ఆయనో మంత్రి. తనకు ఎదురులేకుండా అన్ని వ్యవహారాల్లో నెగ్గుకొస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం ఆయనపై పెద్దగా విమర్శలు చేయటంలేదు. ఆయనపై పోటీ చేసి ఓడిన జనసేన మాత్రం ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తోంది. కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ మంత్రిని ఇరుకున పెడుతోంది. దీంతో అమాత్యులవారు కౌంటర్ అటాక్‌కు సిద్ధమయ్యారట. వారెవరో ఈ స్టోరీలో చూద్దాం.!
మంత్రిపై మొదటి నుంచి ఫిర్యాదులు చేస్తున్న జనసేన నేత మహేష్
వెలంపల్లి శ్రీనివాసరావు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి. బెజవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడ నుంచి మూడుసార్లు పోటీ చేసి.. రెండుసార్లు గెలిచి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. వెలంపల్లి నియోజకవర్గ పరిధిలోనే దుర్గగుడి ఉంది. దుర్గగుడి అధికారులు నిబంధనలకు పాతరేసి కాంట్రాక్టుల దగ్గర నుంచి అన్ని వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని వరస ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏసీబీ, విజిలెన్స్ తనిఖీలు చేసింది. కొందరు సిబ్బందితోపాటు మంత్రికి సన్నిహితంగా మెలిగారన్న ఆరోపణలు ఉన్న అప్పటి ఈవో సురేష్ బాబుపై వేటు వేసింది ప్రభుత్వం. వీటన్నింటిపై మొదటి నుంచి ఫిర్యాదులు చేయటంతోపాటు బహిరంగంగా మంత్రిని విమర్శిస్తున్నారు వెలంపల్లిపై పోటీ చేసి ఓడిన జనసేన అభ్యర్థి పోతిన మహేష్.
టీడీపీ కంటే ఎక్కువగా మంత్రిని ఇరుకున పెట్టిన మహేష్!
మంత్రి అండతోనే దుర్గగుడిలో అక్రమాలు జరిగాయని ఏసీబీ, విజిలెన్స్‌లకు ఫిర్యాదు చేశారు పోతిన. అప్పటి దుర్గగుడి ఈవో సురేష్ బాబుకు నిబంధనలకు విరుద్ధంగా ఒకేసారి రెండు వరస ప్రమోషన్లు ఇచ్చి ఆ పోస్టులో కూర్చోబెట్టారని హైకోర్టులో ఆయన పిటిషన్ కూడా వేశారు. ఇక బ్రహ్మంగారి మఠం, మాన్సాస్ ట్రస్టు, దేవాలయాలు, రామతీర్థం ఘటనల సమయంలోనూ టీడీపీకంటే జనసేన తరఫున పోతిన మహేషే మంత్రిని ఇరుకున పెట్టారు. దీంతో కార్పొరేషన్ ఎన్నికల సమయంలో టీడీపీ కంటే జనసేన గురించే మంత్రి ఎక్కువ ఫోకస్ పెట్టారని ఆయన సన్నిహితులే చెబుతారు. తాజాగా బెజవాడ కార్పొరేషన్‌లో 150 పోస్టులను మంత్రి వెలంపల్లి, మేయర్ భాగ్యలక్ష్మి కలిసి అమ్ముకున్నారని పోతిన చేసిన విమర్శలు బెజవాడలో కాక రేపుతున్నాయి.
జనసేన నేత విమర్శలపై రూటు మార్చిన మంత్రి
బెజవాడ టీడీపీలో ఎంపీ కేశినేని నాని తప్ప వెలంపల్లిపై ఎవరూ విమర్శలు చేయని పరిస్థితి ఉంది. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తదితర నాయకులు ఎప్పుడో ఒకసారి తప్ప మంత్రిపై విమర్శలు చేసిన దాఖలాలు లేవు. కానీ నియోజకవర్గంలో ప్రతి అంశంలో మంత్రిని జనసేన ఇరకాటంలో పెడుతూనే ఉంది. మొదట్లో జనసేన విమర్శలను మంత్రి అసలు పట్టించుకోలేదు. ఓడిన పార్టీ.. అదీ.. కొత్త కేడర్‌కు ప్రయార్టీ ఇవ్వడం ఎందుకని మంత్రి సైలెంట్‌గా ఉండేవారు. రాను రాను వ్యవహారం శ్రుతిమించి అసలుకే ఎసరు తెచ్చేలా ఉండటంతో మంత్రి రూటు మార్చారు.
మహేష్ సోదరుడి భూములపై మంత్రి ఫోకస్
మహేష్ ఆరోపణలపై న్యాయపోరాటానికి ప్లాన్
జనసేన నాయకులపై కౌంటర్ ఎటాక్‌కు సిద్ధమయ్యారట మంత్రి. జనసేన నేత పోతిన మహేష్ సోదరుడికి ఉన్న భూములపై ఫోకస్ పెట్టారట. మహేష్ సోదరుడు ఇప్పటికే నైనవరం సమీపంలో కొంత భూమిని ఆక్రమించుకున్నారని.. ఆ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు మరింత ల్యాండ్ ఉందనే సమాచారంపై విచారణ చేస్తున్నారట. ఉద్యోగాలు అమ్మకం పేరిట మహేష్ చేస్తున్న ఆరోపణలపై నగరవ్యాప్తంగా వైసీపీ నాయకులతో కౌంటర్ అటాక్ చేయించటంతోపాటు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యే ఆలోచనలో ఉన్నారట మంత్రి. అసలు కంటే కొసరుతో వచ్చిన ఎసరు వల్ల ఎక్కువగా ఇబ్బంది పడకుండా వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారట వెల్లంపల్లి. మరి బెజవాడలో ఈ కౌంటర్ పాలిటిక్స్ ఎలాంటి మలుపు తీసుకుంటాయో చూడాలి.