Muppidi Venkateswararao : నియోజకవర్గంగా ఏర్పడిన నాటి నుంచి తిరుగులేదని అనుకున్న టీడీపీ.. గత ఎన్నికల్లో చతికిల పడింది. ఓటమి తర్వాత మూడేళ్లుగా తెలుగు తమ్ముళ్ల చడీచప్పుడు లేదు. మాజీ ఎమ్మెల్యే సైతం ముందుకు వెళ్లాలా వద్దా అనే సందిగ్దంలో ఉన్నారట. దీంతో కుదురుకునేందుకే ఆపసోపాలు పడుతోంది కేడర్.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గం. ఆరుసార్లు ఇక్కడ టీడీపీదే గెలుపు. అదే పార్టీ ప్రస్తుతం గోపాలపురంలో చాలా బలహీనంగా కనిపిస్తోంది. చరిత్ర పవర్‌ఫుల్‌గా ఉన్నప్పటికీ.. టీడీపీ నేతల్లో మాత్రం ఆ శక్తి కరిగిపోయిందట. 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత కోలుకోవడానికి అవకాశమే చిక్కడం లేదట. డీలా పడ్డ నాయకులు.. కార్యకర్తలు ముందడుగు వేయడానికి సాహసించడం లేదట. నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరే దీనికి కారణమన్నది స్థానిక తెలుగు తమ్ముళ్లు చెప్పేమాట. ఏతావాతా మూడేళ్లుగా గందరగోళం మరింత ఎక్కువైందట.
గోపాలపురం నియోజకవర్గంలో భాగమైన ద్వారకా తిరుమల, దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం మండలాల్లో నేతల వర్గపోరు పీక్స్‌లో ఉందట. వచ్చే ఎన్నికల్లో తమకు నచ్చిన నేతను బరిలో నిలపాలని చూస్తున్నట్టు సమాచారం. దీంతో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు ఛాన్స్ ఉంటుందో లేదో అనే అనుమానంతో సైలెంట్ అవుతోంది కేడర్. రాష్ట్రంలో టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమం చేపడితే.. గోపాలపురంలో ముప్పిడి చేస్తున్న ప్రోగ్రామ్స్‌కు కార్యకర్తలు రావడం లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కొత్త అభ్యర్థి పోటీ చేస్తారనే ప్రచారంతో తెలుగు తమ్ముళ్లు గప్‌చుప్ అవుతున్నారట. బరిలో ఉండేదెవరు? టికెట్ ఇచ్చేది ఎవరికి? అనే అంశాలపై ఆరా తీయడానికే ఆసక్తి కనబరుస్తున్నారట.
గోపాలపురం ఎస్సీ రిజర్డ్వ్ నియోజకవర్గం. ఎప్పటిలాగే ఇక్కడ సీటు ఎవరికి ఇస్తామనేది టీడీపీ అధిష్ఠానం సస్పెన్స్ కొనసాగిస్తోందట. దీనిపై మాజీ ఎమ్మెల్యే ముప్పిడికి కూడా క్లారిటీ లేదట. చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చు అనే నమ్మకంతో చాలా మంది నాయకులు పెదవి విప్పడం లేదు.. కాలు కదపడం లేదు. అందుకే గోపాలపురంలో టీడీపీ కేడర్ కుదురుకోలేపోతోందని చెబుతున్నారు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో నిరాశ, నిస్పృహలు నెలకొంటే ఎలా అన్నది కేడర్ ప్రశ్న. వచ్చేదెవరైనా.. బరిలో నిలిచేది ఎవరైనా గోపాలపురంలో టీడీపీ జెండాలను రెపరెపలాడించకపోతే భవిష్యత్ కష్టమన్నది తమ్ముళ్లు చెప్పేమాట. ఇప్పటి నుంచీ రోడ్డెక్కకపోతే తర్వాత జనాల అటెన్షన్ తీసుకురాలేమని ఆందోళన చెందుతున్నారట.
ఎస్సీ నియోజకవర్గం కావడంతో.. ఇప్పుడే అభ్యర్థిపై స్పష్టత ఇస్తే.. వాళ్లే పార్టీని గోపాలపురంలో లీడ్ చేస్తారని స్థానిక టీడీపీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. అయితే ధైర్యం చేసి ఈ విషయాన్ని అధిష్ఠానానికి ఎవరు చెబుతారన్నదే ప్రశ్న. ఈ సంశయంతోనే మాజీ ఎమ్మెల్యే ముప్పిడి తిప్పలు పడుతున్నట్టు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్గపోరును అధిగమించడం.. అధిష్ఠానాన్ని ఒప్పించడం మాజీ ఎమ్మెల్యేకు పెద్ద సవాలే అని అభిప్రాయ పడుతున్నారట. మరి.. గోపాలపురంలో టీడీపీ ఎవరికి పట్టం కడుతుందో కాలమే చెప్పాలి.