అధినేత ఆదేశించారు. అక్కడి నేతలు ఊ కొట్టారు. కలిసి అడుగులు వేస్తామని మాట ఇచ్చేశారు కూడా. కానీ.. వారి మధ్య నమ్మకం మిస్ అయ్యిందట. కుమ్ములాటలకు చెక్ పెట్టలేకపోతున్నారా? ఐక్యంగా పని చేసే పరిస్థితి లేదా? అధికార వైసీపీకి కొరుకుడుపడని ఆ నియోజకవర్గం ఏంటి?
టెక్కలిలో ఏదో ఒక మూల అనైక్యత
శ్రీకాకుళం జిల్లా టెక్కలి. గత ఎన్నికల్లో వైసీపీ ఎన్ని ప్రయోగాలు చేసినా.. ఇక్కడ టీడీపీనే గెలిచింది. ఈ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఎక్కువగా ఉన్నా… వారి మధ్య ఆధిపత్యపోరు పార్టీకి ప్రతికూలంగా మారింది. ఒకరంటే ఇంకొకరికి గిట్టదు. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో పరిస్థితి మారలేదు. నాయకులకు కీలక పదవులు కట్టబెట్టినా నిత్యం నియోజకవర్గంలో ఏదో ఒక మూల అనైక్యత బయట పడుతూనే ఉంది.
ముగ్గురికీ పార్టీ అధిష్ఠానం క్లాస్..?
వైసీపీ పెద్దల పిలుపుతో ఆ మధ్య టెక్కలి వైసీపీ నేతలు ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్, కాళింగ కార్పొరేషన్ ఛైర్మణ్ పేరాడ తిలక్, కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం పార్లమెంట్ వైసీపీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణిలు తాడేపల్లి వెళ్లారు. అందరినీ కూర్చోబెట్టి గట్టిగానే క్లాస్ తీసుకున్నారట. నియోజకవర్గంలో కీలక నాయకులు ఇలా ఎవరికివారుగా ఉంటే కుదరబోదని ముఖం మీదే చెప్పినట్టు తెలుస్తోంది. ఇకపై టెక్కలిలో ఎవరు ఏం చేయాలి.. ఎలాంటి డైరెక్షన్‌లో పనిచేయాలో పార్టీ పెద్దలు స్పష్టత ఇచ్చారట.
ఉగాది రోజున పేరాడ, కిల్లి ఇళ్లకు దువ్వాడ
పార్టీ పెద్దల దగ్గర తలూపిన టెక్కలి వైసీపీ నేతలు.. నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తారా అనే ప్రశ్న కేడర్‌లో అలాగే ఉండిపోయిందట. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఉగాది సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్వయంగా పేరడ, కిల్లి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. సతీసమేతంగా దువ్వాడ వెళ్లడంతో పార్టీలో చర్చగా మారింది. వైసీపీ పెద్దల చీవాట్లు పనిచేస్తున్నాయని అనుకుంటున్నారట. అయితే ప్రస్తుతానికి పైకి నవ్వుతూ కనిపిస్తున్న ఈ ముగ్గురు నాయకులు నిజంగా మారినట్టేనా అనే అనుమానాలు కేడర్‌లో ఉన్నాయట. ఒకరినొకరు నమ్మితే గొడవలు ఉండబోవని.. కానీ.. వాళ్ల మధ్య నమ్మకం మిస్ అయిందని చెబుతున్నారు.
ఒకే ఒరలో మూడు కత్తులు ఇమడగలవా?
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్టు.. టెక్కలి వైసీపీ వరలో మూడు కత్తులు కలిసి సాగుతాయా అనే లోకల్‌గా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో కాళింగ సామాజికవర్గం గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉంది. దువ్వాడ, పేరాడ, కిల్లి ఆ సామాజికవర్గమే. కానీ.. వారి మధ్య అనైక్యత కారణంగా వైసీపీకి టెక్కలిలో చేదు ఫలితాలు తప్పడం లేదు. నమ్మకం లేని చోట పైపై నవ్వులు.. పలకరింపులు ఎంతకాలం పనిచేస్తాయో చెప్పలేకపోతున్నారట. ప్రస్తుతం నియోజకవర్గంలో ముగ్గురికీ వేర్వేరుగా వర్గాలు ఉన్నాయి. నేతలు కలిసినట్టుగానే ఆ వర్గాలు కూడా కలిసి పనిచేయాలి. లేకపోతే క్షేత్రస్థాయిలో కుమ్ములాటలు తప్పకపోవచ్చు. మరి.. టెక్కలి వైసీపీ నేతలు ఏం చేస్తారో చూడాలి.