సీనియర్ నేత సైలెంట్ మోడ్ నుంచి యాక్టివ్ మోడ్‌లోకి వస్తున్నారా? ఇన్నాళ్లూ పత్తా లేని ఆయన.. సడెన్‌గా సీఎం కేసీఆర్‌ను ఎందుకు కలిశారు? టీఆర్ఎస్ అధినేతతో ఆయన ఏం మాట్లాడారు? కోల్‌బెల్ట్‌లో హీటెక్కిస్తున్న రాజకీయం ఏంటి? లెట్స్ వాచ్..!
గడ్డం అరవిందరెడ్డి. మాజీ ఎమ్మెల్యే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ పొలిటీషియన్‌గా ఉన్న ఆయన.. కొంత కాలంగా రాజకీయతెరపై కనిపించలేదు. గత ఎన్నికల తర్వాత ఏమైపోయారో కూడా తెలియని పరిస్థితి. తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కడంతో సడెన్ ఎంట్రీ ఇచ్చారు అరవిందరెడ్డి. అదీ నేరుగా సీఎం కేసీఆర్‌ను కలిసి మాట్లాడటంతో మంచిర్యాల పాలిటిక్స్‌లో సెగ రాజుకుంది. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న అరవిందరెడ్డి మంచిర్యాల నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్ దక్కపోయినా ఎమ్మెల్సీని చేస్తారని ఆశించారు. అవేమీ నెరవేరకపోవడంతో.. మనస్తాపం చెందారో ఏమో రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు.
అరవింద్‌రెడ్డి 2001 నుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. 2004లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కలేదు. 2009లో మాత్రం గెలిచారు. 2010 ఉప ఎన్నికలోనూ సత్తా చాటారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరి మంచిర్యాల నుంచి పోటీ చేసినా గెలవలేదు. గతంలో సన్నిహితంగా ఉన్న కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతగా తీవ్ర విమర్శలు చేశారు అరవింద్‌రెడ్డి. తర్వాత కాలంలో కారెక్కినా ఫలితం లేకపోయింది. అదే అరవిందరెడ్డి.. తాజాగా సీఎం కేసీఆర్‌ను కలిసి మాట్లాడటం జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
2014, 2018 ఎన్నికల్లో మంచిర్యాల నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా దివాకర్‌రావు గెలిచారు. 2018 ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటికీ అరవిందరెడ్డి పోటీ చేయలేదు. ఆనాటి రాజకీయ పరిస్థితుల కారణంగా దివాకర్‌రావుకు మద్దతు ప్రకటించారు. ఆ సమయంలోనే అరవిందరెడ్డిని ఎమ్మెల్సీని చేస్తారని అనుకున్నారు. ఆనాటి పరిస్థితులను అర్థం చేసుకున్నారో ఏమో.. సైలెంట్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు మంచిర్యాలలో తిరిగి చురుకైన పాత్ర పోషించాలనే ఆలోచనలో అరవిందరెడ్డి ఉన్నారట. అందుకే సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారని చెబుతున్నారు. పాత పరిచయాల ఆధారంగా సీఎం కేసీఆర్ ఆయన్ని కుశల ప్రశ్నలు వేశారా లేక.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని అరవిందరెడ్డే నేరుగా అడిగేశారా అనేది చర్చ.
క్షేత్రస్థాయిలో గ్రాఫ్ సరిగాలేని ఎమ్మెల్యేలను మార్చేస్తారని.. వచ్చే ఎన్నికల్లో కొత్త వారికి టికెట్ ఇస్తారని టీఆర్ఎస్‌లో ప్రచారం జరుగుతోంది. ఆ జాబితాలో మంచిర్యాల ఉందో లేదో కానీ.. అరవిందరెడ్డి ఎంట్రీ మాత్రం గులాబీ శిబిరంలో అలజడి రేపుతోంది. మంచిర్యాలలో నిర్వహించిన సర్వేలో ఎవరికి మార్కులు పడ్డాయి? అధిష్ఠానం దృష్టిలో ఎవరు ఉన్నారు? అనే ఆరాలు పెరిగిపోయాయి. ఇక నుంచి మంచిర్యాలలో అరవిందరెడ్డి వేసే అడుగులు ఆసక్తిగా ఉంటాయని అనుకుంటున్నారు. తనకు పోటీగా వస్తున్నారని తెలిస్తే దివాకర్‌రావు రియాక్షన్ ఏంటన్నది తెలియాలి. మరి.. మంచిర్యాల రాజకీయ మంచింగ్ ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి.