అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో నియోజకవర్గాల్లో పొలిటికల్ సెగలు రాజుకుంటున్నాయి. పగలు.. సెగలు పెరుగుతున్నాయి. అంశం చిన్నదైనా.. పెద్దదైనా ప్రత్యర్థిని ఇరుకున పెట్టడానికి చూస్తున్నారు నేతలు. పోలీస్ కేసులు పెట్టుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. వరంగల్ పశ్చిమలోనూ ఇదే జరగడంతో ఓరుగల్లు రాజకీయం కాక రేపుతోంది.
ఇద్దరి మధ్య రాజకీయ రచ్చ.. పోలీసులకు ఫిర్యాదు
ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, కాంగ్రెస్ నేత నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య కొంతకాలంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉప్పు నిప్పుగా ఉంది రాజకీయం. వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ ప్రత్యర్థులుగా తలపడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పైగా ఇద్దరిలోనూ కొన్ని సారూప్యతలు ఉండటంతో మరింత వేడెక్కుతోంది నియోజకవర్గం. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు. నాయిని సైతం కాంగ్రెస్‌పార్టీ జిల్లా ప్రెసిడెంట్. ఇటీవల ప్రజా సమస్యల పేరుతో కాంగ్రెస్ చేపట్టిన నిరసనతో అగ్గి రాజుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యను టేకప్ చేశారు నాయిని. అర్హులైన లబ్ధిదారులకు వాటిని కేటాయించడం లేదనేది ఆయన ఆరోపణ. ఆ రగడ చినికి చినికి గాలివానిగా మారి.. పోస్టర్ల యుద్ధంగా తెరపైకి వచ్చింది. అక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో.. పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
పశ్చిమలో కాంగ్రెస్ బలపడిందనే అంచనాల్లో నాయిని
వరంగల్ వెస్ట్ నుంచి గత నాలుగు పర్యాయాలుగా వినయ్‌భాస్కర్ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలిస్తే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రి అవుతాననే ఆశ పెట్టుకున్నారు. అందుకే నియోజకవర్గంలో పట్టు సడలకుండా పావులు కదుపుతున్నారు. జనాలను కలవడం.. వారి సమస్యలు వినడం.. అక్కడిక్కడే పరిష్కారాలు వెతకడం చేస్తున్నారు ఎమ్మెల్యే. అయితే వినయ్ భాస్కర్ వరుసగా గెలుస్తుండటంతో ఆయనపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందనేది కాంగ్రెస్ వర్గాల భావన. దానిని క్యాష్ చేసుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. వచ్చే ఎన్నికల్లో తానే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని గట్టి ధీమాతో ఉన్న నాయిని రాజేందర్‌రెడ్డి ఎమ్మెల్యేపై నేరుగా బాణాలు ఎక్కు పెడుతున్నారు. గతంలో రాహుల్ గాంధీ సభను ఇదే నియోజకవర్గంలో నిర్వహించడంతో.. అప్పటి నుంచి పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడిందనే లెక్కలు వేస్తున్నారు నాయిని. గత ఎన్నికల్లో పోటీ చేద్దామని అనుకున్నా.. పొత్తుల్లో భాగంగా సీటు వదులుకోవాల్సి వచ్చింది. ఈ దఫా మాత్రం అలాంటి పొత్తు సంకేతాలు లేకపోవడం.. ఎలాగైనా పోటీ చేయాలనే పట్టుదలతో వ్యూహాలకు పదును పెడుతున్నారు.
కోవర్టుల పనిగా నాయిని అనుమానం
ఈ రాజకీయ పోరులో రెండు వర్గాల మధ్య కౌంటర్లు పేలుతున్నాయి. ఇంతలో నాయినిని లక్ష్యంగా చేసుకుని కొందరు వాల్ పోస్టర్లు వేశారు. వాటిల్లో నాయినిపై పలు ఆరోపణలు చేయడంతో పరిస్థితి వేడెక్కింది. ఈ పోస్టర్ల వెనుక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హస్తం ఉందని అనుమానించిన ఆయన.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీలోని కొందరు కోవర్టులుగా మారి.. బీఆర్‌ఎస్‌కు సహకరిస్తున్నారని సందేహిస్తున్నారు. పనిలో పనిగా ఎమ్మెల్యేకు ఆయన సవాళ్లు విసిరారు. వాటిని వినయ్ భాస్కర్ లైట్‌గా తీసుకోవడంతో.. పశ్చిమలో ఇద్దరి మధ్య రగడ ఇప్పట్లో ఆగబోదని.. ఎన్నికల వరకు కొనసాగుతుందని అనుకుంటున్నారట.