తాడిపత్రి రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. కూల్చివేతలు.. మాటల తూటాల వెనక పొలిటికల్ పన్నాగం ఇంకేదో ఉందనే చర్చ జరుగుతోంది. మద్దతుదారులను లక్ష్యంగా చేసుకున్నారనే అనుమానం ఒకరిది. రూల్ పాటించకపోతే ఎలా అని చట్టానికి పదును పెడుతున్నారు ఇంకొకరు. దీంతో ఆదిపత్యపోరులో ఎవరు పైచెయ్యి సాధిస్తారనే ఉత్కంఠ పెరుగుతోంది.
ఆక్రమణల కూల్చివేతలతో రాజకీయ వేడి!
ఏపీలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రిలో మాత్రమే టీడీపీ పాగా వేసింది. జేసీ బద్రర్స్ ఎత్తుగడలే దానికి కారణం. సింపుల్ మార్జిన్‌తో మున్సిపాలిటీని కైవశం చేసుకుని ఛైర్మన్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఇది రుచించలేదు. అసలే రెండు వర్గాల మధ్య ఉప్పు నిప్పులా ఉన్న రాజకీయం.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత మరో టర్న్ తీసుకుంది. చీమ చిటుక్కుమన్నా.. పెద్దారెడ్డి, జేసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఆక్రమణల పేరుతో తాడిపత్రిలో జరుగుతున్న కూల్చివేతలు ఈ కోవలోకే వస్తాయని విమర్శలు వేడి రాజుకుంది.
read also ; హుజురాబాద్‌లో వామపక్షాల దారెటు?
తాడిపత్రి మున్సిపాలిటీపై జేసీ పాగా వేసినప్పటి నుంచీ హీట్ పాలిటిక్స్!
మూడేళ్ల వరకు ఛైర్మన్ పదవికి ముప్పేమీ లేదన్న ప్రభాకర్‌రెడ్డి!
తాడిపత్రిలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. ఇందులో 18 టీడీపీ, 16 వైసీపీ గెల్చుకున్నాయి. ఒకచోట ఇండిపెండెంట్.. ఇంకోచోట సీపీఐ అభ్యర్థి గెలిచారు. మున్సిపాలిటీలో వైసీపీకి ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్‌అఫీషియో ఓట్లు ఉన్నాయి. రెండు పక్షాల బలం సమానం కావడంతో ఇండిపెండెంట్, సీపీఐ కౌన్సిలర్ల మద్దతు కూడగట్టడంలో జేసీ సక్సెస్ అయ్యారు. ఇలాంటి చోట వైరి పక్షాన్ని పడగొట్టాలనే వ్యూహాలు.. పీఠాన్ని కాపాడుకోవాలనే ఎత్తుగడలు ఉండనే ఉంటాయి. కాకపోతే ఇందుకోసం ఎంచుకునే మార్గాలే ఉద్రిక్తతలను పెంచుతున్నాయని చెబుతున్నారు. తాజాగా తాడిపత్రిలో ఆక్రమణల కూల్చివేతల వెనక కారణం అదే అన్నది టీడీపీ ఆరోపణ. అయినప్పటికీ మూడేళ్ల వరకు తన పదవికి వచ్చిన ముప్పేమీ లేదని ధీమాగా ఉన్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.
జేసీకి మద్దతిచ్చిన సీపీఐ కౌన్సిలర్‌కు నోటీసు!
ఇటీవల తాడిపత్రిలో ఆక్రమణలపై మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. వీటి వెనక ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఉన్నారన్నది టీడీపీ ఆరోపణ. ఆక్రమణల్లో టీడీపీతోపాటు వైసీపీ వాళ్లూ ఉన్నారట. వారిని టచ్ చేసినప్పుడు ఎలాంటి వివాదం రేగలేదు. కాకపోతే CPI కాలనీలో మున్సిపల్ స్థలాలు ఆక్రమించారని నోటీసులు వెళ్లడంతో సమస్య ఒక్కసారిగా భగ్గుమంది. నోటీసులు అందుకున్నవారిలో టీడీపీకి మద్దతిచ్చిన CPI కౌన్సిలర్ రంగయ్య కూడా ఉన్నారట. అంతే జేసీ శివాలెత్తారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కదం తొక్కడానికి మున్సిపల్ ఛైర్మన్ పీఠం లాక్కోవాలన్న కుట్రలే కారణమని అభిప్రాయపడుతున్నారు.
వైసీపీలో జేసీ కోవర్టులు ఉన్నారన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి!
ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెనకున్నారో లేదో కానీ.. టీడీపీ విమర్శలపై మాత్రం ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న CPI నాయకులు ఇంటి స్థలాలు అమ్ముకోవడం సరైందేనా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే. CPI కౌన్సిలర్‌ను వెనకేసుకొస్తోన్న మున్సిపల్ ఛైర్మనే.. ఒక కుటుంబానికి ఎన్ని పట్టాలు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌంటర్లు ఇక్కిడితో ఆగితే ఇది పొలిటికల్ వార్‌గానే ఉండిపోయేది. కానీ.. వైసీపీలోనూ కొందరు జేసీ మనుషులు ఉన్నారని.. వారు కోవర్టులుగా పనిచేస్తున్నారని పెద్దారెడ్డి చేసిన కామెంట్స్ ఇంకా కాకపుట్టిస్తున్నాయి. ఆ కోవర్టులను గుర్తించారో లేదో కానీ.. తాడిపత్రి రాజకీయాల్లో మాత్రం ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్ మాత్రం అలాగే ఉంది.