చినికి చినికి గాలివానగా మారడం అంటే ఏంటో నరసరావుపేట గొడవను చూస్తే తెలుస్తుంది. మున్సిపల్ కమిషనర్ తీరుకు ఓ వర్గం యుద్ధం ప్రకటించింది. సమస్యను ఎలా కొలిక్కి తేవాలో ఎమ్మెల్యేకు పాలుపోవడం లేదు. వివాదం ఎక్కడ రాజకీయంగా తనకు ప్రతికూలంగా మారుతుందోనని ఆందోళన చెందుతున్నారట.
ముస్లిం మహిళా వాలంటీర్‌పై కమిషనర్ ఆగ్రహం!
గుంటూరు జిల్లా నరసరావుపేట. పల్నాడుకు ముఖద్వారమైన ఈ ప్రాంతంలో మాటంటే పడేరకం కాదు ఇక్కడి ప్రజలు. అలాంటిది ఒక ముస్లిం మహిళా వాలంటీర్‌పై మున్సిపల్ కమిషనర్ రామచంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. సమస్య రకరకాల మలుపులు తిరుగుతోంది. వాలంటీర్ విధులకు వచ్చేది లేదని బాధిత మహిళ.. సోదరికి మద్దతుగా వాలంటీర్ పోస్టుకు రాజీనామా చేయడానికి ఆమె సోదరుడు సిద్ధం కావడంతో సమస్య మరింత తీవ్ర రూపు దాల్చింది. అయితే సమస్య తనకు ఇబ్బందిగా మారుతుందని అనుకున్నారో ఏమో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి బాధితులకు సర్దిచెప్పారు. దాంతో శాంతించిన ముస్లిం మహిళా ఓ వీడియో రిలీజ్ చేశారు. సమస్య సద్దుమణిగిందని అంతా భావించారు. కానీ.. ఊహించని విధంగా సమస్య తీవ్రత పెరిగి ఎమ్మెల్యేను టెన్షన్ పెడుతోందట.
బాధితురాలిపై ఒత్తిడి చేసి వీడియో రిలీజ్ చేశారా?
బాధితురాలు ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాత కమిషనర్ చేసిన కామెంట్స్ సమస్యను మళ్లీ రాజేశాయని చెబుతున్నారు. తనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని.. ఎమ్మెల్యే చెప్పినా.. ఇంకెవరు చెప్పినా తగ్గేదే లేదని కమిషనర్ అన్నారట. ఆ విషయం తెలిసి బాధితురాలు.. ఆమె సోదరుడు వాలంటీర్‌లుగా కొనసాగబోమని ప్రకటించారు. వీరి నిర్ణయానికి కుటుంబ సభ్యులు కూడా మద్దతిచ్చారట. బాధితురాలిపై ఒత్తిడి చేసి.. డ్యూటీకి వస్తున్నట్టు వీడియో రిలీజ్ చేయించారని ప్రచారం జరుగుతోంది. దీంతో వాలంటీర్‌కు మద్దతుగా ముస్లిం మహిళా సంఘాలు రోడ్డెక్కాయి. కమిషనర్‌పై కన్నెర్ర చేశాయి. సమస్యకు కారణమైన కమిషనర్‌తో వివరణ ఇప్పించకుండా బాధితురాలితో వీడియోలు రిలీజ్ చేయిండం ఏంటని మండిపడుతున్నాయి కూడా.
కమిషనర్‌కు క్లాస్ తీసుకున్న ఎమ్మెల్యే?
కమిషనర్‌ను బదిలీ చేయించాలని ఎమ్మెల్యే చూస్తున్నారా?
ముస్లిం సంఘాలు.. ఇటు కమిషనర్ వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. నియోజకవర్గంలో ఏ అధికారి ఎవరిని కామెంట్ చేసినా తనపైనే ప్రభావం చూపిస్తుందని కమిషనర్‌కు క్లాస్ తీసుకున్నారట ఎమ్మెల్యే. ఇంత వరకు బాగానే ఉన్న.. ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాత బయటకెళ్లి కమిషనర్ చేసిన కామెంట్స్ చుట్టూనే ఇప్పుడు గొడవ తిరుగుతోంది. దీంతో కమిషనర్‌ను బదిలీ చేయించాలని ఎమ్మెల్యే నిర్ణయించారట. ఈ సమస్యను వైరిపక్షాలు రాజకీయంగా ఉపయోగించుకోకుండా కమిషనర్‌ను బదిలీ చేయించడమే ఏకైక పరిష్కారమని నిర్ధారణకు వచ్చారట ఎమ్మెల్యే. మరి.. బాధితులను శాంతిప చేయడానికి.. వారికి అండగా నిలిచిన ముస్లిం మహిళా సంఘాలను సంతృప్తి పర్చడానికి ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.