ఆ నియోజకవర్గం నుంచి ఒక్కసారే ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఓడిపోయారు. లోక్‌సభ బరిలో నిలుచున్నా చేదు ఫలితమే. ఇప్పుడు నియోజకవర్గానికే రావడం లేదు. ఓటమి తీసుకొచ్చిన బాధో ఏమో.. పార్టీవర్గాల్లో మాత్రం చర్చగా మారిపోయారు ఆ యువనేత. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఏంటా కథా?
కల్వకుర్తిలో నల్లపూసైన వంశీచంద్‌రెడ్డి
చల్లా వంశీచంద్‌రెడ్డి. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే. AICC కార్యదర్శి. నియోజకవర్గానికి చుట్టపు చూపుగా కూడా రావడం లేదట. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతూ 2014లో కల్వకుర్తి నుంచి పోటీ చేసి.. గెలిచి.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే నియోజకవర్గంలో 2018లో పోటీ చేస్తే వంశీకి థర్డ్ ప్లేస్ వచ్చింది. ఆ తర్వత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసినా అక్కడా చేదు ఫలితమే ఎదురైంది. వరస ఓటములతో యువనేత మనసు గాయపడినట్టు పార్టీ వర్గాల టాక్. అందుకే రాజకీయాల్లో మునుపటిలా క్రియాశీలకంగా కనిపించడం లేదని.. కల్వకుర్తికి కూడా చుట్టపు చూపుగా వస్తున్నారనేది కేడర్ ఆరోపణ. నాయకులే నల్లపూస కావడంతో పార్టీ శ్రేణులు.. అనుచరులు చెల్లాచెదురైన పరిస్థితి ఉంది.
నాయకుడు లేక కాంగ్రెస్ కేడర్ చెల్లాచెదురు
కల్వకుర్తిలో ఒకప్పుడు కాంగ్రెస్‌కు గట్టి పట్టు ఉండేది. అలాంటిది 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో ప్లేస్‌కు పడిపోయింది. ఆ తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కొంత పుంజుకోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు పార్టీ నేతలు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల వేళ వంశీచంద్‌రెడ్డి కల్వకుర్తికి ముఖం చాటేయడం చర్చగా మారింది. వాళ్లతో మాట్లాడే నాయకులే లేకపోవడంతో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారట. ఇప్పటికే కొందరు గులాబీ కండువా కప్పేసుకున్నారు. మిగిలిన వాళ్లూ తమ ఈక్వేషన్ల ఆధారంగా సర్దుకునే పనిలో పడ్డారట.
ఢిల్లీని వీడి రాని వంశీచంద్‌రెడ్డి
ముఖ్యంగా వంశీచంద్‌రెడ్డి కల్వకుర్తిలో పారాచూట్ లీడర్‌గా మారిపోయినట్టు కాంగ్రెస్‌లోనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో వచ్చి హడావిడి చేద్దామని అనుకుంటే.. అప్పుడు కంటికి ఎవరూ కనిపించబోరని హెచ్చరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు తెలిసినా.. వంశీచంద్ రెడ్డి ఢిల్లీని వీడి రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందట. ఏదైనా పని ఉందని ఫోన్ చేస్తే.. తాను ఢిల్లీలో ఉన్నానని.. వచ్చాక మాట్లాడుకుందామన్న జవాబే తప్ప వంశీ నుంచి మరో ముచ్చట ఉండదట.
కల్వకుర్తిలో చడీచప్పుడు లేని కాంగ్రెస్
రాష్ట్రంలో పలుచోట్ల కాంగ్రెస్ నేతలు యాక్టివ్‌గా ఉన్నా.. కల్వకుర్తిలో పార్టీ చడీచప్పుడు లేదట. దీనికంతటికీ కారణం.. రాష్ట్ర రాజకీయాలకంటే జాతీయ రాజకీయాలపైనే వంశీ ఆసక్తి చూపించడమేనట. మరోసారి ఎంపీగా పోటీ చేసి.. గెలిచి.. పార్లమెంట్‌లో అడుగు పెట్టాలని గట్టి కోరికతో ఉన్నట్టు చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమని అనుకుంటే.. కల్వకుర్తిని నడిపించే కాంగ్రెస్ నాయకుడు ఎవరన్నది కేడర్ ప్రశ్న. మరి..కాంగ్రెస్ కేడర్ గోడును పార్టీ నేతలు పట్టించుకుంటారా? వంశీ ఢిల్లీ నుంచి కల్వకుర్తిలో ల్యాండ్ అవుతారో లేదో చూడాలి.