ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోయినా.. ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుందని ఇన్నాళ్లూ ఆశించారు. చివరకు ఆ ముచ్చట కూడా అయిపోయింది. రాష్ట్రస్థాయి పదవి కాదు కదా.. కనీసం జిల్లా స్థాయి పోస్టుల్లోనూ వారికి చోటు దక్కలేదు. ఏదో ఆశిస్తే.. ఇంకేదో అయిందని వాపోతున్నారట సీనియర్లు. మెడలో కండువా ఉన్నా.. చేతిలో పదవి లేక తెగ మథన పడుతున్నారట. ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం.
పార్టీ పెద్దల దృష్టిలో ఉన్నారా .. లేరా?
వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు ప్రకాశం జిల్లాలో అనేక మంది ఉన్నారు. కొందరికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే.. ఇంకొందరు నియోజకవర్గ ఇంఛార్జ్‌లుగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టడంతో తమకూ మంచి రోజులు వచ్చాయని లెక్కలు వేసుకున్నారు నాయకులు. ఏదో ఒక నామినేటెడ్ పదవి రాకపోతుందా అని రెండేళ్లుగా ఎదురు చూసిన వారికి నిరాశ తప్పలేదు. అసలు తమను సీనియర్లుగా పార్టీలో గుర్తిస్తున్నారా? పార్టీ పెద్దల దృష్టిలో ఉన్నామా? లేదా అన్న అనుమానంలో ఉన్నారట.
read also : “నారప్ప” ఫేమ్ కార్తీక్ రత్నం ఇంటర్వ్యూ
అప్పటి నుంచీ వెనక బెంచీకే పరిమితమా?
ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో జిల్లా వైసీపీలో సీనియర్లుగా భావించే కొందరు నాయకుల పేర్లు లేవు. గతంలో నియోజకవర్గాలకు పార్టీ ఇంఛార్జులుగా ఉన్నా.. పెద్దలు చెప్పారని 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు. బరిలో ఉన్నవారి విజయానికి కృషి చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే మంచి గుర్తింపు ఇస్తామని హామీ ఇవ్వడంతో వారంతా నాడు వెనక్కి తగ్గారు. అప్పటి నుంచి వెనక బెంచీకే పరిమితమై ఆవేదన చెందుతున్నారట.
బ్రహ్మానందరెడ్డికి తప్పని నిరాశ!
మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని కాదని.. కందురు నాగార్జునరెడ్డికి టికెట్ ఇచ్చారు. అప్పట్లో అధిష్ఠానం ఇచ్చిన హామీతో వెంకటరెడ్డి సైలెంట అయ్యారు. 2014లో బాపట్ల నుంచి పోటీ చేసి ఓడిన వరికూటి అమృతపాణి, పర్చూరులో పోటీ చేసిన ఓడిన గొట్టిపాటి భరత్‌తోపాటు.. కందుకూరు ఇంఛార్జ్‌గా పనిచేసిన తూమాటి మాధవరావు, కొండపి ఇంఛార్జ్‌గా ఉన్న అశోక్‌బాబుల పేర్లు ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టలు జాబితాలో లేవు. ఓదార్పు యాత్రలో జగన్‌తో కలిసి నడిచిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డికి సైతం నిరాశ తప్పలేదు. వాస్తవానికి బ్రహ్మానందరెడ్డికి తప్పకుండా నామినేటెడ్ పదవి వస్తుందని జిల్లాలోని పార్టీ వర్గాలు భావించాయి. కానీ.. ఎవరినీ పరిగణనలోకి తీసుకోకపోవడం కేడర్‌ను ఆశ్చర్య పరిచింది.
పార్టీ పవర్‌లో ఉన్నప్పుడు పదవులు దక్కకపోతే ఎలా అని కలవరం!
ప్రస్తుతం ఇంఛార్జులుగా పనిచేస్తున్నవారికే పదవులు కట్టబెట్టడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారట. పైకి చెప్పకపోయినా లోలోపల చాలా మథన పడుతున్నట్టు పార్టీ వర్గాల టాక్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు దక్కకపోతే రాజకీయ భవిష్యత్ ఏంటా అని కలవర పడుతున్నారట సీనియర్లు. జిల్లాలో మొత్తం ఈ ఐదు నియోజకవర్గాల గురించే పార్టీ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. మరి.. ఈ అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులు.. తమకు జరిగిన అన్యాయంపై ఓపెన్ అవుతారో.. పొలిటికల్ ఫ్యూచర్‌కు అనుగుణంగా అడుగులు వేస్తారో చూడాలి.