తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటున్నారట ఆ మాజీ పోలీస్ అధికారి. ప్రస్తుతం అధికారపార్టీలో ఉన్న ఆయన… ‘మద్దాలి నిన్నొదల’ అని వెంట పడుతున్నారు. ఎమ్మెల్యేకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారట. ఇద్దరూ ఒకేపార్టీలో.. ఒకే గొడుకు కింద ఉన్నా.. రాజకీయ ఎత్తుగడలు గుంటూరు మిర్చిలా ఘాటెక్కిస్తున్నాయట. వారెవరో? ఆ గొడవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
మద్దాలిని ముప్పుతిప్పలు పెడుతున్న ఏసురత్నం!
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి.. వైసీపీ కండువా కప్పుకొన్నారు. అయితే ఆ ఎన్నికల్లో మద్దాలిపై పోటీ చేసి ఓడిన వైసీపీ నేత చంద్రగిరి ఏసురత్నం మాత్రం ఇప్పటికీ ఆయన చిటపటలాడుతున్నారట. ఏసురత్నం మాజీ పోలీస్ అధికారి. ఆ అనుభవంతో ఎమ్మెల్యేలను ముప్పుతిప్పలు పెడుతున్నట్టు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.
మద్దాలిపై ఈసీకి ఫిర్యాదు.. కోర్టులో పిటిషన్!
ఎన్నికల కమిషన్‌కు మద్దాలి గిరి సమర్పించిన అఫిడవిట్‌లో అనేక దోషాలు ఉన్నాయని.. కోట్ల రూపాయల అప్పులు, ఆస్తులను వెల్లడించలేదన్నది ఏసురత్నం ఆరోపణ. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ EC ఫిర్యాదు చేశారాయన. కోర్టును కూడా ఆశ్రయించారు. కోవిడ్ కారణంగా ఈ పిటిషన్లపై విచారణ ఇన్నాళ్లూ నత్తనడకన సాగినా.. ఇప్పుడు స్పీడందుకుందట. మద్దాలిపై అనర్హత వేటు పడుతుందని గట్టిగా విశ్వసిస్తున్నారట ఏసురత్నం.
మద్దాలి అనర్హత తప్పదంటున్న ఏసురత్నం!
ఎమ్మెల్యే టీడీపీలోనే ఉండిపోతే.. వైరిపక్షం కావడంతో ఏసురత్నం ఉడుంపట్టు పట్టారని భావించినా అర్థం ఉంటుంది. కానీ.. మాద్దాలి గిరి టీడీపీని వీడి వైసీపీకి జైకొట్టారు. అధికారపార్టీలో ఇద్దరూ కలిసి పనిచేస్తారని అనుకున్నారు. ఏసురత్నం మాత్రం.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని తేల్చేస్తున్నారట. ప్రజా సేవ చేయడానికి పోలీస్ శాఖను వీడి రాజకీయాల్లోకి వచ్చిన తాను.. జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే అనిపించుకోవాలని ఏసురత్నం తపిస్తున్నారు. మద్దాలిపై అనర్హత వేటు పడితే.. రెండోస్థానంలో ఉన్న తననే ఎమ్మెల్యేగా ప్రకటిస్తారని.. ఆ విధంగా YCP ఎమ్మెల్యే సంఖ్యను 151 నుంచి 152 చేస్తానని అనుచరుల దగ్గర చెబుతున్నారట ఈ మాజీ పోలీస్ అధికారి.
మద్దాలిని అన్ని విధాలుగా కార్నర్ చేస్తున్న ఏసురత్నం!
ఇదే సమయంలో ఎమ్మెల్యే మద్దాలిపై మరో ప్రచారం జరుగుతోంది. ఏసురత్నం వేసిన కేసు నుంచి బయటపడేందుకే ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పి అధికారపార్టీలో చేరారని వైరివర్గం ప్రచారం చేస్తోందట. ఈ కేసు నుంచి గట్టెక్కేందుకు ఎమ్మెల్యే రాజీకి ప్రయత్నిస్తున్నా ఏసురత్నం ససేమిరా అంటున్నారట. తాను గెలిస్తే పార్టీకి లాభమే కదా? టీడీపీపై పైచెయ్యి సాధించినట్టు గుర్తిస్తారు కదా అని రాజీకోసం వచ్చిన మధ్యవర్తుల దగ్గర కామెంట్ చేస్తున్నారట. ప్రస్తుతం గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్‌గా ఉన్న ఏసురత్నం.. అన్ని విధాలుగా ఎమ్మెల్యేను కార్నర్ చేస్తున్నారట. అనర్హత వేటు పడేవారి దగ్గరకు ఎందుకు అని కామెంట్స్ చేస్తూ.. ప్రత్యర్థివర్గానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారట.
ఏసురత్నాన్ని ఎలా ఒప్పించాలో అంతుచిక్కడం లేదా?
ఈ వివాదాన్ని పార్టీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకోకపోవడంతో ఎమ్మెల్యే శిబిరం ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఏసురత్నాన్ని ఎలా ఒప్పించాలో.. కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో తెలియక మల్లగుల్లాలు పడుతోందట మద్దాలి వర్గం. దీంతో రెంటికీ చెడ్డ రేవడిలా మారతామా అన్న అనుమానాలు ఉన్నాయట. ఇదేం పెద్ద కేసు కాదు.. ఆధారాలు లేవని పైకి చెబుతున్నా.. కోర్టు తీర్పుతో రాజకీయ జీవితానికి ఎక్కడ బ్రేక్ పడుతుందో అన్న టెన్షన్‌లో మద్దాలి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి.. ఈ వర్గపోరులో ఎవరు సక్సెస్ అవుతారో.. ఎవరు డీలా పడతారో చూడాలి.