ఇటీవల కాలంలో ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేకు అన్నీ తలనొప్పులే. కనీసం కంటి నిండా నిద్ర కూడా పడటం లేదట. లేఖలు పరేషాన్ చేస్తున్నాయట. ఇక నిరసనలు, ధర్నాలు సరేసరి. అవి ఎవరు చేశారో.. ఎవరు చేయిస్తున్నారో తెలుసుకోవచ్చు. కానీ.. సీఎమ్‌కు లేఖలు రాస్తుండటంతో ఉలిక్కి పడుతున్నారట ఎమ్మెల్యే. ఆయనెవరో.. ఆ సమస్యేంటో ఈ స్టోరీలో చూద్దాం..!
సమస్యలపై నేరుగా సీఎమ్‌కే నిరసనకారుల లేఖలు?
రాథోడ్ బాపురావ్. ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే. ఇంతకాలం నియోజకవర్గంలో హ్యాపీగా సాగిపోయినా.. ఇటీవల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చేపడతున్న నిరసనలు చర్చగా మారుతున్నాయి. ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే ధర్నాలు సహజం. చివరకు అధికారులకో.. ఎమ్మెల్యే దగ్గరకో వెళ్లి వినతి పత్రాలు ఇస్తుంటారు. బోథ్‌లో మాత్రం.. వీరెవరి వల్లా కాదని అనుకున్నారో లేక ఎమ్మెల్యేను ఇరుకున పెట్టాలని అనుకుంటున్నారో కానీ.. నేరుగా తమ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖలు రాస్తున్నారట. ఈ లేఖాస్త్రాల సంగతి తెలిసినప్పటి నుంచి ఎమ్మెల్యేకు గుబులు పట్టుకున్నట్టు టాక్.
ఎమ్మెల్యేపై దళిత సంఘాలు గుర్రు!
ఆ మధ్య తలమడుగులో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ఆ గొడవ ఏకంగా లాఠీఛార్జ్ వరకు వెళ్లింది. ఎమ్మెల్యేను అడ్డుకుంటే పోలీసులతో కొట్టిస్తారా అని ప్రశ్నిస్తూ.. ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి దళిత సంఘాలు. పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేశారు. జొన్నల కొనుగోళ్లు సరిగ్గా చేపట్టడం లేదని ఎమ్మెల్యేపై మండిపడుతూ రైతులు జలదీక్ష చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజులతండా వాసుల కష్టాలు ప్రముఖంగా నిలుస్తుండటంతో ఎమ్మెల్యేతోపాటు అధికార పార్టీ నేతలను ఇబ్బంది పెడుతోందట.
వరస నిరసనల వెనక ఉన్నది ఎవరు?
బేల మండలంలో ఓ భూ వివాదంలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పెద్ద రగడే జరిగింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా దీక్షకు దిగిన ఆదివాసీలకు నచ్చజెప్పడానికి ITDA పీవో, పోలీసుల తలప్రాణం తోకకు వచ్చినంత పనైందట. ఇక బోథ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఎమ్మెల్యే అనుచరులు, బంధువులపై ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ఒకదాని వెనక ఒకటిగా రాథోడ్ బాపురావ్ లక్ష్యంగా విమర్శలు, ఆరోపణలు వస్తుండటంతో ఎమ్మెల్యే శిబిరం ఆలోచనలో పడిందట. ఇదంతా ప్రజలు, నిరసనకారులే చేస్తున్నారా లేక వారి వెనక ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నట్టు సమాచారం.
ప్రయోజనం పొందాలని చూస్తున్నది ఎవరు?
బోథ్ టీఆర్ఎస్‌లో రాథోడ్ బాపురావ్ వ్యతిరేక వర్గంపై ఎమ్మెల్యే అనుచరులు ఓ కన్నేసినట్టు టాక్. ఇన్నాళ్లూ కామ్‌గా ఉన్నవారు.. ఇప్పుడెందుకు జూలు విదిలిస్తున్నారు? వారి లక్ష్యం ఏంటి? ఎమ్మెల్యేను ఇబ్బంది పెట్టడం ద్వారా ఎవరికి ప్రయోజనం చేకూర్చాలని చూస్తున్నారు అనే అంశాలపై జవాబులు వెతికే పనిలో పడింది రాథోడ్ బాపురావ్ వర్గం. మరి.. ఈ ఆకస్మిక కష్టాలు.. ఉక్కిరి బిక్కిరి అంశాల నుంచి ఎమ్మెల్యే ఎలా బయట పడతారో చూడాలి.