అసంతృప్త జ్వాలలు తారాస్థాయికి చేరడంతో మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారా? పాతవాళ్లు వెళ్లిపోతున్నా పార్టీ పెద్దలకు పట్టడం లేదా? ఇంతకీ ఏంటా పార్టీ? మాజీ ఎమ్మెల్యేలు ఎవరు?
తలోదిక్కుకు పోతున్న పార్టీ కేడర్..!
మేడ్చల్ జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం.. కేడర్ ఉండేది. అలాంటి జిల్లాలో నేడు ఒక్కో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ను వీడి వెళ్లిపోతున్నారు. కూన శ్రీశైలం గౌడ్‌తో మొదలైన రాజీనామాల పర్వం ప్రస్తుతం ఆకుల రాజేందర్ దగ్గర ఆగింది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎమ్మెల్యేలుగా గెలిచి.. సొంత కేడర్‌ను పెంచుకున్న నాయకులు ఇప్పుడు కాంగ్రెస్‌లో ఇమడ లేకపోవడం చర్చగా మారింది. పైగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోనే కాంగ్రెస్ నాయకులు తలోదిక్కుకు వెళ్లిపోతున్నారు.
మేడ్చల్‌జిల్లా కాంగ్రెస్‌లో ఇప్పుడు ఎందరున్నారో?
కుత్భుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరిపోయారు. ఆతర్వాత మరో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి వంతు వచ్చింది. రేవంత్‌ను పీసీసీ చీఫ్‌గా ప్రకటించిన నాడే కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు కేఎల్‌ఆర్. ఇప్పుడీ జాబితాలో మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ చేరారు. ఈ విధంగా మాజీ ఎమ్మెల్యేలు జారిపోతున్నా.. కాంగ్రెస్ నాయకులకు చీమ కుట్టినట్టు అయినా లేదు. దీంతో ఇది మాజీ ఎమ్మెల్యేలతో ఆగకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు జంప్ జిలానీ అంటున్నారట. దీంతో ఒకప్పుడు కేడర్‌తో కళకళలాడిన మేడ్చల్ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఎవరున్నారో ఎవరు లేరో గుర్తించలేని పరిస్థితి.
మాటకు విలువ లేకే రాజీనామాలు?
ప్రస్తుతం మేడ్చల్ జిల్లా కాంగ్రెస్‌లో కొత్త నాయకుల హవా ఎక్కువైంది. పాతవాళ్లు, సీనియర్ల మాటకు విలువ లేదట. కొత్తగా వచ్చిన వాళ్లు ఏం చెబితే అదే జరుగుతోందట. ఇది రుచించని సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నట్టు టాక్. జిల్లాలో ఏ కార్యక్రమం తీసుకున్నా.. రేవంత్ వర్గానికి చెందిన వారి ఆధిపత్యమే ఎక్కువగా ఉందట. పార్టీ కమిటీలలో కూడా తమకు నచ్చినవారితో నింపేస్తున్నట్టు సమాచారం. అంతా ఏకపక్షంగా సాగుతున్న సమయంలో పార్టీలో ఉండి ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్న కేడర్ క్రమంగా సర్దుకుంటోంది.
డీసీసీ ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్‌పై నేతల గుర్రు..!
శక్తిమేరా ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతున్న టీఆర్‌ఎస్, బీజేపీ..!
కాంగ్రెస్‌లో ప్రాధాన్యం దక్కని.. కమిటీలలో చోటులభించని నాయకులంతా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌పై గుర్రుగా ఉన్నారట. అడిగినా ఉపయోగం లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యేల అనుచరులు, కేడర్ చెల్లాచెదురు అవుతున్నట్టు సమాచారం. అందుకే వారంతా పార్టీ నుంచి బయటకొచ్చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరి కారణాలు వారు చెబుతున్నా.. కామన్ పాయింట్ ఒకటే నట. పార్టీలో గుర్తింపు లేకపోవడం. ఇదే ఛాన్స్ అనుకున్నాయో ఏమో.. టీఆర్ఎస్, బీజేపీలు తమ శక్తిమేరా ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన కేఎల్‌ఆర్, ఆకుల రాజేందర్‌లు ఏ పార్టీలోనూ చేరలేదు. అలా అని కాంగ్రెస్‌లోకి తిరిగొచ్చే ఆలోచనలో ఉన్నారో లేదో తెలియదు. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి ఇలాకాలో మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లడంపై కాంగ్రెస్‌లో సెగలు రేపుతోంది.