కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులకు కొత్త కష్టమొచ్చిందా? సైకిల్ దిగేందుకు సిద్దపడినా.. ఏ పార్టీలో చేరాలో తెలియక సతమతం అవుతున్నారా? గ్రామాల్లో తిరుగుతూ.. రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించమని పార్టీ మారిన పాత కేడర్‌ను కోరుతున్నారా? ఇది ఎత్తుగడ.. ఇంకేదైనా వ్యూహం ఉందా?
ఏ పార్టీలో చేరాలో చెప్పాలని గ్రామాల్లో అడుగుతున్నారట..!
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో రాజకీయ సందడి మొదలైంది. టీడీపీ ఆవిర్భావం నుంచి జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీతాదయాకర్‌రెడ్డి దంపతులు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. కండువా మార్చాలి అనుకున్నప్పుడు రాజకీయ నాయకులు సహజంగా జరిపే ప్రక్రియకు భిన్నంగా ఈ దంపతులు.. గ్రామాలకు వెళ్లి.. పార్టీలకు అతీతంగా అక్కడి నాయకులను కలుస్తున్నారు. తాము ఏ పార్టీలో చేరాలో చెప్పాలని సలహా కోరుతున్నారట. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి ఆహ్వానాలు ఉన్నాయని చెబుతూనే.. మీ ఆలోచన ఏంటి అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారట కొత్తకోట కపుల్స్.
టీడీపీని వీడాలని సన్నిహితులు చెప్పారా?
దయాకర్‌రెడ్డి మూడుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిస్తే.. ఆయన సతీమణి సీతా దయాకర్‌రెడ్డి ఒకసారి జడ్పీ ఛైర్‌పర్సన్‌గా మరోసారి దేవరకద్ర ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014 నుంచి రాజకీయాల్లో వీరికి గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి.. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల అప్పటి వరకు వీరి వెంట ఉన్న కేడర్ చెల్లాచెదురైంది. టీడీపీని వీడితేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని సన్నిహితులు సూచించడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారట.
మనసు కాంగ్రెస్ వైపు లాగుతోందా?
గడిచిన ఆరేడు నెలలుగా టీడీపీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు కొత్తకోట దంపతులు. బక్కని నర్సింహులు టీ టీడీపీ అధ్యక్షుడయ్యాక ఒక్క కార్యక్రమంలోనూ కనిపించలేదు. టీ టీడీపీ అధ్యక్ష పదవిని దయాకర్‌రెడ్డి ఆశించి భంగపడ్డట్టు అప్పట్లో చర్చ జరిగింది. ఇప్పుడు మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో గతంలో తమతో కలిసి ఉన్న కేడర్‌తో కలిసి మాట్లాడుతున్నారట. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నా ఏ పార్టీ నుంచి అనేది చెప్పడం లేదట. ఇప్పటికే టీఆర్ఎస్లోకి సర్దుకున్న ఒకనాటి అనుచరులైతే టీఆర్ఎస్లోకి వచ్చేయాలని సూచిస్తున్నారట. అయితే మక్తల్, దేవరకద్రలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటంతో.. అక్కడ ఖాళీ లేదు. ఒక జాతీయ పార్టీ నేతలతో కొత్తకోట దంపతులు టచ్‌లో ఉన్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. బీజేపీలోకి వెళ్లకపోవచ్చని.. కాంగ్రెస్‌లో చేరొచ్చని అనుకుంటున్నారట.
గ్రామాల పర్యటనల్లో వెంట కాంగ్రెస్ కేడర్?
ఇటీవల దయాకర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కాంగ్రెస్ రంగులతో ఫ్లెక్సీలు వెలిశాయి. ఆయన గ్రామలకు వెళ్తుంటే.. వెంట కాంగ్రెస్ కేడర్ అనుసరిస్తోందట. దీంతో కొత్తకోట దంపతులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని.. కండువా కప్పుకోవడమే మిగిలిందని చెబుతున్నారు. మనసులో ఈ మేరకు క్లారిటీ ఉంచుకుని.. గ్రామాలలో తిరుగుతూ.. కేడర్‌ను కలిసి ఏ పార్టీలో చేరితే మంచిదో చెప్పాలని ఎందుకు అడుగుతున్నారు? కాంగ్రెస్‌పై వారికి నమ్మకం లేదా? గందరగోళంలో ఉన్నారా అని మరికొందరు ఆరా తీస్తున్నారట. మరి.. కొత్తకోట దంపతుల దారెటో కాలమే చెప్పాలి.