అక్కడ పదవులు ఊరకనే రావ్.. ! ఎన్నో ఫైటింగ్‌లు చేయాలి.. లాబీయింగ్ నడపాలి…! ఆ జిల్లాలో ఇలాంటి తతంగాలు చాలానే ఉంటాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీల్లోనూ అదే సీన్. ఒక పదవి కోసం ముగ్గురు రేస్‌లోకి వచ్చారు. ఆ ముగ్గురిలో ఇద్దరు స్వయాన అన్నదమ్ములు. ఒకరి వ్యూహం ఇంకొకరికి లీక్ కాకుండా పావులు కదపడమే ఆసక్తి కలిగిస్తోంది.
ఉరవకొండ నుంచే ముగ్గురు ఉడుంపట్టు..!
అనంతపురం జిల్లా రాజకీయాలు రాష్ట్రంలోనే భిన్నం. ఒక్కోసారి పదవుల కోసం ఎలాంటి పోటీ ఉండదు. మరోసారి పోటీ ఓ రేంజ్లో ఉంటుంది. ఎవరిని ఎంపిక చేయాలో తెలియక అధినేతలు సైతం తల పట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కూడా అలాంటి సిచ్యువేషన్నే తీసుకొచ్చింది. ఒక్కటే సీటు కావడంతో జిల్లా అంతా వైసీపీ నుంచి పోటీ ఉంటుందని భావించారు. కానీ.. ఉరవకొండ నుంచే ముగ్గురు ఉడుంపట్టు పట్టడంతో ఉత్కంఠ రేపుతోంది.
గత ఎన్నికల్లో ఓడిన విశ్వేశ్వరరెడ్డి..!
ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ముగ్గురూ తీవ్రస్థాయిలో ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. విశ్వేశ్వరరెడ్డి, శివరామిరెడ్డిల మధ్య పొరపొచ్చలున్నాయి. 2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచింది ఇద్దరే. అందులో కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా టీడీపీలోకి జంప్ చేయగా.. విశ్వేశ్వరరెడ్డి వైసీపీలోనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో విశ్వకే వైసీపీ టికెట్ ఇచ్చినా.. ఆయన ఓడిపోయారు. దీంతో ఆయనను ఎమ్మెల్సీని చేస్తారని ప్రచారం జరిగింది. అయితే చాలాకాలంగా వైసీపీలో ఉంటున్న మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సైతం పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. వీళ్లిద్దరిదీ ఒక పంచాయితీ అయితే.. విశ్వేశ్వరరెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డి సైతం టికెట్ ఆశిస్తుండటం ఆసక్తిగా మారింది.
శివరామిరెడ్డి కుటుంబంలో ముగ్గురు ఎమ్మెల్యేలు..!
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. గతంలో ఇదే కోటా ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన అభ్యర్థులు కోట్లు ఖర్చు పెట్టారు. కానీ.. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదన్నది వైసీపీ నేతల మాట. వైసీపీ పెద్దల ఆశీసులతో టికెట్ సంపాదిస్తే ఎమ్మెల్సీ కావడం ఖాయం. అందుకు ముగ్గురు నేతలు పోటాపోటీగా లాబీయింగ్ చేస్తున్నారట. శివరామిరెడ్డికి సంబంధించి ఆయన సోదరులు మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు ఎమ్మెల్యేలుగా వైసీపీ నుంచి గెలిచారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆ ఈక్వేషన్లు శివరామిరెడ్డి ఆశలకు గండి కొడతాయా లేక.. పార్టీ పిలిచి టికెట్ ఇస్తుందా అన్నది తేలాలి.
అధిష్ఠానం వడపోతలు కొలిక్కి వచ్చాయా?
ఈ ముగ్గురే కాకుండా జిల్లాలో మరికొందరు వైసీపీ నేతలు సైతం ఎమ్మెల్సీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. రేస్‌లో మాత్రం విశ్వేశ్వరరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శివరామిరెడ్డి గురించే చర్చ జరుగుతోంది. వైసీపీ అధిష్ఠానం ఇప్పటికే వడపోతలు పూర్తి చేసిందని సమాచారం. పదవీయోగం కలిగిన ఆ నాయకుడు ఎవరో.. ఎలాంటి సమీకరణాలు తెరపైకి వస్తాయో చూడాలి.