కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో వైసీపీ గ్రూపు తగాదాలు రోడ్డున పడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానికి, మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి మధ్య గత కొంత కాలంగా ఉన్న విబేధాలు బయటపడ్డాయి. తన ఎంపీ ఫండ్స్‌తో ముస్లిం శ్మశాన వాటికలో చేపట్టిన అభివృద్ధి పనులు చూడటానికి వెళ్తున్న బాలశౌరిని… పేర్ని నాని అనుచరుడు అడ్డుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఎంపీ వస్తే పేర్ని నాని వర్గం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని బాల శౌరీకి ముందే చెప్పారట పోలీసులు. అయితే, అభివృద్ధి కార్యక్రమానికి వస్తుంటే అడ్డుకోవడం ఏంటన్న బాలశౌరీ… అక్కడికి వెళ్లడానికే నిర్ణయించుకున్నారు. అయితే, 33వ డివిజన్ కార్పొరేటర్ అస్గర్ అలీ, అతని అనుచరులు ఎంపీని అడ్డుకున్నారు. మళ్లీ తమ ప్రాంతానికి రావద్దనీ వార్నింగ్ ఇచ్చారట. దీంతో స్థానికంగా ఘర్షణ వాతావరణం ఏర్పడిందని లోకల్ టాక్.
అయితే, ఎంపీ కార్యక్రమానికి వచ్చేటప్పుడు స్థానిక కార్పొరేటర్‌కు చెప్పకపోవడం ఏమిటని ప్రశ్నిస్తోంది పేర్ని వర్గం. అయితే, గత మూడేళ్ళుగా తనను నియోజకవర్గంలో తిరగకుండా చేస్తున్న పేర్ని నాని కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందంటున్నారు ఎంపీ బాలశౌరి. అంతేకాదు… నిరసన ప్రదర్శన కోసం బ్యానర్లు, ప్లకార్డులు ముందే సిద్ధం చేసుకున్నారని వివరిస్తోంది బాలశౌరీ వర్గం. మచిలీపట్నం ఏమైనా పేర్ని నాని జాగీరా అని ప్రశ్నిస్తోంది.
ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఉంది. పేర్ని నాని వర్గానికి ముందు నుంచి సొంత పార్టీ ఎంపీ బౌలశౌరీని కాదని టీడీపీ, బీజేపీ నేతలతో సఖ్యతకే ప్రాధాన్యమిస్తున్నారని టాక్. అంతకు ముందు రోజే టీడీపీ, బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వర్గీయులు చెట్టాపట్టాలేసుకుని తిరిగారని MP వర్గం విమర్శిస్తోంది. మచిలీపట్నం వేదికగా ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేసిన సుజనా చౌదరితో ఎలా వేదిక పంచుకుంటారని ప్రశ్నిస్తోంది. సుజనా చౌదరి ఫ్లైట్‌లో పేర్ని నాని ప్రయాణించిన అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పేర్ని నాని ఉన్న వేదికపై నుంచే సుజనా చౌదరి స్థానిక MPపై విమర్శలు చేశారు. ఎమ్మెల్యే మాత్రం స్నేహంగా ఉంటారని కితాబిచ్చారు. ఇప్పుడు ఈ అంశం^పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణను ప్రతి పది రోజులకోసారి పేర్ని నాని కలుస్తుంటారని బాలశౌరీ వర్గం ఆరోపిస్తోంది. కొల్లు రవీంద్రతోనూ తెర వెనుక లాలూచీ వ్యవహారాలు ఉన్నాయంటోంది. అంతే కాదు… మచిలీపట్నంలో స్వాతంత్ర్య సమరయోధుడు పట్టాభి సీతారామయ్య స్మారక వేదిక, భవనాన్ని నిర్మించటానికి 77 కోట్ల రూపాయలు తాను తెచ్చినా… రెండు ఎకరాల భూమిని కేటాయించకుండా అధికారుల్ని పేర్ని నాని బెదిరిస్తున్నారన్నది MP వర్గం ఆరోపణ. సీఎం సైతం రెండు ఎకరాల భూ కేటాయించాలని ఆదేశాలు జారీ చేసినా… పేర్ని వర్గం అడ్డుకుంటోందని విమర్శిస్తున్నారు. .
మచిలీపట్నం పోర్టు అభివృద్ధి పనుల్ని కూడా పేర్ని నాని మూడేళ్ళుగా ఇదే రకంగా అడ్డుకుంటున్నారని MP బాలశౌరి వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ అంశం హైకమాండ్‌కు చేరింది. దీంతో దీనిపై మీడియా ముందు మాట్లాడొద్దని పార్టీ పెద్దలు సూచించినట్టు తెలుస్తోంది. అయితే పేర్ని వర్గం మాత్రం తగ్గేదే లేదంటోంది. త్వరలోనే మీడియా సమావేశం పెట్టి MPపై ప్రతిదాడికి సన్నాహాలు చేస్తోందని సమచారం. మరి బందరు రగడ మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.