Munugodu Politics : ఊరందరిదీ ఒకదారైతే.. ఉలిపికట్టుది మరోదారి అన్నట్టుగా ఉందట మునుగోడు బీజేపీ నేతల తీరు. తెలంగాణ రాజకీయాలను మునుగోడు హీటెక్కిస్తుంటే.. అక్కడి బీజేపీ నేతలు మాత్రం డైలమాలో పడ్డారట. కొత్త లెక్కలు వేస్తున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
మునుగొడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగొపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసి బీజేపీలో చేరే అవకాశం ఉండటంతో స్థానిక కమలనాథులు తమ భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారట. పార్టీలోకి కొత్తగా ఎవరు వచ్చినా వారితోపాటు కొందరు నేతలు రావడం సర్వసాధారణం. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డితోపాటు వచ్చేవారిని తలచుకుని తమ పరిస్థితి ఏంటా అని బీజేపీ కేడర్ టెన్షన్ పడుతోందట. రానున్న రోజుల్లో తమకు పదవులు.. ప్రాధాన్యం దక్కుతాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిన గంగిడి మనోహార్ రెడ్డి దారెటు అనేది ప్రస్తుతం ప్రశ్న. ప్రస్తుతం ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. మునుగోడు బీజేపీ ఇంఛార్జ్ కూడా. రాజగోపాల్‌రెడ్డి వచ్చాక మనోహర్‌రెడ్డికి దక్కే ప్రాధాన్యంపై చర్చ జరుగుతోంది. రెండు ఎన్నికల్లో ఓడినా.. మునుగోడులో బీజేపీ కేడర్‌కు అండగా ఉండి.. పార్టీ బలోపేతానికి కార్యక్రమాలు చేపట్టారనేది కమలనాధుల వాదన. వాస్తవానికి గత రెండు ఎన్నికల్లోనూ మునుగోడులో బీజేపీ పెద్దగా ప్రభావం చూపింది లేదు. 2014లో బీజేపీకి మునుగోడులో 27 వేల ఓట్లు వస్తే.. 2018లో 12 వేల ఓట్లే వచ్చాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2018 తర్వాత జరిగిన రెండు ఉపఎన్నికల్లోనూ బీజేపీ చతికిల పడింది. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో గట్టిగా ప్రచారం జరిగినా.. బీజేపీ తేలిపోయింది. ఇప్పుడు మునుగోడు వంతు రావడంతో అందరి దృష్టీ ఇటు మళ్లింది. కాకపోతే స్థానిక నేతలు.. కేడర్ పరిస్థితి ఏంటి? రాజగోపాల్‌రెడ్డి వచ్చాక పార్టీ బలపడుతుందా? కొత్త మార్పులు చోటు చేసుకుంటాయా అనేది పెద్ద చర్చ. వాస్తవానికి కొత్త నీరు వస్తే.. పాత నీరు పోవాల్సిందే. రానున్న రోజుల్లో అదే జరుగుతుందని కేడర్ ఆందోళన చెందుతుందట. తాజా ఎపిసోడ్‌లో బయట పడకపోయినా.. మనోహర్‌రెడ్డి మాత్రం బీజేపీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతున్నారట. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్‌ను స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తుండటంతో.. పార్టీ కేడర్‌కు.. నేతలకు వచ్చే ప్రమాదం ఏమీ ఉండబోదని సమాధాన పడుతున్నారట.
రాజగోపాల్‌రెడ్డి చేరికపై స్పష్టత వచ్చాక.. మునుగోడు బీజేపీ నేతలతో అధిష్ఠానం చర్చలు జరుపుతుందని ఆశిస్తున్నారట. బీజేపీ అధికారంలోకి రావాలంటే త్యాగాలకు సిద్ధం కావాలని.. అయితే అది ఏ స్థాయిలో అనేది స్పష్టత లేదట. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎప్పుడు పిలిచి మాట్లాడుతుందా అని ఎదురు చూస్తున్నారట. మొత్తానికి మునుగోడు బీజేపీలో రాజకీయ వేడిపై ఎవరిగోల వారిదే అన్నట్టుగా మారిపోయింది.