ఒకప్పుడు ఆయా నియోజకవర్గాల్లో వారంతా కింగ్‌లు. రాజకీయాల్లో చక్రం తిప్పారు కూడా. పరిస్థితులు మారడంతో మరొకరి గెలుపు కోసం పనిచెయ్యాల్సి వచ్చింది. చెప్పిన పని చెప్పినట్లు పూర్తి చేశారు. గెలిచినవారు మాత్రం వారిని పట్టించుకోవడం మానేశారట. ఇంతకీ ఎవరా నేతలు? ఏమా కథా?
భవిష్యత్ బాగుంటుందని గెలుపునకు కృషి చేశారు
ఎన్నికల్లో కలిసి తిరిగిన వారిని దూరం పెట్టిన ఎమ్మెల్యేలు!
రెండేళ్లక్రితం జరిగిన ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో వైసీపీ సునామీ సృష్టించింది. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో కూడా 17స్థానాల్లో 15చోట్ల వైసీపీ అభ్యర్దులు విజయం సాధించారు. అయితే ఇదంతా సులభంగా జరగలేదు. ఏ చిన్న నేతనూ వైసీపీ వదల్లేదు. 2014 ఫలితాల అనుభవంతో 2019లో ప్రతి ఒక్కరినీ సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లాలో కీలక నేతలను పార్టీలోకి తీసుకురావడం, అభ్యర్దుల విజయానికి వారు ఉపయోగపడేలా వ్యూహ రచన చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు కూడా. దీంతో సీట్ పోయినా భవిష్యత్ బాగుంటుందన్న లెక్కలతో పార్టీలోకి వచ్చిన వారంతా వైసీపీ అభ్యర్థులు గెలవడానికి కసితో పనిచేశారు. ఎన్నికల సమయంలో కలిసి పనిచేసిన మాజీలకు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు మధ్య నెమ్మదిగా దూరం పెరుగుతూ వచ్చింది. గెలవడం కోసం మాజీలతో చెట్టపట్టాలేసుకుని తిరిగిన అప్పటి అభ్యర్థులు, ఇప్పటి ఎమ్మెల్యేలు.. వారిని దూరంగా పెట్టారు. భవిష్యత్‌లో పోటీ రాకుండా ఉండేందుకు నియోజకవర్గాల్లో తమకు పోటీగా తయారు అవుతారని అనుకున్నారో ఏమో.. మాజీలను ‘కట్’ చేయడం మొదలుపెట్టారు. కొన్నిచోట్ల సొంతపార్టీ మాజీల ఆర్థిక వనరులపైనా ఎమ్మెల్యేలు దెబ్బకొట్టారట. ఇలా గుంటూరు జిల్లాలో చాలా లిస్ట్ ఉంది.
వినుకొండలో పలకరించుకోని ఎమ్మెల్యే బొల్లా, మాజీ ఎమ్మెల్యే మక్కెన
వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. వైసీపీ అభ్యర్ది బొల్లా బ్రహ్మనాయుడు విజయానికి సహకరించారు. గతంలో వినుకొండ ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన మక్కెన తన వర్గంతో కలిసి ఎన్నికల్లో బొల్లా గెలుపునకు పనిచేశారు. ఎన్నికల తర్వాత వీరిద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఎన్నికల సమయంలో కలిసిమెలిసి తిరిగిన మక్కెన, బొల్లా తర్వాత ఒకరినొకరు పలకరించుకోవడం కూడా అరుదుగా మారింది. ఏడాది కాలంగా ఇద్దరూ కలిసి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనలేదంటే వీరి మధ్య ఎంత గ్యాప్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
పొన్నూరులో ఎమ్మెల్యే కిలారు.. పార్టీ నేత రావి మధ్య దూరం
ఇక పొన్నూరు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పొన్నూరు నుంచి వరసగా ఐదుసార్లు గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య చేతిలో ఓడిపోయారు. కిలారి గెలుపులో మరో వైసీపీ నేత రావి వెంకటరమణ సహకారం కూడా ఉంది. గతంలో పొన్నూరు వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసిన రావి వెంకటరమణ… నరేంద్ర చేతిలో ఓడిపోయారు. ఎన్నికల సమయంలో నకిలీ మద్యం కేసులో ఇరికించడంలో నరేంద్ర హస్తం ఉందని రావి వర్గీయులు చెబుతుంటారు. అయితే చివరి నిమిషంలో ఈక్వేషన్స్ మారడంతో 2019 ఎన్నికల్లో రావికి బదులు కిలారికి సీటు ఇచ్చారు జగన్. కిలారి గెలుపునకు కృషి చెయ్యాలని రావికి జగన్ సూచించారు. ధూళిపాళ్ల అంటే కసి పెంచుకున్న రావి వెంకటరమణ… నరేంద్రను ఓడించడమే లక్ష్యంగా పనిచేశారు. ఎన్నికల తర్వాత రావి వెంకటరమణ, కిలారి రోశయ్యల మధ్య కూడా దూరం పెరిగిపోయింది. అయితే ఎన్నికల్లో తనకు రావి సహకరిస్తే ఇప్పుడు వచ్చిన దానికంటే ఇంకా పదివేల మెజార్టీ వచ్చేదని ఆయన వర్గీయులు చెబుతుంటారు. రావికి పట్టున్న చేబ్రోలు, పెదకాకాని మండలాల్లో మెజార్టీ రావడం వల్లే కిలారి గెలిచారని రావి వర్గీయులు చెబుతారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఇద్దరి మధ్య ఎడముఖం.. పెడముఖంగా ఉంది.
చిలకలూరిపేటలో ఎమ్మెల్యే రజని వర్సెస్ వైసీపీ నేత మర్రి
చిలకలూరిపేటలో కూడా ఇదే పరిస్థితి. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట సీటు మర్రి రాజశేఖర్ ఆశించారు. జగన్ మాత్రం విడదల రజనీకి సీటు కేటాయించారు. రజినీని గెలిపిస్తే మర్రికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రకటించారు. ఎన్నికల్లో విడదల రజినీ గెలుపునకు మర్రి కృషి చేశారు. మొదట్లో మర్రి, రజినీలు బాగానే ఉన్నా తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. నియోజకవర్గంలో వైసీపీ రెండు వర్గాలుగా మారిపోయింది. మర్రి పుట్టినరోజున అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే మున్సిపాలిటీ అనుమతి లేదంటూ అధికారులు తొలగించారు. ఈ ఘటన వెనక ఎమ్మెల్యే రజినీ ప్రమేయం ఉందని మర్రి వర్గీయులు అప్పట్లో ఆందోళన చేశారు. ప్రస్తుతం పేట వైసీపీలో ఒకరి పొడ ఇంకొకరికి గిట్టడం లేదు.
పార్టీ నేతల ఆశలపై నీళ్లుచల్లిన ఎమ్మెల్యేలు!
పదవి లేకున్నా పార్టీ గెలిచింది కదా.. ఏదో ఒకటి నడిపించ వచ్చని ఆశించిన నేతల ఆశలపై ఎమ్మెల్యేలు నిర్ధాక్షిణ్యంగా నీల్లుచల్లారు. పోటీ అవుతారనో లేక ప్రమాదకరంగా మారతారని అనుకున్నారో కానీ.. ఎన్నికల్లో చేదోడుగా ఉన్నవారికి.. గెలిచాక వీళ్లు చెయ్యి ఇచ్చేశారు.