తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. నేతలు ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా గవర్నర్ తమిళి సై నిర్వహించిన మహిళా దర్బార్‌పై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మహిళా దర్బార్‌ని స్వాగతించారు. అంతేకాదు… రాష్ట్రంలో గవర్నర్ పాలన పెట్టినా బాగుంటుందన్నారు రేవంత్. తెలంగాణ ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి ఎవరు లేనప్పుడు కనీసం గవర్నర్ అయినా వింటే మంచిదే కదా అన్నారాయన. ఇంత వరకు బాగానే ఉన్నా… పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాత్రం దీనిపై రేవంత్‌కి భిన్నంగా స్పందించారు.
రేవంత్ రెడ్డి పేరెత్తకుండానే… అతనిది సొంత అభిప్రాయంగా చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. తెలంగాణలో రాష్ట్రపతి పాలన కోరుకోవడం తప్పన్నారు. అది కాంగ్రెస్‌కే నష్టమన్నారాయన. రాష్ట్రపతి పాలనతో రాజకీయంగా దెబ్బతీయాలని బీజేపీ చూస్తుంది ఆరోపించారు జగ్గారెడ్డి. పైగా గవర్నర్ దర్బార్ పెట్టడం వల్ల ప్రయోజనం లేదన్నారు. దీని వెనుక బీజేపీ ఉందన్నది జగ్గారెడ్డి ఆరోపణ. గవర్నర్‌కి జరిగిన అవమానంపైనే అధికారులపై ఇంత వరకూ చర్యల్లేవని… ఇక మహిళలు ఇచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలుంటాయని ప్రశ్నించారు. .
జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాల్లో కొంత లాజిక్ ఉంది. ప్రోటోకాల్ పాటించడం లేదని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో పాటు పోలీసు అధికారులపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ఫిర్యాదు చేశారు గవర్నర్. దానిపై ఇప్పటి వరకూ ఎలాంటి అతీగతీ లేదు. ఇక రాజ్‌భవన్ వెళ్లే మహిళా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని జగ్గారెడ్డి సందేహించడంలో అర్థం లేకపోలేదు. …
గవర్నర్ తమిళి సై ప్రజాదర్బార్‌పై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, కాంగ్రెస్‌లో ఇది సహజం కూడా. రేవంత్ వ్యాఖ్యల్ని ఓ వైపు తప్పుబడుతూనే… మరోవైపు… అది తన వ్యక్తిగత అభిప్రాయమంటూ తనను తాను సమర్థించుకుంటున్నారు జగ్గారెడ్డి. సాధారణంగా ఏ పార్టీకైనా ఒక అంశంపై ఒక విధానం ఉంటుంది. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే… నేతలంతా దానిని పాటించాల్సి ఉంటుంది. కానీ… గవర్నర్ దర్బార్ విషయలో ఒకే అభిప్రాయం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు జగ్గారెడ్డి. పార్టీ అంతర్గత అంశాలపై మాట్లాడకూడదు కానీ… అంశాలపై మాట్లాడినప్పుడు… భిన్నాభిప్రాయాలు సహజమే అంటున్నారాయన. .
మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో ఏ అంశంపై అయినా ఒక్కో నేతది ఒక్కో అభిప్రాయం అన్నట్టు మారిపోయింది .