ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో ఇప్పుడు తమ్ముళ్ల కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయా? పార్టీ అధికారంలో లేకపోయినా వెనక్కి తగ్గడం లేదా? ఇప్పట్లో ఆ తగువులు కొలిక్కి వస్తాయో లేదో కూడా తెలియదా? పార్టీ పెద్దలు కూడా తలపట్టుకుంటున్నారా? ఇంతకీ ఆ నియోజకవర్గమేంటీ? తమ్ముళ్లు ఎందుకు కీచులాడుకుంటున్నారో ఈ స్టోరీలో చూద్దాం.
కొవ్వూరు టీడీపీలో కుమ్ములాటలు!
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు. టీడీపీకి బలమైన కేడర్ ఉన్నా.. ఎవరి గ్రూప్ వాళ్లదే. పార్టీ వేదికలపైనే కాదు.. సోషల్ మీడియాలోనూ నువ్వెంత అంటే నువ్వెంత అని విమర్శలు చేసుకుంటున్నారు తమ్ముళ్లు. దాదాపు మూడేళ్లగా ఇదే తంతు. ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో తెలియడం లేదట పార్టీ నేతలకు.
మాజీ మంత్రి జవహర్ నేతృత్వంపై టీడీపీలోని ఓ వర్గం గుర్రు!
2014లో కొవ్వూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన జవహర్.. ఆ సమయంలో ఒక్కటిగా ఉన్న పార్టీ కేడర్‌ను వర్గాలుగా విభజించారని పార్టీ శ్రేణులు ఆరోపిస్తుంటాయి. ఆ సమయంలో పార్టీ వారికి చెందిన మద్యం షాపులను కూడా ముడుపుల కోసం వదల్లేదని టీడీపీలోని ఓ వర్గం ఆరోపణ. కారణాలేవైనా.. 2019లో జవహర్‌కు కొవ్వూరు టికెట్ ఇవ్వలేదు టీడీపీ. ఆయన్ని కృష్ణాజిల్లా తిరువూరు పంపించారు. నాడు కొవ్వూరులో వంగలపూడి అనిత పోటీ చేసినా.. ఓటమి తప్పలేదు. ఆ ఎన్నికల తర్వాత జవహర్ తిరిగి కొవ్వూరు వచ్చేశారు. పార్టీ కార్యక్రమాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే జవహర్ వ్యతిరేకవర్గానికి ఇది రుచించడం లేదట.
ఫలించని గద్దె సయోధ్య యత్నాలు!
విషయం గమనించిన రాజమండ్రి పార్లమెంట్ టీడీపీ ఇంచార్జ్ గద్దె రామ్మోహన్.. కొవ్వూరు తెలుగు తమ్ముళ్లతో పలుమార్లు భేటీ అయ్యారు. రెండువర్గాలతో మాట్లాడి సయోధ్యకు యత్నించారు గద్దె. కానీ.. ఎవరూ వెనక్కి తగ్గేందుకు అంగీకరించలేదు. ఇక లాభం లేదని అనుకున్న ఆయన.. తన అభిప్రాయాన్ని చంద్రబాబుకు నివేదిస్తానని.. ఆయనే నిర్ణయం తీసుకుంటారని చెప్పేశారట.
ఇంఛార్జ్ పదవి కోసం ముగ్గురు నాయకులు లాబీయింగ్!
చంద్రబాబు నిర్ణయం తీసుకునే ముందు కామ్‌గా ఉంటే లాభం లేదని అనుకున్నారో ఏమో.. జవహర్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లు.. ఇంచార్జ్‌ను మార్చాలని కొత్త పేర్లు చర్చకు పెట్టారట. కొత్తవారికి అవకాశం ఇస్తేనే టీడీపీ బతికి బట్ట కడుతుందని స్పష్టం చేస్తున్నారట. ఇదే టైమ్ అనుకున్నారో ఏమో.. నియోజకవర్గంలో కాస్తో కూస్తో పట్టు ఉన్న ముగ్గురు నాయకులు ఇంఛార్జ్ పదవికోసం తమకున్న పరిచయాల ద్వారా లాబీయింగ్ చేస్తున్నారట.
జవహర్‌కు మద్దతుగా యనమల?
జవహర్‌నే ఇంచార్జ్‌గా కొనసాగించాలని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పట్టుబడుతున్నారని ప్రచారం జరుగుతుండటంతో పార్టీలోని ఓవర్గం మండిపడుతోందట. కొవ్వూరుపై యనమలకేం పని అని ఫైర్ అవుతున్నారట తమ్ముళ్లు. అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ముగ్గురిలో ఒకరిని ఎంచుకుంటారో లేక జవహర్‌నే కొనసాగిస్తారో తెలియదు. పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు కేడర్.