సప్త సముద్రాలు దాటిన గజ ఈతగాడు.. పంటకాలువ ఈదలేక మునిగిపోయాడనే రీతిలో ఉందట ఆ నియోజకవర్గంలో వైసీపీ నేతల పరిస్థితి. ఎన్నికలు ముగిసి మూడున్నరేళ్లయినా.. వర్గపోరు నిత్య నూతనంగా ఉంటోంది. వేదిక ఏదైనా ఎదురుపడితే తన్నుకోవడమే. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.
చింతలపూడి. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ప్రాంతం. 2019ఎన్నికల్లో వైసీపీకి 35 వేలకు పైగా ఓట్ల మెజారిటీ దక్కింది. భారీ ఆధిక్యత వచ్చినా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి డొల్లే అన్నది శ్రేణులు చెప్పేమాట. ఇక్కడ వర్గపోరు ఎక్కువ. అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులు ఎక్కడ అవకాశం చిక్కితే అక్కడ తమ పెతాపాలను చూపిస్తున్నారు. బాహాబాహీలకు దిగి.. తమది తరతరాల పోరాటంగా ప్రజలకు చెప్పుకొస్తున్నారు. 2019 నుంచి ఒకటే సీన్. ఆధిపత్యపోరు కథలో ఇంచు కూడా మార్పు లేదు.
చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్ ఎలీజా. మూడేళ్లుగా ఆయనకు నియోజకవర్గ నాయకులను సమన్వయం చేసుకోవడమే పెద్ద పనిగా మారింది. పార్టీ అధినేత ఆశీర్వాదంతో టికెట్ అయితే దక్కించుకున్నారు కానీ.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కథ రివర్స్. చింతలపూడి వైసీపీలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వర్గం ఉంది. ఆ వర్గానికి ఎమ్మెల్యే ఎలీజా అనుచరులకు ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉంటుంది వ్యవహారాం. పరస్పరం పైచెయ్యి సాధించేందుకు చేస్తున్న పనులు ఇక్కడి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది.
ఎంపీ, ఎమ్మెల్యే కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పైకి కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో అలాంటి వాతావరణ లేదట. ఆ విషయంలో ఇటీవల జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన చింతలపూడి రివ్వ్యూ మీటింగ్‌లో బయటపడింది. వైసీపీ గోదావరి జిల్లాల సమన్వయకర్త, ఎంపీ మిధున్‌రెడ్డితోపాటు మరో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని సమక్షంలో జరిగిన సమావేశంలో చింతలపూడి వైసీపీ వర్గపోరు ఘర్షణకు దారితీసింది. లోపల సమావేశం జరుగుతుంటే బయట రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. కళ్ల ముందు జరిగిన సీన్ చూసి పార్టీ సమన్వయకర్తలు షాక్ అయ్యారట.
సమావేశంలో ఉన్న కొందరు నేతలు సమన్వయకర్తలను గట్టిగానే నిలదీశారట. ఎవరితో ఇబ్బంది పడుతున్నామో వారినే ఎదురుగా కూర్చోబెట్టి సమస్యలు చెప్పమంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారట పార్టీ శ్రేణులు. దీంతో తమతో వ్యక్తిగతంగా సమావేశమై సమస్యలు చెప్పాలని బుజ్జగించారట కోఆర్డినేటర్లు. కానీ.. ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో చింతలపూడి వైసీపీలో ఉన్న వాస్తవ పరిస్థితులు తీవ్రంగానే ఉన్నట్టు గుర్తించారట ఇంఛార్జులు. మూడేళ్లుగా కొలిక్కిరాని సమస్యలు ఇప్పుడు గాడిలో పెట్టాలంటే ఏం చేయాలి? సమస్య మూలాలు ఏంటి? అనే దానిపై సమన్వయకర్తలు కొంత కసరత్తు చేసినట్టు చెబుతున్నారు.
సమస్యను నేరుగా తెలుసుకున్న ఇంఛార్జులు.. ఏం చేస్తారు? పార్టీ పెద్దలకు నివేదిక ఇస్తారా? అందులో పరిష్కారాలు సూచిస్తారా? అధిష్ఠానం వైఖరి ఏంటి? అని పార్టీ నేతలు ఆరా తీస్తున్నారట. చింతలపూడిలో పార్టీ నేతలను గాడిలో పెట్టాలంటే ఎవరో ఒకర్ని బుజ్జగించాలని.. కొందరిని పక్కన పెట్టాలని సూచిస్తున్నారట పార్టీ నేతలు. మరి.. వైసీపీ పెద్దలు చింతలపూడికి ఎలాంటి చికిత్స చేస్తారో చూడాలి.