Telangana BJP Politics : తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామం. పార్టీ నేతల ఇంటికి వెళ్తున్నారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కొద్ది రోజులుగా ఆయన షెడ్యూల్ ఇదే. ముఖ్య నేతల ఇంటికి వెళ్లడం.. వీలైతే బ్రేక్‌ఫాస్ట్.. కుదిరితే భోజనాలు చేస్తున్నారు. సంజయ్ ఎందుకిలా చేస్తున్నారు? ఈ సమావేశాల వెనక రహస్యం ఏంటి?
తెలంగాణపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టిన బీజేపీ.. రాజకీయ ఎత్తుగడలతోపాటు.. సొంత ఇంటిలోని గొడవలను చక్కదిద్దుకునే పనిలో పడింది. దీనికి పార్టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నుంచే శ్రీకారం చుట్టడం చర్చగా మారింది. తెలంగాణ బీజేపీలో ప్రధాన ఆరోపణ.. నేతల మధ్య సమన్వయం లేదని. ఎవరికి వారు యమునా తీరే అనేట్టు వ్యవహరిస్తున్నారు నాయకులు. ముఖ్య నాయకుల మధ్యే గ్యాప్ ఉందని ఢిల్లీ నాయకత్వం గుర్తించిందట. సంజయ్‌కు వ్యతిరేకంగా కొందరు జట్టు కట్టారట. సారథిని ముందుకెళ్లకుండా ముందరి కాళ్లకు బంధాలు వేస్తున్నట్టు టాక్. అందుకే ఈ సమస్యలను పరిష్కరించే పనిలో పడింది బీజేపీ నాయకత్వం.
రాష్ట్రంలో పార్టీ ఎదుగుదల ఎలా ఉన్నా.. చేరికలు.. ఉపఎన్నికలు ఊపు తెచ్చినా.. బీజేపీ అధ్యక్షుడు సంజయ్ అందరినీ కలుపుకొని వెళ్లడం లేదని.. ఒంటెద్దు పోకడలకు పోతున్నారని కాషాయ శిబిరంలో వినిపిస్తున్న మాట. కోర్ కమిటీలో ఉన్న నాయకుల మధ్యే సమన్వయం లేదట. నేతలెవరూ మనసు విప్పి మాట్లాడుకోలేని పరిస్థితి ఉందట. ఈ గొడవలు శ్రుతిమించడం.. పరిష్కరించడానికి చొరవ తీసుకోకపోవడం వల్లే సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి శ్రీనివాస్‌ను పంజాబ్ పంపేశారని కొందరి వాదన. విభేదాలకు ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాల్సిందేనని భావించిన నాయకత్వం.. బండి సంజయ్‌నే ఫీల్డ్‌లోకి దింపినట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ జాతీయ నాయకత్వం.. నాయకులంతా కలిసి సాగాలని స్పష్టంగా చెప్పేసింది. అమిత్ షా అయితే గట్టిగానే తలంటినట్టు సమాచారం. ఆ తర్వాతే బండి సంజయ్.. ముఖ్య నేతల ఇంటికి వెళ్తున్నారట. ఎవరైతే తనను విభేదిస్తున్నారో.. తనకు వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం జరుగుతుందో.. అభిప్రాయ భేదాలతో దూరంగా ఉంటున్నారో.. అలాంటి ముఖ్య నేతల జాబితాను సిద్ధం చేసుకుని ఒక్కొక్కరి ఇంటికి వెళ్తున్నారట సంజయ్. ఉదయమే వెళ్తే.. ఆ నేత ఇంటి దగ్గరే బ్రేక్‌ఫాస్ట్ చేసి.. మంచి చెడ్డలు మాట్లాడుకుంటున్నారట. అంతా కలిసి ఉందామని చెబుతున్నారట.
సంజయ్‌తో విభేదిస్తున్న నేతల జాబితాలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా ఉన్నారని అప్పట్లో గుప్పుమంది. అందుకే ఈటల ఇంటికి కూడా సంజయ్ వెళ్లి భోజనం చేసి వచ్చారట. ఇద్దరూ కలిసి చాలా అంశాలపై మాట్లాడుకున్నారట. ఇంతకాలం సంజయ్ ఎవరి ఇంటికి వెళ్లినా జరగనంత చర్చ.. ఈటల ఇంటికి సంజయ్ వెళ్లాక జరుగుతోందట. అప్పట్లో ఈటల నేతృత్వంలో చేరికల కమిటీని వేయడం సంజయ్‌కు నచ్చలేదని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసిందట. ఇదే సమయంలో ఈటల ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాతే రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు ఢిల్లీ నేతలకు స్పష్టత వచ్చిందట. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోనూ సంజయ్ సమావేశం అయినట్టు సమాచారం.
మొత్తానికి సంజయ్ స్వయంగా చేస్తున్న రాయబారాలకు పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నేతల సలహాలు.. సూచనలు తీసుకోవడానికి సంజయ్ వెళ్తున్నారని కొందరు చర్చకు పెడుతున్నా.. అదేదో పార్టీ ఆఫీసులో అంతా కూర్చొని మాట్లాడుకుంటే పోతుంది కదా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరి.. అసలు లోగుట్టును కమలనాథులు బయటపెడతారో లేదో చూడాలి.