తెలంగాణ కాంగ్రెస్‌లో వివాదాలు కామన్. ఒకరు ఎడ్డెం అంటే.. ఇంకొకరు తెడ్డం అంటారు. గట్టిగా ప్రశ్నిస్తే.. అంతర్గత ప్రజాస్వామ్యం.. భిన్నాభిప్రాయాలు అనే డైలాగులు వినిపిస్తారు. అయితే తరచూ ఇలాంటి అంశాలు చర్చగా మారడంతో.. వాటికి స్వస్తి పలకాలని నిర్ణయించారా అనే ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క మధ్య సఖ్యత లేదని గుర్తించి.. వారిని ఢిల్లీకి పిలిచి మాట్లాడారనే వాదన వినిపిస్తోంది.
పార్టీలో ఇటీవల పెద్ద దుమారం రేగింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లేపిన చిచ్చు ఏఐసీసీలో సెగలు రేపింది. చేరికలు కోసం వెళ్లిన రేవంత్‌ని ఉండమని చెప్పి.. హైదరాబాద్‌లో ఉన్న సీఎల్పీ నేత భట్టిని అధిష్ఠానం హుటాహుటిన ఢిల్లీ పిలిచింది. కాంగ్రెస్ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న కేసీ వేణుగోపాల్‌తో ఆ ఇద్దరూ భేటీ అయ్యారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఎన్నికల ప్రచారం సందర్భంగా పార్టీలో ప్రారంభమైన పంచాయతీ.. ఆ తర్వాత చేరికలపై చర్చ వరకు వెళ్లింది. ఈ రెండు అంశాల్లో కీలక నేతలు ఇద్దరి మధ్య సమన్వయ లోపం ఉందని గుర్తించింది పార్టీ. యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాక సందర్భంగా ఇద్దరూ ఎవరికి వారు సమాచారం ఇచ్చాం అంటున్నారు. కానీ.. జగ్గారెడ్డి వంటి వారు తమకు సమాచారమే లేదని మీడియాకు ఎక్కారు. ఇక్కడే ట్విస్ట్ ఉందనేది కాంగ్రెస్ వర్గాల చర్చ.
తెలంగాణలో చేరికల్ని వేగవంతం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తోంది. దీంతో అధిష్ఠానం చెప్పంది కదా అని… చేర్చుకోవడం మొదలు పెట్టారు రేవంత్. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు చేరికపై సీఎల్పీ నేతకి సమాచారం ఇవ్వలేదట. దానిపైనే రచ్చ జరిగింది. ఆ తర్వత చేపట్టిన ఒకటి రెండు చేరికలపై కూడా ప్రశ్నలు వినిపించాయి. పీసీసీ చీఫ్ ఒంటెద్దు పోకడలకు పోతున్నారనే విమర్శలు బయటకొచ్చాయి. దీనిపై పార్టీలోని సీనియర్లు ఏకమైన పరిస్థితి కనిపించింది.
ఆ గొడవలే.. యశ్వంత్ సిన్హా ప్రచారం కేంద్రంగా.. కాంగ్రెస్‌లో అలజడికి దారితీశాయి. ఉపేక్షిస్తే మొదటికే మోసం వస్తుందని అనుకుందో ఏమో.. కాంగ్రెస్ హైకమాండ్ భట్టిని ఢిల్లీకి పిలిచింది. రేవంత్, భట్టిల మధ్య ఉన్న గ్యాప్‌పై హస్తినలో చర్చ సాగినట్టు సమాచారం. కాంగ్రెస్‌లోకి ఎవరొచ్చినా చేర్చుకోవాలని సూచించారట. కాకపోతే.. పీసీసీ చీఫ్ దగ్గర ఉన్న చేరికల జాబితాను.. సిఎల్పీ నేత దగ్గరున్న లిస్ట్‌ను వేణుగోపాల్ తీసుకున్నారట. ఆ రెండు జాబితాల్లో ఏఐసీసీ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాళ్లను చేర్చుకోవడానికి రేవంత్, భట్టి అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో రేవంత్ దూకుడికి బ్రేక్‌లు వేశామని.. ఆయనంటే గిట్టని కాంగ్రెస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నారట. చెప్పా పెట్టకుండా చేస్తున్నారనే చర్చ నుంచి.. ఇప్పుడు అందరికీ చెప్పి చేయాలనే వరకు తీసుకొచ్చామని అనుకుంటున్నారట.
వాస్తవానికి టీఆర్ఎస్ నుంచి వచ్చే వారి వివరాలను ముందే లీక్ చేస్తే… చేరికలు ఆగిపోయే ప్రమాదం ఉందన్నది రేవంత్ టీమ్ వాదన. చేరికలు పార్టీ ఆదేశాల ప్రకారమే.. పార్టీ అనుమతితోనే నడుస్తున్నాయని చెబుతోంది. పైగా చేరికలు అనేవి వ్యూహంలో భాగమని.. వాటిని బయటకు చెబితే ఆ వ్యూహానికి అర్థమే ఉండబోదని వాదిస్తోంది. చేరికలపై ముందుగా సమాచారం ఉండాలన్న దానిపైనే కాంగ్రెస్‌లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కేసీ వేణుగోపాల్‌తో భేటీ తర్వాతైనా.. నాయకుల మధ్య సయోధ్య కుదురుతుందా..? ఢిల్లీకి వెళ్లిన వాళ్లు చేరికల స్పీడ్ పెంచుతారా..? అనే చర్చ జరుగుతోంది. మరి.. హైకమాండ్ ఎలాంటి మంత్రం వేసిందో.. ఆ మంత్రం పనిచేస్తుందో లేదో చూడాలి.