుప్పానికి వస్తుండటంతో ఆ వర్గపోరుకు చెక్ పడుతుందనే చర్చ సాగుతోంది.
సీఎం జగన్ వెళ్తోంది కుప్పానికే అయినా.. ఉమ్మడి జిల్లా వైసీపీ వ్యవహారాలపైనా అధినేత దృష్టి పెడతారని సమాచారం. కొందరు పార్టీ నేతలు నేరుగా సీఎంకే మొరపెట్టుకోవడానికి సిద్ధం అవుతున్నారట. మరికొందరైతే ఆకాశ రామన్న ఉత్తరాలు రాశారట. సీఎం జగన్ వెళ్తున్న కుప్పం వైసీపీలోనూ నేతల మధ్య పడటం లేదు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో వారి మధ్య రగడ ఇంకా పెరిగింది. కుప్పం వైసీపీ ఇంఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ ఫొటో లేకుండానే రెస్కో ఛైర్మన్ సెంథిల్‌కుమార్ బ్యానర్లు ఏర్పాటు చేశారు. అలాగే మంత్రి పెద్దిరెడ్డి ఫొటో లేకుండా ఇంకొందరు స్థానిక నేతలు బ్యానర్లు వేశారు. సీఎం వస్తున్నందున కుప్పం నేతలు గాడిలో పడతారని పార్టీ పెద్దలు ఆశించారు. కానీ.. ఫ్లెక్సీల దగ్గరే పేచీలకు తెరతీశారు.
ఉమ్మడి జిల్లాలోని జీడీ నెల్లూరు, నగరి, మదనపల్లె, తంబళ్లపల్లె, చిత్తూరు, పూతలపట్టులోనూ అక్కడి ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు అస్సలు పడటం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అని సవాళ్లు విసురుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు.. అక్కడ పార్టీ పరిస్థితిపై సమగ్ర సమాచారం తెప్పించుకున్న ముఖ్యమంత్రి.. కుప్పం పర్యటనలో అన్నీ సెట్‌రైట్ చేస్తారని కేడర్ భావిస్తోందట. ముఖ్యంగా నేతల మధ్య దూరాన్ని తగ్గించడం.. కలిసి సాగకపోతే కష్టమని చెప్పడంతోపాటు కొందరికి అక్షింతలు పడతాయని అనుకుంటున్నారట. అందుకే సీఎం పర్యటనపై వైసీపీ వర్గాల్లో ఆసక్తితోపాటు ఉత్కంఠ పెరుగుతోంది.
వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించాలనేది వైసీపీ టార్గెట్. ఆ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో నేతల మధ్య ఐక్యత లేకపోతే సీఎం జగన్ సీరియస్‌గా తీసుకుంటారని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ పర్యటన తర్వాత కుప్పం వైసీపీలో మార్పు వస్తుందని.. మరింత వేగంగా పార్టీ కార్యకలాపాలు పెరుగుతాయని ఆశిస్తున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.