ఆ జిల్లాలో అధికారపార్టీ నేతల మధ్య ‘బుసక’ చిచ్చుపెట్టింది. పక్కపక్క నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారిలో ఒకరు మంత్రిగా ఉంటే మరొకరు ఎమ్మెల్యే. ఎన్నికలకు ముందు ఉన్న సఖ్యత ఇప్పుడు లేదట. ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లినా అంటీముట్టనట్టు ఉంటోన్న వీళ్ల వ్యవహారం చర్చగా మారింది. వాళ్లెవరో.. ఆ బుసకేంటో.. ఈ స్టోరీలో చూద్దాం.
ఇద్దరి మధ్య దూరం పెంచిన ‘బుసక’..!
కృష్ణాజిల్లా గుడివాడ నుంచి వరసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం జగన్ తొలి కేబినెట్‌లోనే మంత్రయ్యారు కొడాలి నాని. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడకు ఆనుకునే ఉంటుంది కైకలూరు నియోజకవర్గం. కైకలూరు నుంచి పోటీ చేసిన మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు దూలం నాగేశ్వరరావు. ఎన్నికలకు ముందు, తర్వాత కొన్నాళ్ల వరకు కొడాలితో నాగేశ్వరరావుకు సత్సంబంధాలే నడిచాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదట. ఇద్దరి మధ్య దూరం పెరగటానికి ప్రధాన కారణం కైకలూరు నియోజకవర్గంలో ఉన్న బుసకేనట.
మంత్రి, ఎమ్మెల్యే అనుచరుల జేబులు నింపుతున్న ‘బుసక’
ఇళ్ల నిర్మాణంలో బేస్మెంట్ నింపడానికి మట్టి, ఇసుకకాని బుసకను ఈ ప్రాంతంలో వాడుతుంటారు.
కైకలూరులోని వేమవరప్పాడు, తామరుకొల్లు, సతీనపల్లి, వరాహపట్నం, కలిదిండి, కొరుకొల్లు, వెంకటాపురం, గోపాలపురం, పోతుమర్రు, కొండూరు గ్రామాల్లో భారీగా బుసక దిబ్బలు ఉన్నాయి. క్యూబిక్ మీటర్‌కి 50 నుంచి 60 రూపాయల ధర ఉంటుంది. అయితే కైకలూరులో అనుమతులు తీసుకుని కలిదిండిలో తవ్వకాలు జరుపుతున్నారట. ట్రాక్టర్లకు అనుమతిస్తే లారీల్లో తవ్వుకుపోతున్నారట. మార్కెట్లో లారీ బుసక 10 వేలుపైన ఉంది. ట్రాక్టర్‌కు వెయ్యి రూపాయలను స్థానిక ప్రాంతాల్లో వసూలు చేస్తున్నారు. అనుమతి తీసుకున్న దానికంటే భారీగా తవ్వకాలు జరపటంతో ఎమ్మెల్యే, మంత్రి అనుచరుల జేబులు నిండుతున్నాయట.
కొడాలి అనుచరులు బుసకను తరలించుకుపోవడంపై ఎమ్మెల్యే కస్సుబుస్సులు
బుసకకు బాగా గిరాకీ ఉండటంతో తవ్వకాలకు సంబంధించి మంత్రి, ఎమ్మెల్యే వర్గాల మధ్య వివాదానికి కారణమైందట. ఎంత ఎక్కువ తవ్వుకుంటే అంత డబ్బులు వస్తుండటంతో వివాదం ముదిరిందట. తన నియోజకవర్గం పరిధిలో ఉన్న బుసకను మంత్రి అనుచరులు తరలించుకెళ్లడం ఎమ్మెల్యేకి అస్సలు నచ్చడం లేదు. తన వర్గానికి దక్కాల్సింది.. సొంత పార్టీయే అయినా పక్క నియోజకవర్గానికి పోవడాన్ని ఎమ్మెల్యే దిగమింగుకోలేకపోతున్నారట. ఈ బుసకను మంత్రి కొడాలి నాని అనుచరులు, ఎమ్మెల్యే నాగేశ్వరరావు అనుచరులు ఇద్దరూ రవాణా చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే. పైగా ఈ బుసకను ప్రభుత్వ పనుల పేరుతో తరలిస్తున్నామని మంత్రి, ఎమ్మెల్యే వర్గీయులు భారీగా తవ్వకాలు చేపట్టారట. నిబంధనల ప్రకారం కాకుండా పరిమితికి మించి పెద్దమొత్తంలో చేస్తున్నారట.
పోలీసులతో చెప్పి.. మంత్రి అనుచరుల టిప్పర్లు ఆపించిన ఎమ్మెల్యే?
మంత్రి అనుచరులపై ఎమ్మెల్యే ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారట. మంత్రి వర్గీయుల టిప్పర్లపై చర్యలు తీసుకోవాలని ఎస్పీపై ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారట. స్థానిక పోలీసులకు చెప్పి ఆ టిప్పర్లను ఆపించారట ఎమ్మెల్యే నాగేశ్వరరావు. కొన్ని వాహనాలకు జరిమానా వేయించినట్టు సమాచారం. ఈ పరిణామాల తర్వాత మంత్రి కొడాలి నాని.. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మధ్య గ్యాప్ వచ్చిందట. అంతేకాదు కొడాలి వర్గాలకు చెందినవిగా చెబుతున్న టిప్పర్లు కైకలూరు వైపు తగ్గుముఖం పట్టాయట. ఎమ్మెల్యే అనుచరులు మాత్రం ప్రభుత్వ ఇళ్ల స్థలాల పూడిక కోసమని బుసకను అదే పనిగా తరలించేస్తున్నట్టు సమాచారం.
మంత్రి, ఎమ్మెల్యేల కోల్డ్‌వార్‌తో నలిగిపోతున్న అధికారులు
మంత్రి, ఎమ్మెల్యే మధ్య కోల్డ్‌వార్‌తో మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు నలిగిపోతున్నారట. కొడాలి నాని కూడా కైకలూరువైపు 4 నెలలుగా చూడనే లేదట. ముఖ్య కార్యక్రమాలు ఏమైనా ఉంటే జిల్లాకే చెందిన మరో మంత్రి పేర్ని నాని హాజరవుతున్నారట. ఇటీవల మత్స్యశాఖ కార్యక్రమంలో మంత్రి నాని పాల్గొన్నప్పటికీ ఆయన, ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఇద్దరూ ఎడముఖం పెడముఖంగానే ఉన్నారట. మరి.. రానున్న రోజుల్లో ఈ బుసక రగడ ఇద్దరి మధ్య ఇంకెంత దూరం తీసుకెళ్తుందో చూడాలి.