తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలపై చర్చ నడుస్తోంది.ఏదీ ఓ పట్టాన తేలని పార్టీలో ఇప్పుడు కొత్త నేతలు వస్తారనే దానిపై కూడా అదే స్టైల్ లో రియాక్షన్ లున్నాయి.అయితే, తెలంగాణ కాంగ్రెస్ లో పిసిసి చీఫ్ గా రేవంత్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత…కొందరు పార్టీ లోకి రావడానికి సిద్దమయ్యారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన డీఎస్, ఆయన కుమారుడు సంజయ్,పాలమూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పార్టీలో చేరే అంశంపై చర్చ నడుస్తోంది.
ఇంతలో నిజామాబాద్, పాలమూరు జిల్లా కాంగ్రెస్ నాయకుల నుండి వ్యతిరేకత వచ్చింది.ఎవరు పడితే వాళ్ళని పార్టీలో ఎలా చేర్చుకుంటారని… కాంగ్రెస్ కి నష్టం చేసిన డీఎస్ కుటుంబాన్ని ఎలా చేర్చుకుంటారంటూ ప్రశ్నలు వినిపించాయి.
చేరికల కోసం మాజీ పిసిసి చీఫ్ అధ్యక్షతన కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.మొన్నటి రాహుల్ గాంధీ సమావేశం లో ఈ కమిటీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.తాజాగా జానారెడ్డి చైర్మన్ గా ఏఐసీసీ ఆరుగురిలో కమిటీ వేసింది.
జానారెడ్డి ఈ కమిటీ చైర్మన్ గా ఉంటే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, మాజీ చీఫ్ లు పొన్నాల, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సభ్యులుగా ఉన్నారు.
అయితే, ఎవర్ని చేర్చుకోవాలి? ఎవర్ని వద్దనాలి…ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లో కనిపిస్తున్న పంచాయితీ
ఇదిలా నడుస్తుండగానే, మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ సోనియా గాంధీ తో భేటీ అవ్వడం పార్టీలో చేరుతున్నట్టు లీకులు వచ్చాయి.దీనిపై కూడా గందరగోళం జరిగింది.ఇప్పుడు జానారెడ్డి చైర్మన్ గా కమిటీ ఏర్పడటంతో చేరికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి ఏర్పడింది
రేవంత్.. జానారెడ్డి ఇద్దరు సానుకూలంగా ఉంటారా..?పొన్నాల, ఉత్తమ్..దామోదర రాజనర్సింహ నో చెప్తారా?
కమిటీలో మెజారిటీ అభిప్రాయం డీఎస్, ఆయన కుమారుడి చేరికకు వ్యతిరేకంగా ఉంటుందా? అనుకూలమా?
మొదలైన చర్చలు నడుస్తున్నాయట..
అదే సమయంలో డి శ్రీనివాస్… సోనియా గాంధీ తో నేరుగా మాట్లాడిన తర్వాతే చేరాలని అనుకున్నపుడు, ఈ కమిటీ అడ్డుకుంటుందా..? జానారెడ్డి కమిటీకి అడ్డుకునే శక్తి ఉంటుందా అనే చర్చ కూడ నడుస్తోందట
నిజానికి రాహుల్ గాంధీతో సీనియర్ నేతల భేటీ తర్వాత వెంటనే కమిటీ ఏర్పాటుకు ఆమోదం వచ్చింది.
అయితే కమిటీ చైర్మన్ పేరు మాత్రం ఆఖరులో మారినట్టు చర్చ జరుగుతుంది. మాజీ చీఫ్ ఒకరికి ఈ చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించారట.కానీ..ఆఖరులో జానారెడ్డి పేరు తెరపైకి వచ్చినట్టు సమాచారం.
ఇలా మొదట కమిటీ ఏర్పాటులోనే పంచాయితీ జరిగింది..ఈ సంగతి ఎలా ఉన్నా, చేరికల విషయంలో ఈ కమిటీ పరిధి ఎంత అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.మరీ ముఖ్యంగా, డీఎస్ కుటుంబంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై పార్టీలో చర్చ నడుస్తోందట
Watch Here : https://youtu.be/pQTuAHeniBA