మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారే వేళయ్యిందా? వచ్చే నెలలో ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా? వైసీపీలోకి వెళ్లేందుకు గ్రౌండ్‌వర్క్ సిద్ధమైందా? రాజకీయ సమీకరణాలపై గంటా జంపింగ్ ప్రభావం ఎంత? మాజీ మంత్రి అధికారపార్టీలోకి వెళ్లేందుకు దారితీసిన బలమైన కారణాలేంటి? లెట్స్ వాచ్..!
వచ్చే నెలలో కండువా మార్చేస్తారా?
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్లీ రాజకీయ చర్చల్లోకి వచ్చారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా.. రెండుసార్లు మంత్రిగా.. ఎంపీగా పనిచేసిన ఆయన.. 2004, 2019లో మినహా అధికార పార్టీలోనే కొనసాగారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఆయన.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీలోకి వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. మూడేళ్లుగా గంటా పార్టీ మార్పుపై ప్రచారం జరుగుతున్నా.. ఈ దఫా మాత్రం గట్టిగానే అనేసుకున్నారట. వచ్చే నెలలో మాజీ మంత్రి కండువా మార్చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
టీడీపీ ఎమ్మెల్యే అయినా పార్టీతో సంబంధాలు అంతంత మాత్రమే
టీడీపీలో పొలిటికల్ కెరీర్ ప్రారంభించినా గంటాకు ఎక్కువ గుర్తింపు వచ్చింది ప్రజారాజ్యంతోనే. గత ఎన్నికల్లో వైసీపీ హవాను తట్టుకుని గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల్లో గంటా ఒకరు. ప్రతీ ఎన్నికల్లోనూ నియోజకవర్గం మార్చేస్తారు. 2019లో వైజాగ్ నార్త్ నుంచి బరిలోకి దిగగా వైసీపీ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. తక్కువ మెజార్టీతో గెలిచి బయటపడ్డారు. పేరుకి ప్రతిపక్ష ఎమ్మెల్యేనే అయినా టీడీపీతో ఆయనకు సంబంధాలు అంతంత మాత్రమే. టీడీపీతో ఈ గ్యాప్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే మొదలైంది. మంత్రిగా పని చేస్తున్న సమయంలో పార్టీ, ప్రభుత్వంపై యువ నేత పెత్తనాన్ని విభేదించారు గంటా. వైసిపి అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యక్రమాలకు, నియోజకవర్గ వ్యవహారాలకు గంటా దూరం జరిగారు.
మూడున్నరేళ్లుగా అనేక ఊహాగానాలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమానికి మద్దతుగా ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేయడం టీడీపీలో అంతర్గతంగా పెద్ద చర్చకే దారితీసింది. గంటాపై చర్యలు తీసుకోవాలని కొందరు పట్టుబట్టినట్టు చెబుతారు. ఈ పరిణామాలతో మాజీమంత్రి రాజకీయ భవిష్యత్ పై అనేక ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. పార్టీ మారడం ఖాయమనే అంచనాలు ఉన్నా.. గంటా ఎప్పుడు బయటపడలేదు. ఎన్నికల సీజన్ దగ్గర పడటంతో ముఖ్య నాయకులు రాజకీయ స్తబ్దత వీడుతున్నారు. ఆ జాబితాలో గంటా కూడా చేరారు. రాజకీయ భవిష్యత్‌ను.. సన్నిహితుల విషయంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ మారడానికే ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఉత్తరాంధ్రపై వైసీపీ ఫోకస్ పెంచడం.. ఈ ప్రాంత వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డితో ఉన్న సంబంధాలు గంటాకు కలిసొచ్చినట్టు టాక్. అలాగే సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణతోనూ రెండు దఫాలు గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారట.
పార్టీ మార్పుపై జాప్యం చేయొద్దని చెప్పారా?
ఉత్తరాంధ్రలో ప్రతిపక్ష పార్టీలకు ఛాన్స్ ఇవ్వకూడదని చూస్తోన్న వైసీపీ.. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తోంది. జనసేన దూకుడు తగ్గించడానికి సోషల్ ఇంజనీరింగ్‌పై ఫోకస్ పెట్టింది. వాస్తవానికి వైసీపీలో గంటా చేరికపై కొన్ని నెలలుగా ప్రయత్నాలు జరుగుతున్నా.. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైందని చర్చ నడుస్తోంది. వైసీపీ అధినేత మనసులోని మాటను చెప్పి.. ఇక ఎక్కువ కాలం జాప్యం చేయొద్దని మాజీ మంత్రికి సూచించారట. సీఎం కుటుంబ ముఖ్యులు గంటాతో టచ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. అన్ని లెక్కలు కుదిరిన తర్వాత పార్టీ మారేందుకు గంటా సైతం ఊ కొట్టినట్టు తెలుస్తోంది. దీనిపై సన్నిహితులు.. రాజకీయ ముఖ్యులతో ఆయన చర్చలు జరుపుతున్నారట.
డిసెంబర్ రెండో వారంలో వైసీపీలోకి గంటా?
డిసెంబర్ ఒకటిన గంటా పుట్టినరోజు. షిర్డి ప్రయాణం కూడా పెట్టుకున్నారు. అంతా ఓకే అయిన తర్వాత డిసెంబర్ రెండో వారంలో ఆయన వైసీపీలో చేరతారని తెలుస్తోంది. తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ చేతులతో కండువా కప్పుకోవడం కాకుండా గంటా ఎంట్రీని గ్రాండ్‌గా ఉండేలా ప్లాన్ చెయ్యాలనే ఆలోచన పార్టీలో ఉందట. తద్వారా బలమైన ఒక సామాజికవర్గం పట్ల తమ దృక్ఫదం, గౌరవం మారాలేదనే సంకేతాలు పంపించే ప్రయత్నం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ 2 లేదా 3 వారంలో అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఉంటుందని.. మాకవరపాలెంలో మెడికల్ కాలేజ్‌తోపాటు నర్సీపట్నంలో వెయ్యి కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని సమాచారం. ఆ సమయంలో భారీ బహిరంగ సభ కోసం ప్లాన్ చేస్తున్నారట. గంటా చేరిక ఖరారైతే ఆ సభా వేదికను పరిశీలించే అవకాశాలు ఉన్నాయట. మొత్తంగా గంటా శ్రీనివాసరావుపై మూడేళ్లుగా పార్టీ మారే తేదీలు, వాటి చుట్టూ అనేక విశ్లేషణలు వినిపించాయి. ఆ జ్యోతిష్యాలేవీ వాస్తవం కాకాపోయిన ఉత్కంఠ మాత్రం కొనసాగింది. ఇప్పుడా సస్పెన్స్‌కు తెరదించే సమయం ఆసన్నమైంది.