Telangana Congress : కాంగ్రెస్‌లో అంతేనా..!? ఒకరి తర్వాత ఒకరు మళ్లీ గళం విప్పడం మొదలు పెట్టారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ప్రారంభమైన పంచాయితీ.. ఎటు దారి తీస్తోందో.. ఏమౌతుందో శ్రేణులకు అర్థం కావడం లేదా? ఈ కల్లోలాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా అధిగమిస్తుంది?
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మొదలైన ఎపిసోడ్ అనేక మలుపులు తిరుగుతోంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఠాగూర్.. పిసిసి చీఫ్ రేవంత్ టార్గెట్‌గా సీనియర్లు బలంగా పావులు కదుపుతున్నారు. రేవంత్ మాటలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నవాళ్లంతా.. పీసీసీ చీఫ్‌కు ఠాగూర్‌ను ఏజెంట్ గా విమర్శిస్తున్నారు. అయితే కోమటిరెడ్డి ఎపిసోడ్ ముగుస్తుంది అనుకుంటున్న సమయంలో మళ్లీ మర్రి శశిధర్ రెడ్డి బయటకు వచ్చారు. శశిధర్ రెడ్డి.. ఎంపీ వెంకటరెడ్డిని సమర్ధిస్తూనే రేవంత్, అద్దంకి దయాకర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. దాంతో సమస్య మళ్లీ రాజుకుంది.
తాజాగా ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి సైతం అసంతృప్తి బయటపెట్టారు. ఠాగూర్…తనతో మాట్లాడిన అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏఐసీసీ కార్యక్రమాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బాధించినట్టు మహేశ్వర్ రెడ్డీ చెబుతున్నారు. సమాచారం తెలుసుకోకుండా ఇంఛార్జ్ నోరు జారారని మండిపడుతున్నారు. ఇలా సీనియర్ నేతలు ఒకరు తర్వాత ఒకరు ఓపెన్ కావడం రచ్చ అవుతోంది. అయితే వరస పరిణామాలపై ఏఐసీసీ ఏం చేస్తోంది!? సమస్యను గుర్తించే పనిలో ఉందా లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
శశిధర్‌రెడ్డి వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌ను టార్గెట్ చేసిన మొదటి వ్యక్తి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆయన కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్నారు. పార్టీ వ్యవహారాలపై నో కామెంట్స్ అంటూ నియోజక వర్గంలో పర్యటనలు చేసుకుంటున్నారు జగ్గారెడ్డి. నవంబర్ 5న గాంధీభవన్‌లోనే మాట్లాడతా అని ఒక ప్రకటన చేశారు. అయితే నవంబర్‌కి.. జగ్గారెడ్డి కామెంట్స్‌కి సంబంధం ఏంటనే చర్చ ఉంది. మునుగోడు ఉపఎన్నికపై మాట్లాడతారా..? లేక పార్టీ నాయకత్వంపై మరోసారి చెలరేగుతారా? అనేది సస్పెన్స్. కొన్నాళ్లు విరామం.. మరికొన్నాళ్లు ఫైరింగ్ అన్నట్టు జగ్గారెడ్డితో యవ్వారం ఉంటుంది. ఇంకోవైపు .. ఇంతలో తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు నివేదిక ఇస్తానని చెప్పుకొచ్చారు ఎంపీ వెంకటరెడ్డి. మునుగోడు ఉపఎన్నిక తరుణంలో పార్టీలో రేగుతున్న ఈ వివాదాలు ఎటు దారితీస్తాయో అర్థం కావడం లేదట. మరి.. సమస్యనున అధిష్ఠానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.