బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరిక సందర్భంగా నేతల మధ్య పొరపచ్చాలు వచ్చాయా? ఆయన చేరికను తమ ఖాతాలో వేసుకునేందుకు కొందరు ప్రయత్నించారా? ఆ ప్రచారానికి చెక్ పెట్టేలా.. హుజురాబాద్‌లో ఇంఛార్జ్‌ల నియామకం జరిగిందా? బీజేపీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఎవరు ఎవరికి చెక్ పెట్టారు?
ఈటల చేరిక సందర్భంగా జరిగిన పరిణామాలపై చర్చ!
తెలంగాణ బీజేపీలో బయటకు అంతా సవ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. అంతర్గతంగా ఆధిపత్య పోరు నడుస్తోందట. సీనియర్ల మధ్య పడటం లేదని చెవులు కొరుక్కుంటున్నారు. ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారట. దీనికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక అంశం మరింత ఆజ్యం పోసినట్టు టాక్. ఈటల కాషాయ కండువా కప్పుకోవడానికి ముందు తర్వాత జరిగిన పరిణామాలతో కొందరు నాయకుల మధ్య దూరం పెరిగిందట.
అర్థ, అంగబలం ఉన్నవారు యాక్టివ్‌గా ఉంటే తప్పేంటని కొందరు ప్రశ్న!
ఈటల తనవల్లే పార్టీలో చేరారు అనే క్రెడిట్ ఫైట్ కోసం నాయకులు పాకులాడటం బీజేపీలో కొందరికి నచ్చలేదని చెబుతున్నారు. బీజేపీలో ఇదేంటని ముఖాలు చిట్లించుకున్నారట. ప్రధానంగా ఓ నాయకుడు చాలా ఎక్కువ హడావిడి చేశారని.. అంత అవసరం లేదని పార్టీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అర్థ, అంగ బలం ఉన్నవారు యాక్టివ్‌గా పనిచేస్తే తప్పేంటని.. దానివల్ల బీజేపీకి లాభమే కానీ నష్టం జరగదు కదా అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారట.
read more : చైనా పాఠశాలలో అగ్నిప్రమాదం…18 మంది మృతి…
పార్టీ అంతర్గత చర్చల్లో మాటల తూటాలు!
మొత్తానికి ఈటల బీజేపీలో చేరిపోవడం.. ఆయన హుజురాబాద్ ఉపఎన్నికపై ఫోకస్‌పెట్టి క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటూ వెళ్తున్నా.. నాయకులు వ్యవహరించిన తీరుపై చర్చ మాత్రం ఆగడం లేదట. తెర వెనక జరిగిన పరిణామాలపై తెగ చెవులు కొరుక్కుంటున్నారు. కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. బయటకు ఎవరూ కామెంట్ చేయకపోయినా.. పార్టీ అంతర్గత చర్చల్లో మాత్రం హాట్‌హాట్‌గానే మాటలు పేలుతున్నాయట
మాజీ ఎంపీ వివేక్ చురుకైన పాత్ర కొందరికి నచ్చడం లేదా?
మాజీ మంత్రి చంద్రశేఖర్‌ను తెరపైకి తెచ్చారా?
తెలంగాణ బీజేపీలో గ్రూప్‌ల గోల ఇప్పటిది కాదు. పేరున్న నాయకులకు ఎప్పుడూ ప్రత్యేకంగా ఒక వర్గం ఉంటూ వస్తోందట. ఎవరు కీలక పదవుల్లో ఉంటే వారి వర్గాలకు.. అనుయాయులకు పదవులు దక్కుతుంటాయని చెబుతారు. ఈ ఆధిపత్య పోరు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లిందని టాక్. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా వాటికి భిన్నంగా ఏవీ లేవన్నది కొందరి వాదన. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అది కొందరికి నచ్చడం లేదట. ఆయనకు చెక్ పెట్టేందుకే హుజురాబాద్ ఉపఎన్నికలో వివేక్‌కు నచ్చని వారికి ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి చంద్రశేఖర్ పేరును ప్రస్తావిస్తున్నారు. వివేక్, చంద్రశేఖర్లకు పడదని.. అది దృష్టిలో పెట్టుకునే పార్టీలో కొందరు పావులు కదిపారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
హుజురాబాద్‌లో వివేక్ ఎలాంటి పాత్ర పోషిస్తారు?
బీజేపీ సర్కిళ్లలోని సోషల్ మీడియాలో ప్రస్తుతం వివేక్, చంద్రశేఖర్ అంశాలపైనే పోస్టులు ట్రోల్ అవుతున్నాయి. ఈ ఎత్తుగడ వెనక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారా లేక ఇంకెవరైనా మంత్రాంగం చేశారా అన్నది కొందరు ఆరా తీస్తున్నారట. ఈ పరిణామాల మధ్య హుజురాబాద్ ఉపఎన్నికలో మాజీ ఎంపీ వివేక్ ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే హుజురాబాద్‌లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి వైఖరి ఏంటో పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. ఇటు చూస్తే కొత్త ఎత్తుగడలు కేడర్‌ను ఠారెత్తిస్తున్నాయి. మరి.. ఈ చెక్‌మేట్‌లు ముదరు పాకాన పడతాయో.. లైక ఎక్కడివారు అక్కడే గప్‌చుప్‌గా ఉండిపోతారో చూడాలి.