నిన్నటి వరకు ఆ నియోజకవర్గంలో మాటలు తూటాలు పేలాయి. నువ్వెంత అంటే నువ్వెంత అని సవాళ్లు విసురుకున్నారు.. చూసుకుందాం రా అంటూ పరస్పరం కత్తులు నూరారు. అయితే ఈ గరంగరం పాలిటిక్స్ ఇంకో టర్న్ తీసుకున్నాయి. ఇక మాటల మీద కౌంటర్లు ఉండవ్.. కేసులు మాత్రమే ఉంటాయన్న సంకేతాలు ఇస్తున్నారట. ఆ యువనేత దూకుడుకు కళ్లెం వేయాలని చూస్తున్నారా? వరుసగా కేసులు వచ్చి పడుతుంటే యువనేత ఏం అంటున్నారు?
ఏడాదిగా పరిటాల ఫ్యామిలీ దూకుడు
స్టేట్‌లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడిచే.. రాప్తాడు నియోజకవర్గ రాజకీయాలు మరో టర్న్ తీసుకున్నాయి. నిన్నటి వరకు ఇక్కడ మాజీ మంత్రి పరిటాల సునీత ఫ్యామిలీకి.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కుటుంబానికి మధ్య మాటల యుద్ధం నడిచింది. కానీ ఇప్పుడు సీన్ కేసుల వైపు మళ్లింది. పరిటాల కోటను బద్దలుకొట్టి 2019 ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఓటమి షాక్ తోనో లేక కాస్త టైం తీసుకుందామని అనుకున్నారో ఏమో.. మొదట ఏడాది కాస్త సైలెంట్‌గా కనిపించిన పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ తర్వాత దూకుడు పెంచారు. అధికార పార్టీకి కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. గత ఏడాది నుంచి వీళ్లు మరింత స్పీడయ్యారు.
పాదయాత్రలో శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలతో దుమారం
తల్లీకొడుకులు ఇద్దరూ వరుసగా తోపుదుర్తి కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో వారు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. జాకీ పరిశ్రమ వివాదం ఎమ్మెల్యేర ప్రకాష్‌రెడ్డి వర్సెస్ పరిటాల మధ్య పెద్ద మాటల దుమారం చెలరేగింది. ఎమ్మెల్యే కూడా ఒకటికి నాలుగుసార్లు జాకీ పరిశ్రమ తనవల్ల పోలేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తర్వాత జరిగిన పరిణామాలతో ఏ ఒక్క అవకాశాన్ని వదలుకోకూడదన్నట్టుగా టీడీపీ నాయకులు మరింత స్ట్రాంగ్ అటాక్ చేస్తున్నారు. జనంలోకి కూడా వివిధ కార్యక్రమాలతో వెళ్తున్నారు. పరిటాల శ్రీరాం ధర్మవరంతోపాటు రాప్తాడులోనూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎక్కడ ఏ ఛాన్స్ దొరికినా వదలడం లేదు. ఇన్ని రోజులు ఈ రెండు కుటుంబాల మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్లు ఉండేవి. ఒకానొక సందర్భంలో చూసుకుందాం రా అనేంత వరకు వెళ్లారు. కానీ.. పరిటాల సునీత ఆత్మకూరు మండలంలో చేపట్టిన పాదయాత్రలో శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు
రౌడీషీట్లు ఎత్తి వేయాలని.. ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి అధిష్ఠానాన్ని కోరేది పార్టీ నేతల కోసం కాదని.. తన అన్న కోసమని కామెంట్స్ చేశారు శ్రీరాం. తనపై విమర్శలు రచేస్తున్న ప్రకాష్‌రెడ్డికి ఇదే హెచ్చరిక అంటూ పరిటాల శ్రీరామ్ ఘాటుగా స్పందించారు. తాను అప్పుడప్పుడూ కార్యక్రమాలు చేస్తుంటూనే తట్టుకోలేకపోతున్నావ్.. ఇక మూడో కన్ను తెరిస్తే అసలు తట్టుకోలేవ్ అని శ్రీరామ్ హెచ్చరించారు. నువ్వు ఎక్కడ ఉంటావో చూసుకో అని సవాల్ కూడా చేశారు. సరిగ్గా ఈ వ్యాఖ్యలే ఇప్పుడు రాప్తాడులో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కట్ చేస్తే ఈ వ్యాఖ్యల తర్వాత టీడీపీ ధర్మవరం నియోజకవర్గం ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్‌పై ఆత్మకూరు పోలీసులు కేసు పెట్టారు. ఆత్మకూరు బహిరంగ సభలో శ్రీరామ్ రెచ్చగొట్టేలా ప్రసంగించారని IPC 150A, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
శ్రీరామ్‌పై ఉన్న పాత కేసులను ఆరా తీస్తున్న పోలీసులు
కేసులతోపాటు వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కూడా కంటిన్యూ అవుతోంది. ఎమ్మెల్యే అనే మాటలకు కౌంటర్‌గా స్పందిస్తే.. ఇన్ని కేసులు పెడితే ఎమ్మెల్యేతోపాటు వారి సోదరులపై ఎన్ని కేసులు పెట్టాలని నిలదీస్తున్నారు టీడీపీ నేతలు. కానీ సీన్ ఇక్కడితో అయిపోలేదు. శ్రీరామ్‌పై పాత కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయన్నది పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో శ్రీరామ్ పర్యటన సందర్భంలోనూ గతంలో చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారట. శ్రీరామ్‌ను కేసుల వైపు మళ్లించేందుకే ఇలా చేస్తున్నారనే విమర్శలూ లేక పోలేదే. అయితే శ్రీరామ్ మాత్రం తగ్గేదే లేదు అంటున్నారట. కేసులు పెడితే ఏమౌతుంది.. మాకున్న చట్టాలే అవతలి వారికి కూడా వర్తిస్తాయని బదులిస్తున్నారట. కేసులకు భయపడి వెనక్కి తగ్గేది లేదని.. ఎక్కడైనా తన దూకుడు ఇలాగే ఉంటుందని చెబుతున్నారట. నిత్యం హాట్ హాట్‌గా ఉంటే రాప్తాడులో ఈ కేసుల గొడవ ఎటు దారితీస్తుందోననే టెన్షన్ రెండు పార్టీల కేడర్‌లో కనిపిస్తోంది.