Telangana congress Party going to remove Jaggareddy and Azharuddin from the post of PCC working president..?
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇద్దరు కీలక నాయకుల పదవులకు కత్తెర వేస్తున్నారా? పని చేయకపోతే వేటు తప్పదనే సంకేతాలు ఇవ్వాలని పార్టీ డిసైడ్ అయ్యిందా? వారిని ఎందుకు పక్కన పెట్టాలని చూస్తున్నారు? ఇంతకీ ఎవరా నాయకులు?
ఎవరు పనిచేస్తున్నారు? ఎవరు పనిచేయడం లేదు? పదవులు అలంకార ప్రాయంగా ఎవరు చూస్తున్నారు? కాంగ్రెస్‌లో వాడీవేడీ చర్చగా మారిన ప్రశ్నలివి. అందుకే కొందరు పదవులకు కత్తెర పెట్టే పనిలో పడ్డారట. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న అజారుద్దీన్, జగ్గారెడ్డిలను తప్పించే ఆలోచనలు చేస్తున్నారట. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొన్నా.. వాళ్లు అప్పగించిన పనులు చేయడం లేదనే అభిప్రాయం హైకమాండ్‌లో ఉందట. ఆ కారణంగానే అజారుద్దీన్, జగ్గారెడ్డిలను పక్కన పెట్టాలని చూస్తున్నారట.
ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చి.. మళ్లీ వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గుర్రుగా ఉన్నారట. దీనికితోడు జగ్గారెడ్డి కాంగ్రెస్ కార్యక్రమాలకు.. గాంధీభవన్‌కు కూడా దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో సదాశివపేట.. సంగారెడ్డిలో బోనాల ఉత్సవాలు జరిపిస్తూ వాటిల్లో మునిగి తేలుతున్నారు. గతంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేయడంతో ఆయన ఇంఛార్జ్‌గా ఉన్న భువనగిరి, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలను తప్పించారు. ఇప్పుడు కొత్తగా తప్పించడానికి ఏమీ లేదు. ఆయన చేతిలో ఉన్నది పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ తప్ప. ఇప్పుడు దానిని కూడా తీసేసే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టు AICC వర్గాల భోగట్టా.
పీసీసీలో మరో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న అజారుద్దీన్.. పార్టీ వ్యవహారాల కంటే.. క్రికెట్ రాజకీయాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ అప్పగించిన పని ఇప్పటి వరకు చేయలేదట. కేవలం సమావేశాలకు రావడం.. వెళ్తే మళ్లీ కనిపించకపోవడం అజారుద్దీన్ విషయంలో రొటీన్ అయ్యింది. కాంగ్రెస్ కోసం పనిచేయకపోగా.. జహీరాబాద్ పార్లమెంట్‌లో పంచాయితీలకు ఆయనే కారణమనే ఫీలింగ్ పార్టీ వర్గాల్లో ఉందట. గీతారెడ్డి, షబ్బీర్‌అలీ నియోజకవర్గాల్లో గడిచిన కొంతకాలంగా జరుగుతున్న గొడవలకు అజారుద్దీన్ జోక్యమే కారణంగా పీసీసీ భావిస్తోందట. అజారుద్దీన్‌కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్.. ప్రియాంకాగాంధీ కోటాలో వచ్చిందట. ఇప్పుడు ఆయన్ని తప్పించడం అంటే పెద్ద తలనొప్పిగా కొందరు అభిప్రాయ పడుతున్నారట. కాకపోతే అదే సామాజికవర్గానికి చెందిన మరో సీనియర్ నాయకుడిని ఆ పదవిలోకి తీసుకొస్తే సమస్య ఉండదని లెక్కలేస్తున్నారట.
పీసీసీ నుంచి జగ్గారెడ్డి, అజారుద్దీన్‌లను తప్పించి.. మరో ఇద్దరికి అవకాశం ఇవ్వాలనే చర్చ గట్టిగానే కాంగ్రెస్‌లో ఉంది. జగ్గారెడ్డి పదవికి కోత పెడితే.. తెలంగాణ కాంగ్రెస్‌లో కోరి సమస్యలు తెచ్చుకున్నట్టే అనేది కొందరి అభిప్రాయం. జగ్గారెడ్డికి ఇప్పుడు పార్టీ పరంగా ఎలాంటి అదనపు బాధ్యతలు లేవు. కొత్తగా ఇద్దరిని తెచ్చుకునేందుకు.. ఉన్న ఇద్దరిని తొలగించడం ఎందుకు అనే చర్చ ఉంది. కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లు ఇదే సూచిస్తున్నారట. అయితే పదవుల్లో ఉండి పార్టీ కోసం పనిచేయకపోతే ఎలా అనే వాదనను తెరపైకి తెస్తోంది రేవంత్ టీమ్. మరి.. కీలక నేతల విషయంలో కాంగ్రెస్ ఏం చేస్తుందో చూడాలి.