అన్న ఎమ్మెల్యే.. పెత్తనం తమ్ముడిది. అక్కడ ఎవరికైనా సరే.. తమ్ముడి మాటే వేదం. దీంతో తమ్ముడి కుమ్ముడి గురించి కథలు కథలుగా చెప్పుకొంటున్నారు జనం. ఇదే ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్. వారెవరో ఈ స్టోరీలో చూద్దాం.
నందిగామలో ఎమ్మెల్యే తమ్ముడి తీరుపై చర్చ!
2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీ ఖాతాలో పడిన నియోజకవర్గాల్లో కృష్ణాజిల్లా నందిగామ ఒకటి. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఓడిన మొండితోక జగన్మోహనే 2019లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ విజయం పార్టీ కేడర్‌కు జోష్ తీసుకొచ్చినా.. తర్వాత తలెత్తిన పరిణామాలే వారికి మింగుడు పడటం లేదని చెబుతున్నారు. జగన్మోహన్ గెలుపులో ఆయన తమ్ముడు అరుణ్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల వరకే తన పాత్ర పరిమితం అయితే బాగోదని అనుకున్నారో.. లేక తమ్ముడిని కూడా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే భావించారో ఏమో తమ్ముడి తీరే ఇప్పుడు చర్చగా మారింది.
ఎమ్మెల్యే తమ్ముడు అరుణ్ ఎంత చెబితే అంతట!
నందిగామలో ఎమ్మెల్యే జగన్మోహన్ మాటకంటే ఆయన తమ్మడు అరుణ్‌కుమార్ ఆదేశాలకే వెయిట్ ఎక్కువట. ఎవరికి పోస్టింగ్‌లు వేయాలన్నా.. బదిలీ చేయాలన్నా అరుణ్ చెబితేనే జరుగుతుందని ఓపెన్ టాక్. చివరకు పార్టీలో ఎవరికి ఏ పదవి దక్కాలన్నా.. కమిటీలలో పోస్టులు వేయాలన్నా తమ్ముడే చెప్పాలట. అరుణ్‌కుమార్ ఆశీస్సులు ఉంటే ఏదైనా జరిగిపోతుందని కేడర్ చెవులు కొరుక్కుంటుంది. ఇటీవల జరిగి పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో తన్నకంటే తమ్ముడి చలవ ఉన్నవారికే పార్టీ టికెట్లు దక్కాయట.
ఎమ్మెల్యే తమ్ముడికే పెద్దపీట వేస్తున్న అధికారులు?
అరుణ్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో మాఫియాలు!
నందిగామలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఎమ్మెల్యే అన్నో తమ్ముడో అర్థం కావడం లేదట పార్టీ కేడర్‌కు. ప్రస్తుతం అభివృద్ధి పనులు, శంకుస్థాపనలకు వెళ్లితే అధికారులు కూడా అరుణ్‌కుమార్‌కే పెద్ద పీట వేస్తున్నారట. వైసీపీ సమావేశాల్లోనూ తమ్ముడికి ఎమ్మెల్యేను మించిన ప్రాధాన్యం ఇస్తున్నారట పార్టీ నేతలు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై కలెక్టర్, ఇతర అధికారులతో తమ్ముడే మాట్లాడతారట. నందిగామలో కాచుకుని ఉన్న ఇసుక, పీడీఎస్ బియ్యం రవాణా మాఫియా, గ్రావెల్ అక్రమ తవ్వకాల ముఠాలు ఎమ్మెల్యే తమ్ముడిని ప్రసన్నం చేసుకోవడానికి చూస్తున్నట్టు సమాచారం. కాంట్రాక్టులు పనులు దక్కించుకునేవారు సైతం అరుణ్ కుమార్ ఎప్పుడు కరుణిస్తారో అని ఎదురు చూస్తున్నారట.
తమ్ముడితో మాట్లాడకుండా ఎమ్మెల్యే ఏ పనీ చేయరట!
ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ సైతం తమ్ముడు అరుణ్ పెత్తానాన్ని ఎక్కడా అడ్డుకోవడం లేదట. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే అరుణ్‌తో మాట్లాడకుండా ఎమ్మెల్యే ఏ పనీ చేయరని చెబుతారు. దీంతో తమ్ముడి కుమ్ముడికి హడలిపోతున్నారు అధికారులు, పార్టీ కేడర్. మరి.. పార్టీ పెద్దల దృష్టికి నందిగామ వ్యవహారాలు వెళ్లాయో లేదో కానీ.. ఈ వాతావరణాన్ని ప్రత్యర్థులు ఛాన్స్ తీసుకునే అవకాశాలు లేకపోలేదని చెవులు కొరుక్కుంటున్నాయి అధికార పార్టీ శ్రేణులు.