తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం కొలిక్కి వస్తుందా? ఇగోలను పక్కనపెట్టి క్షేత్రస్థాయి అంశాలపై చర్చిస్తారా? తెలంగాణ ప్రస్తావించే అంశాలేంటి? ఏపీ వాదనలేంటి? ఇన్నాళ్లూ సమావేశాలకు దూరంగా ఉన్న తెలంగాణ.. KRMB, GRMB భేటీలకు హాజరు కావడం వెనక ఆంతర్యం ఏంటి?
కేఆర్‌ఎంబీ భేటీపై ఉత్కంఠ
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య జల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. నీటి పంచాయితీలు తెగడం లేదు. ఇటీవల కృష్ణా నది యాజమాన్య బోర్డుకు, గోదావరి నది యాజమాన్య బోర్డుకు ఇరు రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి. కేఆర్ఎంబీ పూర్తిగా ఆంద్రప్రదేశ్‌కు మద్దతుగా వ్యవహరిస్తోందని కేంద్ర జలవనరుల శాఖకు ఫిర్యాదు చేసింది తెలంగాణ. నీటి కేటాయింపులు లేకుండానే ఇష్టానుసారంగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా కృష్ణా బోర్డు పట్టించుకోవడం లేదన్నది ఏపీ ఆరోపణ. ఈ తరుణంలో జరుగుతున్న KRMB భేటీపై ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ కోరుతున్న ఫిఫ్టీ ఫిఫ్టీ నీటి కేటాయింపులకు ఏపీ నో..!
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కృష్ణానదీ జలాల పంపకాలపై స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఇటీవల శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తికోసం తెలంగాణ నీటిని విడుదల చేయడంతో వివాదం మొదలైంది. రాయలసీమ ఎత్తిపోతల పేరుతో ఏపీ సర్కార్ శ్రీశైలం డ్యామ్ ఖాళీ చేయాలని చూస్తోందని.. అందుకే తాము అడ్డం తిరిగామనేది తెలంగాణ వాదన. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో రాయలసీమ ఎత్తిపోతలకు వ్యతిరేకంగా తెలంగాణ పోరాటం చేస్తోంది. అదే సమయంలో కృష్ణానదిపై తెలంగాణ అక్రమంగా ప్రాజెక్ట్‌లు నిర్మిస్తోందని, దానివల్ల శ్రీశైలానికి వచ్చే నీటి మట్టం తగ్గిపోతుందని ఏపీ ఆరోపణ. తెలంగాణ కోరుతున్న ఫిఫ్టీ ఫిఫ్టీ నీటి కేటాయింపులకు అంగీకరించడం లేదు. కేఆర్ఎంబీ సమావేశంలో అదే చెప్పే వీలుంది.
తెలంగాణ ఇరిగేషన్ అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం!
ఇన్నాళ్లూ బోర్డు మీటింగ్‌కు దూరంగా ఉంటూ వచ్చిన తెలంగాణ KRMB తాజా మీటింగ్‌కు హాజరు కావాలని నిర్ణయించింది. తెలంగాణకు కృష్ణా జలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఇరిగేషన్ అధికారులకు దిశానిర్దేశం కూడా చేశారు. సాధికారిక సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని స్పష్టం చేశారు. ఏపీకి 70 శాతం.. తెలంగాణకు 30 శాతం నీటి వాటాకు ఒప్పుకొనేది లేదని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి.
తప్పుడు సంకేతాలు వెళ్లకుండా మీటింగ్‌కు హాజరవుతున్న తెలంగాణ?
ఒక్క సిట్టింగ్‌తో జల జగడం తేలే సమస్య కాదా?
కేఆర్ఎంబి, జిఆర్ఎంబీ సమావేశాలకు గైర్హాజరు కావడంవల్ల తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని తెలంగాణ భావించిందట. అందుకే రెండు బోర్డుల సమావేశానికి హాజరు అయ్యేందుకు సిద్ధమైంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ జల విద్యుత్ ఉత్పత్తితో మొదలైన ఈ జల జడగం.. KRMB సమావేశం తర్వాత ఎలాంటి మలుపు తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాలు ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉండటంతో పరిష్కారం అంత ఈజీ కాదు. పైగా ఒక్క సిట్టింగ్‌తో తేలే సమస్యా కాదు. ఇక్కడేదైనా నిర్ణయం తీసుకున్నా.. తిరిగి ఎవరో ఒకరు కేంద్రానికి లేదా కోర్టుకు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే KRMB మీటింగ్‌లో ఏం జరుగుతుందన్న ఆసక్తి అయితే రెండు రాష్ట్రాల్లోనూ ఉంది.