తెలంగాణ కాంగ్రెస్‌లో ఇతర పార్టీల నుండి వచ్చి చేరే వారీ సంఖ్య పెరుగుతుంది. అధికార పార్టీ నుండి కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. కొత్తగా వచ్చి చేరిన నల్లాల ఓదెలు అయినా… తాజాగా PJR కూతురు విజయారెడ్డి అయినా .. భవిష్యత్ రాజకీయానికి ఇప్పుడే పునాదులు వేసుకుంటున్నారు. ఓదెలుకి టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్‌కి పెద్దగా కష్టం లేదు. కానీ సమస్య అంతా విజయారెడ్డి గురించే. కాంగ్రెస్ చింతన్ శిబిర్‌లో.. ఒక కుటుంబానికి ఒకటే సీటు అని.. ఒకవేళ టికెట్ ఇవ్వాలని అనుకున్నా.. ఐదేళ్లు పార్టీ కోసం పని చేయాలని నిర్ణయించారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తుంది.
పీజేఆర్ కూతురు విజయారెడ్డి పార్టీ కండువా కప్పుకొన్నారు. ఖైరతాబాద్ సీటు ఆశిస్తున్నట్టు ప్రచారంలో ఉంది. అధికారపార్టీని కాదని కాంగ్రెస్‌లో చేరుతున్నారు అంటే ఆ మేరకు హామీ ఉండే ఉంటుంది అని టాక్. అయితే పీజేఆర్ కుటుంబం నుంచి విష్ణు కూడా పార్టీలోనే ఉన్నారు. యాక్టివ్‌గా లేకపోయినా పార్టీని పట్టుకుని ఉన్నారు. విష్ణు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2018లో పోటీ చేశారు. అదే ఆయన నియోజక వర్గం. కానీ పెద్దగా పట్టించుకోవడం లేదట. విష్ణు సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు పీజేఆర్ కుటుంబం నుంచే కూతురు విజయారెడ్డి, విష్ణు ఇద్దరూ కాంగ్రెస్‌లోనే రెండు సీట్లు ఆశిస్తున్నారు. విష్ణుకి సమస్య లేకున్నా.. విజయారెడ్డి టికెట్ పైనే చర్చ నడుస్తోంది.
PJR కుటుంబంలో ఇద్దరికీ సీటు ఇస్తారా..? అనే చర్చకు… ఇద్దరు ఒకే కుటుంబంగా పరిగణించాల్సిన పని లేదు అంటున్నాయి పార్టీ వర్గాలు. ఎవరి కుటుంబం వారిది కాబట్టి ఆ సమస్య లేదన్నది వారి వాదన. అయితే.. రెండో నిబంధన.. పార్టీలో ఐదేళ్లు పని చేసిన వారికి టికెట్. కొత్తగా వచ్చిన వారికి ఇవ్వబోమని చింతన్ శిబిర్ నిర్ణయం. ఈ నిబంధన అమలులోకి వస్తే.. కొత్తగా వచ్చే వారికి పార్టీలో టికెట్ లేదనే భావన ఉంది. ఇన్నాళ్లూ విజయారెడ్డి TRSలో ఉన్నా.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరారు. ఆ లెక్కన పార్టీలో ఇద్దరికీ టికెట్ ఇస్తారా..? అనే టాక్ మొదలైంది.
అయితే.. విష్ణుకి… విజయారెడ్డికి మధ్య సఖ్యతపై పార్టీలోనే సందేహాలు ఉన్నాయట. అలాగే ఎన్నికల సందర్భంగా చేస్తున్న సర్వే ఆధారంగానే టికెట్స్ ఇస్తామని చెప్తుంది కాంగ్రెస్. ఏం జరుగుతుందో తెలియదు కానీ… చర్చ మాత్రం హీటెక్కిస్తోంది.