నామినేటెడ్ పదవులు ఆ జిల్లాలో అధికారపార్టీ ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెడుతున్నాయా? పోస్ట్‌లను అనుచరులకు కట్టబెట్టేందుకు చేస్తున్న లాబీయింగే గొడవ రాజేస్తోందా? ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య కాకరేపుతున్న రెండు పదవులు. వానిపైనే పార్టీవర్గాల్లో ఆసక్తికర చర్చ. ఆ గొడవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
రెండు పదవుల కోసం ముగ్గురు ఎమ్మెల్యేల కుస్తీ!
తెలంగాణలో నామినేటెడ్ పదవుల పంపకం ఉంటుందన్న చర్చ జరుగుతున్న తరుణంలో.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ రాజకీయాలు చర్చగా మారాయి. తమనే నమ్ముకుని ఉన్న అనుచరులకు పదవులు కట్టబెట్టే పనిలో పడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ వ్యవహారమే ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య తీవ్రపోటీ తీసుకొచ్చినట్టు సమాచారం. జిల్లాలో ఉన్న రెండు కీలక నామినేటెడ్ పదవులు కోసం ముగ్గురు ఎమ్మెల్యేలు కుస్తీ పడుతున్నారట. తమవారికే ఆ పదవులు ఇవ్వాలని అధిష్ఠానాన్ని ఒప్పించే పనిలో ఉన్నారట ఆ శాసన సభ్యులు.
కీలకంగా మారిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి
అనుచరుల కోసం బాజిరెడ్డి, షకీల్ లాబీయింగ్!
నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చాలా కీలకం. ఈ మార్కెట్ కమిటీ పదవికి టీఆర్‌ఎస్‌లో పోటీ ఉంది. రెండేళ్లుగా ఎవరినీ నియమించలేదు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, బోదన్ ఎమ్మెల్యే షకీల్ ఇద్దరూ.. ఈ పదవిని తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు పోటీ పడుతున్నట్టు సమాచారం. నవీపేట మండలానికి చెందిన పార్టీ నేతకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి ఇవ్వాలన్నది బోదన్ ఎమ్మెల్యే షకీల్ డిమాండ్. కాదూ.. డిచ్‌పల్లి మండలానికి చెందిన పార్టీ నేతను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారట ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్. గతంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తే మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేసినందున.. ఈ దఫా బోదన్ నియోజకవర్గానికి అవకాశం ఇవ్వాలన్నది షకీల్ డిమాండ్. ఒకవేళ తన నియోజకవర్గానికి మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి ఇవ్వలేకపోతే.. ఇంకేదైనా కీలక పదవి ఇవ్వాల్సిందేనని గోవర్దన్ పార్టీ పెద్దలకు చెప్పారట.
నుడా ఛైర్మన్ పోస్ట్ కోసం బాజిరెడ్డి, గణేష్ గుప్తా పోటీ..!
ఇక జిల్లాలో కీలకంగా ఉన్న మరో పదవి నిజామాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ కమిటీ -నుడా. ఈ సంస్థ ఛైర్మన్ పదవి కోసం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్‌గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం నుడా ఛైర్మన్‌గా ప్రభాకర్ ఉన్నారు. ఆయన పదవీకాలం దగ్గర పడిందని ప్రచారం జరుగుతుంది. నామినేటెడ్ పదవులను ప్రకటించే సమయంలో నుడాకు కూడా కొత్త ఛైర్మన్ వస్తారని అనుకుంటున్నారట. అందుకే ఈ పోస్ట్ కోసం గణేష్‌గుప్తా, గోవర్దన్‌లు పట్టుబడుతున్నట్టు సమాచారం. నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాలు భౌగోళికంగా వేరైనా.. ప్రాంతాలు కలగలిసే ఉంటాయి. అందుకు ఇద్దరు ఎమ్మెల్యేలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ప్రస్తుతం నుడా ఛైర్మన్‌గా ఉన్న ప్రభాకర్.. తన పదవిని కాపాడుకునేందుకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి ద్వారా పైరవీలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎవరి సత్తా ఏంటో తేల్చుకునే పనిలో ఎమ్మెల్యేలు!
మార్కెట్ కమిటీ ఛైర్మన్, నుడా పోస్టులను అనుచరులకు కట్టబెట్టే విషయంలో ఎవరి సత్తా ఏంటో తేల్చుకునే పనిలో పడ్డారట ముగ్గురు ఎమ్మెల్యేలు. అయితే నామినేటెడ్ పదవుల భర్తీలో ఎమ్మెల్యేల ప్రతిపాదలను పరిగణనలోకి తీసుకుంటారా లేక పార్టీ అధిష్ఠానమే పేర్లను ప్రకటిస్తుందా అన్నది క్వశ్చన్ మార్క్. ఇప్పటికే పదవుల కోసం అనుచరుల నుంచి ఎమ్మెల్యేలపై చాలా ఒత్తిళ్లు ఉన్నాయి. ఈ సమయంలో ఆశించిన పదవులు రాకపోతే.. వారిని బుజ్జగించడం ఎమ్మెల్యేలకు సవాలే. పైగా ఎమ్మెల్యేల శక్తికి పరీక్షగా మారిపోయాయి. మరి.. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలలో ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.