నడిరోడ్డుపై పెట్రోల్ పోశారు.. నిప్పంటించారు. దాడి చేసిన వారిపై కేసు పెట్టారు.. అరెస్ట్ చేశారు. అక్కడితో కేసు కంచికి చేరినట్టేనా? కీలకమైన సంస్థను, ఆ సంస్థ ప్రతినిధులను కేసు నుంచి తప్పించారా? రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయా? ఓరుగల్లు పెట్రోల్ దాడిపై జరుగుతున్న రచ్చేంటి?
కేసులో చిట్‌ఫండ్ సంస్థను తప్పించారా?
వరంగల్‌లో నడిరోడ్డుపై.. పట్టపగలు జరిగిన ఈ పెట్రోల్ దాడి ఓ పెను సంచలనం. చిట్టీలో పాడుకున్న డబ్బులు అడిగినందుకు రాజు అనే వ్యక్తిపై ఈ విధంగా పెట్రోల్ పోసి నిప్పంటించారు అచలా చిట్‌ఫండ్ కంపెనీకి చెందిన ఏజెంట్ దంపతులు. దాడి చేసిన ఏజెంట్ గణేష్‌తోపాటు ఆయన భార్యపై కేసు పెట్టిన పోలీసులు.. చిట్‌ఫండ్ సంస్థను వదిలేశారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. చిట్‌ఫండ్ సంస్థను కేసు నుంచి తప్పించారా? పోలీసులపై ఒత్తిళ్లు వచ్చాయా? ఒత్తిడి చేసింది ఎవరు? అన్నది ప్రశ్నగా మారింది.
ప్రజాప్రతినిధులే చిట్‌ఫండ్ నిర్వాహకులా?
పోలీసులపై ప్రజాప్రతినిధుల ఒత్తిడి?
అచలా చిట్‌ఫండ్ సంస్థ వెనక అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ సంస్థ వారిదేనట. అందువల్లే ఈ కేసు నుంచి చిట్‌ఫండ్ సంస్థను తప్పించారని చెవులు కొరుక్కుంటున్నారు. కొందరు పోలీసులు సహకరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్నతప్పు చేస్తేనే అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టే పోలీసులు.. పెట్రోల్‌దాడి కేసులో నిందితులను అరెస్ట్ చేసి.. కేవలం ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. సొంతంగా ఓ వీడియో రికార్డ్ చేసి మీడియాకు అందజేశారు. దాడి చేసిన వారిపై ఏ సెక్షన్ల ప్రకారం కేసు పెట్టారో వెల్లడించలేదు. ఈ వైఖరిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్‌మీట్ పెట్టకుండా పోలీసులపై అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చారని ప్రచారం జరుగుతోంది.
డబ్బులు అడిగితే పెట్రోల్ పోసి నిప్పు పెడతారా?
బాధితుడు రాజు.. అచలా చిట్‌ఫండ్ సంస్థలో చిట్ వేశాడు. పాడుకున్నాడు. డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత ఆ సంస్థదే. ఏజెంట్లు ఇందుకు సహకరిస్తారు. కానీ.. 8 నెలలుగా రాజుకు చిట్టీ డబ్బులు ఇవ్వలేదట. దాని గురించి అడుగుతున్న పాపానికే పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ మొత్తం ఘటనలో చిట్‌ఫండ్ సంస్థ కీలకమనే చర్చ జరుగుతున్నా.. పోలీసులు ఎందుకు విస్మరించారన్నది మిస్టరీగా మారింది. వెనక ఎలాంటి ధైర్యం.. అండ లేకపోతే పెట్రోల్ పోసి నిప్పంటించే సాహసం ఏజెంట్లు చేయలేరన్నది కొందరి వాదన.
పోలీస్ కమిషనర్‌ను సిబ్బంది తప్పుదోవ పట్టించారా?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గడిచిన ఐదారేళ్లలో వందల సంఖ్యలో చిట్‌ఫండ్ సంస్థలు వచ్చాయి. ప్రజాప్రతినిధులు, పోలీసుల అండ చూసుకుని చిట్టీలు పాడుకున్నవారికి డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్న ఘటనలు అనేకం. వరంగల్ ఘటన వెనక కూడా అదే జరిగిందా అన్న అనుమానాలు ఉన్నాయట. కీలకమైన కేసులో సమగ్ర విచారణ చేయకుండా… పోలీస్ కమిషనర్‌ను కింది స్థాయి సిబ్బంది తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మరి.. రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి పోలీస్ కమిషనర్ ఈ కేసులో విస్తృత విచారణ చేస్తారో లేదో చూడాలి.