అక్కడ పాగా వేయడానికి రెండేళ్లుగా ఎదురు చూస్తోంది అధికారపార్టీ. ఇప్పుడా ముహూర్తం దగ్గర పడిందా? మేయర్ పీఠాన్ని కైవశం చేసుకుంటుందా? జరుగుతున్న పరిణామాలు.. వస్తున్న సంకేతాలు.. పొలిటికల్ ఎత్తుగడలను బలపరుస్తున్నాయా? ఇంతకీ ఏంటా కార్పొరేషన్.. ఏమా కథ?
15తో నాలుగేళ్లు పూర్తికానున్న పావని మేయర్ పదవీకాలం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు లేకపోయినా.. మేయర్ పీఠంపై అధికారపార్టీ వైసీపీ గురిపెట్టడమే ఆ వేడి సెగలకు కారణం. ఈ నెల 15తో మేయర్ సుంకర్ పావని పదవి చేపట్టి నాలుగేళ్లు అవుతుంది. ఆమె టీడీపీ నేత. నాలుగేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మేయర్‌ను మార్పు చేసుకునే వెసులుబాటు ఉండటంతో.. ఆ ముహూర్తం కోసమే ఎదురు చూస్తూ ఉంది వైసీపీ. దాంతో 15 తర్వాత జరిగే పరిణామాలు.. కొత్త మేయర్ ఎవరన్నదానిపై వాడీవేడీ చర్చ జరుగుతోంది.
జంపింగ్ జపాంగ్‌లతో బలం పెంచుకున్న వైసీపీ!
2017లో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగాయి. నాడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నా.. ఇక్కడ వైసీపీతో గట్టిపోరే నడిచింది. చివరకు టీడీపీ మెజారిటీ డివిజన్లు గెలుచుకుని కాపు సామాజికవర్గానికి చెందిన సుంకర పావనిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ ఎఫెక్ట్ కాకినాడ కార్పొరేషన్‌పై పడింది. టీడీపీ కార్పొరేటర్లు జంపింగ్ జపాంగ్‌లుగా మారిపోయారు. 32 మంది టీడీపీ కార్పొరేటర్లలో ఎక్కువ మంది ప్లేట్ ఫిరాయించేశారు. నాడు పది మంది కార్పొరేటర్ల బలమే ఉన్న వైసీపీ శిబిరంలో గోడ దూకిన వారితో కలిపి 35 వరకు చేరుకుందని టాక్. తమకు 35 మంది కార్పొరేటర్ల బలం ఉందని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డే తెలిపారు. ఇటీవల జరిగిన రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఆ స్థానాన్ని వైసీపీ దక్కించుకుంది. ఇప్పుడు మేయర్ పీఠంపై ఫోకస్ పెట్టారు అధికార పార్టీ నాయకులు.
కొత్త కార్పొరేషన్ భవనం పనులు వాయిదా?
15 తర్వాత మేయర్ పావనిపై అవిశ్వాసం?
అత్యాధునిక హంగులతో 38 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో కాకినాడ కార్పొరేషన్ కొత్త భవనం పనులు చేపట్టాల్సి ఉంది. పునాది ఎప్పుడో పడాల్సి ఉన్నా.. అవి వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నెల 15న శంకుస్థాపన చేయాలని అనుకున్నా.. మళ్లీ వాయిదా వేశారు. మేయర్ కుర్చీ మార్పే దానికి కారణమని టాక్. వైసీపీ మేయర్ చేతుల మీదుగా పునాది రాయి వేయడానికి చూస్తున్నారట. 15న తర్వాత మేయర్ సుంకర్ పావనిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి.. వైసీపీ మహిళా కార్పొరేటర్‌ను ఆ స్థానంలో కూర్చోబెడతారని ప్రచారం జరుగుతోంది. అధికారపార్టీ కూడా కాపు సామాజికవర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్‌నే మేయర్‌ను చేస్తారని చర్చ నడుస్తోంది. ఒకసారి ఆ మార్పు జరిగిపోతే.. కాకినాడ కార్పొరేషన్‌పై వైసీపీ జెండా ఎగరేసి.. కొత్త భవనం శంకుస్థాపన పనులు మొదలు పెడతారట.
వైసీపీ నుంచి కొత్త మేయర్ ఎవరు?
ప్రస్తుతం అందరి దృష్టీ 15వ తేదీపై నెలకొంది. కొత్త మేయర్ ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. వన్స్ తమ వ్యక్తి మేయర్ కుర్చీలో కూర్చుంటే.. ఏడాది తర్వాత జరిగే ఎన్నికల నాటికి పూర్తిగా పాగా వేయొచ్చన్నది అధికార పార్టీ ఆలోచన. మరి.. ఈ వారం రోజుల్లో కాకినాడలో జరిగే రాజకీయ మార్పులు ఎలా ఉంటాయో చూడాలి.