నలుగురు ఎమ్మెల్యేలు.. 14 మంది ఇంఛార్జులు. వీరిలో కొందరు కనిపించరు.. మరికొందరు టచ్‌మీ నాట్‌గా ఉంటారు. గాలి తగ్గి సైకిల్ పంక్చరయ్యే పరిస్థితులు ఉన్నా పట్టించుకోవడం లేదట. అందరూ గాలి కోసం ఎదురు చూస్తున్నారే తప్ప.. సైకిల్‌కి గాలికొట్టే ప్రయత్నాలే లేవట. ఆ జిల్లా ఏంటో.. అక్కడ నాయకులు ఎందుకలా ఉన్నారో ఈ స్టోరీలో చూద్దాం.
ఎమ్మెల్యేలు.. ఇంఛార్జులు టీడీపీని పట్టించుకోవడం లేదట..!
తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ జోరు తగ్గిందా? వరస ఓటములు తమ్ముళ్లను నిరుత్సాహ పరిచాయా? స్థానిక సంస్థల్లో పోరాడి పట్టు సాధిస్తున్నా.. కోనసీమలో డీలా పడిందా? మూడోస్థానానికి పడిపోయిన పార్టీని పైకి లేపే ప్రయత్నాలే లేవా? ప్రస్తుతం సైకిల్ స్థితిపై కేడర్ వేస్తున్న ప్రశ్నలివే. జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలుంటే.. గత ఎన్నికల్లో టీడీపీ నాలుగు గెల్చుకుంది. పెద్దాపురం, మండపేట, రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ సైకిల్ ఖాతాలో పడ్డాయి. ఈ నాలుగు నియోజకవర్గాల్లో మొక్కుబడిగానే టీడీపీ కార్యక్రమాలు చేపడుతున్నారు. పి గన్నవరంలో పార్టీ ఇంఛార్జ్ లేరు. ఇంచార్జులు ఉన్న 14 చోట్ల పార్టీని పట్టించుకునే పరిస్థితి లేదు.
వైసీపీ, జనసేనల్లోకి సర్దుకుంటోన్న టీడీపీ కేడర్..!
చంద్రబాబు, లోకేష్‌లు జిల్లాకు వస్తే మాత్రం నాయకులంతా కనిపిస్తారు. తర్వాత తుపాకీ దెబ్బకు కూడా కనిపించరని కేడర్ వాదన. ఇంఛార్జ్ లేని పి గన్నవరం టీడీపీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తానే నాయకుడి అని ఘర్షణ పడుతున్నారు. అధిష్ఠానం పిలుపుతో చేపట్టే కార్యక్రమాల్లోనూ రోడ్డుపైనే తమ్ముళ్లు తన్నుకు చస్తున్నారు. ప్రత్తిపాడు ఇంఛార్జ్ వరుపుల రాజా.. రామచంద్రపురం ఇంఛార్జ్ రెడ్డి సుబ్రమణ్యం, రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌లు తమ నియోజకవర్గాలకు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నట్టు తమ్ముళ్లు చెప్పేమాట. కొత్తపేటలో ఉండే రెడ్డి సుబ్రమణ్యం రామచంద్రాపురంపై ఫోకస్ పెట్టడం లేదని విమర్శలు ఉన్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్ వైసీపీ, జనసేనల్లో సర్దుకుంటోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నిచోట్ల మూడో స్థానానికి టీడీపీ..?
వైసీపీ, జనసేనతో కుదురిన లోపాయికారీ ఒప్పందాల్లో భాగంగా.. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కొందరు టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసి చివరి క్షణంలో ఉపసంహరించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొన్నిచోట్ల జనసేన అభ్యర్థులకు ఓపెన్‌గానే టీడీపీ నేతలు సపోర్ట్ చేశారు. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ మూడోస్థానానికి పడిపోయిందని గగ్గోలు పెడుతున్నారు తమ్ముళ్లు. ఈ విషయంలో తెలిసినా.. ఎమ్మెల్యేలు.. ఇంఛార్జులు పార్టీని పట్టించుకోవడం లేదు. దీంతో రానున్న రోజుల్లో జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటని టీడీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.