ఏపీ బీజేపీ పూర్తిగా మారిపోయిందా? రోజూ రోడ్డు మీదే ఉంటోందా? ప్రజా సమస్యలు.. పార్టీ కార్యక్రమాలతో బీజీ అయిపోయిందా? ఇంతలోనే అంత ఛేంజ్ ఎలా వచ్చింది? ఈ మార్పు వెనక ఉన్నది ఎవరు? ఢిల్లీకి చెందిన ఆ నేత అంతగా ఎలా ప్రభావం చూపుతున్నారు? ఉత్సాహపరిచారా? ఊరికే కూర్చుంటే ఊరుకోబోమని హెచ్చరించారా?
శివప్రకాష్ చెప్పింది చేయకపోతే అసలుకే ఎసరొస్తుందా?
ఏపీలో బీజేపీకి ఇంఛార్జ్.. కోఇంఛార్జ్ ఉన్నారు. కేంద్రమంత్రి మురళీధరన్ ఇంఛార్జ్ కాగా.. రాష్ట్రంలో ఉండి పార్టీ కార్యక్రమాల్లో రోజూ పాల్గొంటున్నారు కోఇంచార్జ్ సునీల్ దేవధర్. ఇప్పుడు మరో ఢిల్లీ నేత రంగంలోకి దిగారు. బీజేపీలో సంస్థాగత వ్యవహారాలు చూసే నేతలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇదే విభాగం నుంచి ఏపీ వ్యవహారాలు చూస్తున్నారు శివ ప్రకాష్ అనే నేత. ఆయన బీజేపీ జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి. ఆ హోదాలో ఏపీకి వచ్చిన ఆయన తొలిమీటింగ్‌లోనే తానేంటో.. పార్టీ ఎలా ఉండాలో స్పష్టంగా చెప్పేశారు. తూతూ మంత్ర కార్యక్రమాలు కుదరదని కుండబద్దలు కొట్టేశారు. రాష్ట్ర పార్టీ చీఫ్ సోము వీర్రాజు నుంచి అంతా ఇక కార్యరంగంలోకి దిగాలని స్పష్టం చేశారట ప్రకాష్. పార్టీ జాతీయ వ్యవహారాల్లో కీలక నేత కావడంతో అందరూ అటెన్షన్‌లోకి వచ్చేశారు. ఆయన చెప్పింది చేయకుంటే అసలుకే ఎసరొస్తుందని భయపడ్డారో ఏమో.. రాష్ట్రంలోని నేతలంతా ఠంచనుగా ఫాలో అయిపోతున్నారు.
రోజూ ఏదోఒక అంశంపై రోడ్డెక్కుతున్న ఏపీ బీజేపీ!
ఢిల్లీ నాయకత్వం ఊరుకోబోదని శివప్రకాష్ వార్నింగ్!
శివప్రకాష్ ఎఫెక్ట్ ఏపీ బీజేపీలో బాగా కనిపిస్తోంది. వివిధ కార్యక్రమాల పేరుతో వరసగా రోడ్డెక్కుతున్నారు కమలనాథులు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై ఏదోఒక పిలుపు ఇవ్వడమే కాకుండా ముఖ్యనేతలంతా నిరసనలకు దిగుతున్నారు. ఓరోజు ప్రజా సమస్యలపై పోరాటం.. మరో రోజు పార్టీ అంతర్గత వ్యవహారాలపై సమావేశం అన్నట్టుగా కార్యక్రమాలు మొదలుపెట్టింది బీజేపీ. ఇదే సందర్భంలో డిల్లీ పర్యటనకు స్థానం కల్పించింది. శివప్రకాష్ గతంలో అమిత్‌షాతో కలిసి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కీలకంగా పనిచేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు చూసే నేతలకు అగ్రనాయకత్వం వద్ద చాలా పలుకుబడి ఉంటుంది. దీంతో శివప్రకాష్ సూచనలు పక్కాగా పాటించాల్సిన పరిస్థితి. అప్పుడప్పుడు స్టేట్మెంట్లు.. కుదిరినప్పుడు కార్యక్రమాలు అంటే పార్టీ పెరగదని ఆయన స్పష్టంగా చెప్పేశారట. లేకపోతే రాష్ట్రంలో పరిణామాలను ఢిల్లీ నాయకత్వం సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉందని హింట్ ఇచ్చారట.
శివప్రకాష్ వార్నింగ్ బాగానే పనిచేస్తోందా?
శివప్రకాష్ ఏపీతోపాటు దాదాపు 7 రాష్ట్రాల బీజేపీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు. రాష్ట్రాల్లో పార్టీ పనితీరుపై ఆయనే జాతీయ నాయకత్వానికి నివేదికలు ఇస్తారు. అందుకే శివప్రకాష్ ప్రభావం బీజేపీలో బాగానే కనిపిస్తోందట. ముందు సంస్థాగత వ్యవహారాలపై దృష్టి పెట్టి… కేడర్‌ను కార్యాన్ముఖులను చేస్తే తర్వాత జనాన్ని ఆకర్షించవచ్చన్న ప్రకాష్ సూచనల అమలులోకి వచ్చింది. ఎక్కడికక్కడ ప్రాంతీయ సమావేశాలు పెడుతూనే.. ఇంకోవైపు అక్కడ ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తున్నారు. మరి.. కొత్త నేత పర్యవేక్షణలో బీజేపీ అనుకున్న లక్ష్యాలకు చేరుకుంటుందో.. లేక ఆరంభశూరత్వంగానే మిగిలిపోతుందో చూడాలి.