రాష్ట్ర రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు చురుకుగా ఉన్న ఆ ఎమ్మెల్యే.. సడెన్‌గా చంటిగాడు లోకల్ అయిపోయారు. కాంగ్రెస్ పెద్ద బాధ్యత అప్పగించినా ఉన్నట్టుండి సైలెంట్. ఆయనకేమైందో అంతుచిక్కడం లేదు. ఇదంతా వ్యూహమా.. కొత్త ఎత్తుగడా? ఎవరా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్!
లోకల్ పాలిటిక్స్‌కే పరిమితం అవుతారట!
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్. కాంగ్రెస్‌లో ట్విస్ట్‌లు కొత్తేం కాకపోయినా.. ఎప్పటికప్పుడు సరికొత్తగా ఉంటుంది నేతల తీరు. ఆ విధంగా లేటెస్ట్‌గా చర్చల్లోకి వచ్చారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇన్నాళ్లూ స్టేట్ పాలిటిక్స్ చుట్టూ తిరిగిన ఆయన.. ఒక్కసారిగా గిరి గీసుకుని అందులోనే ఉంటాను.. బయటకు రాను అని చెబుతున్నారట. పీసీసీలో ఆశించిన పదవి వచ్చినా.. లోకల్ పాలిటిక్స్‌కే పరిమితం అవుతా.. స్టేట్‌లోకి రాను అంటున్నారట. కారణం ఏంటో కానీ.. కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీనివెనక ఏదో కథ ఉందని పార్టీ వర్గాల అనుమానం. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాల్లో జగ్గారెడ్డి మాట తీరు అన్యమనస్కంగా ఉన్నట్టు ఇతర నాయకులు గమనించారట.
నెలలో 6 రోజులు పార్టీకి.. 24 రోజులు సంగారెడ్డిలో..!
నిత్యం వార్తల్లో ఉండాలి.. రాజకీయ చర్చల్లో తన పేరు నలగాలనుకునే జగ్గారెడ్డి.. సడెన్‌గా చంటిగాడు లోకల్‌గా ఎందుకు మారిపోయారన్నదే ప్రశ్న. ఒక నెలలో ఏ రోజు ఎక్కడికి వెళ్లాలి.. ఎన్ని రోజులు కేటాయించాలి అన్నది ఒక టైమ్ టైబుల్ ఫిక్స్ చేశారట. కాంగ్రెస్ అప్పగించిన నల్లగొండ.. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌గా ఉండటంతో.. అక్కడి సమావేశాలకు నెలలో రెండు రోజులు.. పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి ఒక రోజు.. వర్కింగ్ ప్రెసిడెంట్‌లకు అప్పగించిన అనుబంధ సంఘాల సమావేశాలకు 2 రోజులు.. ఇలా సిక్స్ డేస్ పార్టీకి కేటాయిస్తారట జగ్గారెడ్డి. నెలలో 6 రోజులు ఇలా పోతే.. మిగిలిన 24 రోజులు తాను ఎమ్మెల్యేగా ఉన్న సంగారెడ్డికి ఇస్తారట.
ఠాగూర్ సమక్షంలోనే రేవంత్ తీరుపై అసంతృప్తి!
గతంలో చేతిలో డబ్బులు ఉంటేనే నియోజకవర్గానికి వెళ్లే జగ్గారెడ్డి.. ఇప్పుడు ఏకంగా ట్వంటీఫోర్ డేస్.. సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి ఊరూ తిరగాలని నిర్ణయించారట. దీనిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. కొందరు మాత్రం జగ్గారెడ్డి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక మొదట్లో ఆయనతో కాస్త బాగానే ఉండేవారు. సభలూ సమావేశాలు స్టార్ట్ అయ్యాక సమస్యలు వచ్చాయి. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో సభ పెట్టాలనుకున్నప్పుడు కనీసం సమాచారం ఇవ్వలేదని జగ్గారెడ్డి అలిగారట. ఆ సమయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. జగ్గారెడ్డి ఇద్దరూ చర్చల్లోకి వచ్చారు. ఆ తర్వాత AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సమక్షంలో జరిగిన సమావేశంలో రేవంత్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారట జగ్గారెడ్డి.
కాంగ్రెస్ సభలకు భార్యను పంపి.. సంగారెడ్డికే జగ్గారెడ్డి పరిమితం!
కాంగ్రెస్‌లో వెలుగు చూస్తున్న కొత్త గొడవలతో తనపై తప్పుడు అభిప్రాయం రావడం ఎందుకు అనుకున్నారో ఏమో.. సభలు, సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు ఈ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. మీటింగ్స్‌కు వెళ్లితే పార్టీకి, తనకు ఇబ్బంది అనుకుంటున్నారట. ప్రస్తుతం సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న తన భార్య నిర్మలనే అన్ని సభలు, సమావేశాలకు పంపాలని ఆయన నిర్ణయించుకున్నారట. మూడుచింతలపల్లిలో చేపట్టిన రేవంత్ దీక్షలకు జగ్గారెడ్డి అందుకే డుమ్మా కొట్టారట. అక్కడికి తన భార్య నిర్మలను పంపించారు. పైగా జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక.. సంగారెడ్డిలో పార్టీ వ్యవహారాలన్నీ ఆమె చేసుకునేవారు. మారిన వైఖరితో రాష్ట్రస్థాయిలో జరిగే కాంగ్రెస్ సభలకు నిర్మల.. సంగారెడ్డి నియోజకవర్గంలో తాను ఉండాలని డిసైడ్ అయ్యారు జగ్గారెడ్డి. మరి.. కొత్త ఎత్తుగడ రొటీన్‌గా తీసుకున్నదా.. దీని వెనక ఏదైనా వ్యూహం ఉందో కాలమే చెప్పాలి.