మాజీ మంత్రి, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏవో సంచలన పరిణామాలు వచ్చినట్టు, కొత్తమలుపులు తిరుగుతున్నట్టు కథనాలు మార్మోగుతున్నాయి. ఆయన వాచ్‌మ్యాన్ రంగయ్య సిబిఐ దర్యాప్తు తర్వాత మేజిస్ట్రీట్‌ముందు ఇచ్చిన వాంగ్మూలంలో మూడుపేర్లు చెప్పడం ఇందుకు కారణమవుతున్నది. తర్వాత ఆయన మీడియాతోనూ మాట్లాడారు. ఆయన చెప్పిన పేర్లలో ప్రధానంగా వినిపిస్తున్న ఎర్రగంగిరెడ్డి తనకు హత్యతో సంబంధం లేదని అంటుండగా మరోపేరు సునీల్ రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు. శుక్రవారం నాడు ఈ హడావుడి మొదలవడానికి ముందు హత్యకేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ బృందం బాధ్యత డిఐజి సుధా సింగ్‌నుంచిఎస్‌పి రామ్‌కుమార్‌కు అప్పగించడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనాలు వచ్చాయి.సాయింత్రానికి రంగయ్య వాంగ్మూలం, తర్వాత ఆయనను పులివెందుల బస్టాండ్ దగ్గర వదిలేయడంతేం చెప్పానో గుర్తు లేదంటూనే పేర్లు చెప్పడం జరిగిపోయాయి. ఇంతకాలం అత్యంత గోప్యంగా రకరకాల రాజకీయ సందేహాలతో నడుస్తున్న ఈ కేసులో అనుమానితుల పేర్లు స్పందనలు ఒక్కసారిగా బహిర్గతమైనాయి. రంగయ్యకు రక్షణ లేదని సందేహాలు వచ్చాక పోలీసు భద్రత కూడా ఏర్పాటైంది. సిబిఐ విచారణ సరిగా సాగడం లేదని, అధికారిని ఎందుకు మార్చారని మొదట సందేహాలు వెలిబుచ్చిన వారే ఇప్పుడు రంగయ్య వాంగ్మూలం తర్వాతా వ్యాఖ్యలుచేస్తున్నారు.
వివేకా హత్యకు తొమ్మిది కోట్లసుపారి ఇచ్చారనేది ఒక అంశం. రంగయ్య చెప్పిన పేర్లు మరో అంశం. అయితే ఆ సుపారి ఎవరిచ్చారు,తెరవెనక ఎవరున్నారనేది మరింత ప్రధానమైన అంశం. వివేకా ప్రధాన సహాయకుడైన ఎర్ర్రగంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరి, పిఎ కృష్ణారెడ్డి వంటివారి పేర్లు మొదటి నుంచి వింటున్నవే. ఇది గాక 1200 మంది వరకూ విచారించినట్టు చెబుతున్నారు.సిబిఐ తీసుకోవడానికి ముందు చంద్రబాబు హయాంలోనూ జగన్ వచ్చాక రెండు వేర్వేరు పోలీసు సిట్‌లు ఈ కేసును దర్యాప్తు చేస్తూ వచ్చాయి. ఆ సమాచారం తమకు ఇవ్వాలని సిబిఐ కోర్టును కోరింది కూడా. హత్య జరిగిన మొదట్లో అయితే వివేకాకు సంబంధించి రకరకాల కథలు మీడియాలో ప్రచారం కావడం,వాటిపై డా.సునీత మనస్తాపం చెందడం కూడాచూశాం, ఏమైనా ఈ స్థాయి వ్యక్తుల దారుణహత్య అన్నప్పుడు దేన్నీ వదలిపెట్టడానికి అవకాశం వుండదు. ఈ దర్యాప్తుల క్రమంలో ఒకరిద్దరు చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. సుబ్బారాయుడు అనే వ్యక్తి డా.సునీతను విచారించాలని సిబిఐకి లేఖరాస్తే ఆయనను విచారించాలని అడగడంతోపాటు తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె కోరారు.
హతుడువివేకా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌సోదరుడు,ప్రస్తుత సిఎం బాబాయి అయినప్పటికీ ప్రభుత్వం నుంచి లేదా వైసీపీ నుంచి ఈ పరిణామాలపై ఎలాటి స్పందనలూ వ్యక్తం కాలేదు.తమను కాదని కోర్టులో కోరి సిబిఐకి అప్పగించారు గనక ఇక తమ బాధ్యతలేదన్న వైఖరి కనిపించింది. సిబిఐ తీసుకున్న తర్వాత కూడా డా.సునీత వివిధ రకాల ప్రయత్నాలు కొనసాగించారు,ఢల్లీిలోనే దర్యాప్తు సాగడం లేదని మీడియాకు చెప్పారు. కరోనా వ్యాప్తి కూడా దర్యాప్తు జాప్యానికి కారణమైంది. కారణాలేవైనా ఇటీవల సిబిఐ వేగం పెరిగి ఈదశకు చేరింది. ఇప్పుడు కూడా రంగయ్య విచారణపైనా,ఇతరపేర్లపైన మొదట్లో పెదవివిరిచిన వారు ఇదంతా మరెవరినోకాపాడేందుకు జరుగుతున్నప్రయత్నంఅన్నట్టు మాట్లాడారు.తర్వాత రంగయ్య భద్రత, ఆయనతో చెప్పించడంపై దృష్టి మారింది. కోర్టులో 164 కింద ఇచ్చిన వాంగ్మూలం కీలకమే అయినా సంచలనం అనే పదం ఎన్నిసార్లు వాడినా ఖచ్చితంగా రంగయ్య చెప్పిందే నడుస్తుందా అనేది కూడా అస్పష్టం.
సిబిఐ ఒక నిర్ధారణకు వచ్చి ఆయనతో చెప్పించిందని అన్నవారూ వున్నారు.సిబిఐ నుంచి గాని పోలీసుల నుంచి గాని ఇంతవరకూ అధికారికంగా ఎలాటి సమాచారం ఇప్పటికీ రాలేదన్నది గమనించాల్సిన విషయం. అలాగే ఈ కేసులోజాప్యంపై ఫిర్యాదుచేసిన వివేకా కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా కుమార్తె డాక్టర్ సునీత వంటివారు కూడా ఇంతవరకూ ఏమీ స్పందించలేదు.కనుక ఖచ్చితంగా చెప్పాలంటే ఈహత్య కేసు దర్యాప్తు గతం కన్నా మరింత క్లిష్టదశకు చేరుకుందని చెప్పాలి. సిబిఐ వ్యూహం ఎలా వుంటుంది కుటుంబం రాజకీయ పార్టీలు వివేకా అనుచరుల స్పందనలు ఎలా వుంటాయనేది తర్వాత చూడాలి. అంతిమంగా ఛార్జిషీటులో ఎవరి పేర్లు చేరుస్తారు కోర్టులో ఏమి జరుగుతుంది ఎంత కాలం పడుతుంది అనేది కూడా ఇప్పటికి తెలియదు.సిబిఐ ముందు ఒకసారి చెప్పినదానికే కట్టుబడివుంటారని కూడా లేదు. కనుక అప్పుడే కేసు ముగింపునకువచ్చేసినట్టు లేదంటే ఒక కొలిక్కివచ్చినట్టు చెప్పడం తొందరపాటే.