అధికారం కోల్పోయాక ఏ ఒక్క నేతా ఆ నియోజకవర్గంవైపు కన్నెత్తి చూడలేదట. ఉన్న కొందరూ నచ్చిన దారిని ఎంచుకున్నారు. పార్టీనే నమ్ముకున్నవారి పరిస్థితి ఏంటన్నది టీడీపీ తమ్ముళ్ల ఆవేదన. ప్రస్తుతం దిక్కులేకుండా పోయామని వాపోతున్నారట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం?
దిక్కులేకుండా పోయామని చిత్తూరు తమ్ముళ్ల ఆవేదన!
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిన తర్వాత చిత్తూరు జిల్లాలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ స్థితి దయనీయంగా ఉందన్నది కేడర్ ఆవేదన. జిల్లా కేంద్రమైన చిత్తూరులో పార్టీ ఏటూ కాకుండా పోయిందని శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఒకవైపు అధికారపార్టీలో గ్రూపులు ఎక్కువై సతమతం అవుతుంటే..ఆ పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి టీడీపీలో ఒక్క నాయకుడూ లేరని చెవులు కొరుక్కుంటున్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో తాము దిక్కులేని వాళ్లుగా మారిపోయామని తమ్ముళ్లు వాపోతున్నారట.
చిత్తూరు టీడీపీకి ఇంఛార్జ్ లేరు!
2014 ఎన్నికల్లో సత్యప్రభ ఎమ్మెల్యే టీడీపీ నుంచి గెలిచారు. 2019లో మనోహర్ పోటీ చేసినా ఓడిపోయారు. సామాజిక సమీకరణాలు టీడీపీకి కలిసిరాలేదు. ఆ ఓటమి తర్వాత టీడీపీ నాయకులు, కేడర్ చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా మారిపోయింది. నాడు ఎన్నికల్లో పోటీ చేసిన మనోహర్ సైతం టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు. అప్పటి నుంచి చిత్తూరు టీడీపీకి ఇంఛార్జ్ లేకుండా పోయారు.
కఠారి కుటుంబంవైపు చూస్తోన్న కేడర్!
ధర్నాలు, నిరసనలకు టీడీపీ పిలుపిస్తే.. లీడ్ తీసుకుని నడిపించేవారు లేరట. కేడర్‌కు ధైర్యం చెప్పే వారు కనుమరుగయ్యారు. చిత్తూరు సమస్యలపై ప్రశ్నించేవారు.. గొంతెత్తి మాట్లాడేవారు కనిపించడం లేదు. కఠారి కటుంబంలోని మాజీ మేయర్‌ను ఇంచార్జ్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారట. కఠారి కుటుంబానికి చెందిన అనురాధ, మోహన్‌లు ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్య కాబడ్డారు. ఆ సమయంలో కఠారి హేమలత మేయర్ అయ్యారు. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ నుంచి నామినేషన్ వేసిన మెజారిటీ అభ్యర్థులు ఆ తర్వాత విత్‌డ్రా చేసుకుంటే.. హేమలత మాత్రం తన డివిజన్‌లో గెలిచారు.
ఇంఛార్జ్‌ను ప్రకటించకపోతే సర్దుకుంటామని కేడర్ హెచ్చరిక!
ఇదే సమయంలో కరోనాతో హేమలత భర్త చనిపోయారు. గడ్డుకాలంలో సైతం గట్టిగా నిలబడ్డ హేమలతను ఇంఛార్జ్‌గా ప్రకటించాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారట కేడర్. మరోవైపు సత్యప్రభ మృతి తర్వాత డీకే కుటుంబం సైతం పార్టీకి దూరంగా ఉంటోంది. నాయకుడు లేక కనీసం ధర్నా చేయడానికి కూడా పదిమంది ముందుకు రావాలంటే ఆలోచించే స్థితికి పార్టీ వచ్చిందని టాక్. కేడర్ బలంగా ఉన్నా నేతలు మాత్రం చేతులు ఎత్తేస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ ఇంఛార్జ్‌ను ప్రకటించకపోతే తాము కూడా సర్దుకుంటామని కేడర్ హెచ్చరిస్తున్నారట. మరి.. చిత్తూరు తమ్ముళ్ల ఆవేదనకు చంద్రబాబు ఎలాంటి పరిష్కారం సూచిస్తారో చూడాలి.